T20 WORLD CUP | న్యూజీలాండ్‌ను మట్టికరిపించిన అఫ్ఘనిస్తాన్
పురుషుల వరల్డ్ కప్(Mens T20 World Cup) లో మరో సంచలనం నమోదైంది. చిన్న జట్టుగా వచ్చిన అఫ్ఘనిస్తాన్( Afganisthan), మేటి జట్టయిన న్యూజిలాండ్( New Zealand) ను ఘోర పరజయం పాలు చేసింది. అఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan)రికార్డు బౌలింగ్‌తో న్యూజీల్యాండ్ బ్యాటింగ్‌ను తుత్తునియలు చేసాడు.
టి20 ప్రపంచకప్‌లో న్యూజీలాండ్‌పై అఫ్ఘనిస్తాన్ ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి అఫ్ఘన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన న్యూజీలాండ్, తన అంచనాలు తప్పని తెలుసుకుంది. అఫ్ఘన్ ఓపెనర్లు రహమనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్‌లు న్యూజీలాండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ, మొదటి వికెట్‌కు 103 పరుగులు జోడించారు. ఐపీఎల్లో కోల్‌కతా తరపున ఆడిన గుర్బాజ్( Rahmanullah Gurbaz) బ్యాటింగ్‌లో తన దూకుడు చూపించి, 56 బంతుల్లో, 5 సిక్స్‌లు, 5 ఫోర్ల సహాయంతో 80 పరుగులు చేసాడు. మరో ఓపెనర్ జద్రాన్( Ibrahim Zadran) 44 పరుగులు సాధించాడు. తర్వాత ఎవరూ పెద్దగా ఆకట్టుకోకపోయినా, అఫ్ఘన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్(Trent Boult), మాట్ హెన్నీ చెరో 2 వికెట్లు తీసుకోగా, ఫెర్గూసన్ ఒకటి తీసుకున్నాడు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ మొదటి బంతి నుండే వికెట్ల సమర్పణ ప్రారంభించింది. ఇన్నింగ్స్ తొలిబంతికే ఓపెనర్ ఫిన్ అలెన్‌ను ఫరూకీ క్లీన్ బౌల్డ్ చేసాడు. ఇక అక్కన్నుంచి మొదలైన వికెట్ల పతనం 10 వికెట్ల దాకా ఆగలేదు. ఫరూకీ ఓపెనర్లిద్దరినీ పెవిలియన్‌కు పంపాక, కెప్టెన్ రషీద్ తన వంతుగా కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్తో వికెట్ల వేట ప్రారంభించాడు. ఫరూఖీ, రషీద్ ఒకరి వెనుక ఒకరు వికెట్లు తీస్తూ పోయారు. వారికి మహ్మద్ నబీ రెండు వికెట్లు తీసి తనో చేయి వేసాడు. ఫరూఖీ, రషీద్ చెరో నాలుగు పంచుకోగా, నబీ మిగిలిన రెండు తన ఖాతాలో వేసుకున్నాడు. వీరి ధాటికి న్యూజీలాండ్ జట్టంతా కలిపి అఫ్ఘన్ ఓపెనర్ల స్కోరు కూడా చేయలేకపోయారు. మొత్తానికి 15.2 ఓవర్లలో 75 పరుగులకు కివీస్ పని పూర్తయింది(75 All Out). కివీస్ బ్యాటర్లలో అత్యధిక స్కోరు చేసింది గ్లెన్ ఫిలిప్స్(18).

ఐపీఎల్ లో పెద్దగా రాణించని అఫ్ఘన్ కెప్టెన్ రషీద్‌ఖాన్ వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనే సత్తా చాటి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రషీద్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. కేన్ విలియమ్సన్ , మార్క్ చాప్మన్, బ్రేస్ వెల్, లాకీ ఫెర్గూసన్ వికెట్లను తీసుకున్న రషీద్ ఖాన్ , టీ20 ప్రపంచకప్ చరిత్రలో కెప్టెన్‌గా అత్యుత్తమ గణాంకాలను (4/17) నమోదు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ కివీస్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరీ, ఒమన్ కెప్టెన్ జీషన్ మసూద్ పేరిట ఉంది. ఇద్దరూ కూడా సంయుక్తంగా 4/20 బౌలింగ్ గణాంకాలతో మొదటిస్థానంలో ఉండగా, రషీద్ దాన్ని బద్దలు కొట్టాడు. భారత్‌తో 2007 లో జరిగిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో వెట్టోరి (4/20) ఈ ఘనత సాధిస్తే, జీషన్ 2021 వరల్డ్ కప్ లో పపువా న్యూ గినియాపై ఈ గణాంకాలను నమోదు చేసాడు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram