WPL 2026 – MI vs UPW | లానింగ్–లిచ్‌ఫీల్డ్ మెరుపులతో ముంబైపై యూపీ మరో విజయం
లానింగ్–లిచ్‌ఫీల్డ్ అద్భుత భాగస్వామ్యం, షిఖా పాండే కీలక వికెట్లు, ముంబై పేలవ బ్యాటింగ్‌తో యూపీ వారియర్స్ WPLలో ముంబై ఇండియన్స్‌పై వరుసగా రెండో విజయం సాధించారు. 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై విఫలమై 22 పరుగుల తేడాతో ఓడిపోయింది.
WPL 2026: Lanning–Litchfield Shine as UPW Beat MI Again
విధాత క్రీడా విభాగం | 17 జనవరి 2026 | హైదరాబాద్:
WPL 2026 – MI vs UPW | నవీ ముంబయిలో జరిగిన WPL మ్యాచ్‌లో యూపీ వారియర్స్ ముంబై ఇండియన్స్‌పై మరోసారి ఆధిక్యం ప్రదర్శించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన యూపీ, తొలి ఓవర్‌లో కిరణ్ నవగిరే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగినా, మెగ్ లానింగ్, ఫీబీ లిచ్‌ఫీల్డ్ జంట అండతో 187 పరుగులు చేసింది. ఫలితంగా ముంబై 165 పరుగులే చేసి యూపీ చేతిలో మరో పరాజయం మూటగట్టుకుంది.
మరోసారి తడబడిన ముంబై బ్యాటింగ్ : కేర్–అమన్‌జోత్ పోరాటం వృథా
యూపీ విధించిన 188 పరుగుల లక్ష్యంతో చేధన ప్రారంభించిన ముంబై బ్యాటింగ్ ఈ మ్యాచ్‌లో కూడా పవర్‌ప్లేలో బలహీనంగానే కనిపించింది. సజనా, హేలీ మ్యాథ్యూస్‌ల కొత్త ఓపెనింగ్ జంట నిలబడలేకపోయింది. 23 పరుగుల జట్టు స్కోరు వద్ద ఇద్దరు ఓపెనర్లు డగౌట్‌కు చేరుకున్నారు. MI 6 ఓవర్లలో ముంబై కేవలం 38 పరుగులే చేయడం వారి బ్యాటింగ్ బలహీనతకు ఉదాహరణ. సివర్-బ్రంట్ బాగానే కనిపించినా షిఖా పాండే బౌలింగ్‌లో కవర్స్‌లో లానింగ్ చేతికి క్యాచ్ ఇవ్వడంతో ముంబైపై ఒత్తిడి మరింత పెరిగింది. కేరీ, హర్మన్‌ప్రీత్ కూడా త్వరగానే ఔట్ కావడంతో కావాల్సిన రన్‌రేట్ భారీగా పెరిగింది. చివర్లో అమీలియా కేర్–అమన్‌జోత్ జంట 83 పరుగుల భాగస్వామ్యంతో ఆశలు రేపినా, అవసరమైన రన్‌రేట్‌ను అందుకోవడం సాధ్యం కాలేదు. అమన్‌జోత్ కొంత పోరాడినా, పాండే బౌలింగ్‌లో ఆమె కూడా ఔట్ కావడంతో ముంబై విజయానికి దూరమైంది. చివరకు నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 6 వికెట్ల నష్టానికి165 పరుగులే చేసి పరాజయం పాలైంది.
లానింగ్, లిచ్ఫీల్డ్ల పట్టుదలతో గట్టి స్కోరు చేసిన యూపీ
అంతకుముందు టాస్ ఓడిపోయి, బ్యాటింగ్ చేపట్టిన యూపీ వారియర్స్ మొదటి ఓవర్లోనే కిరణ్ నవ్‌గిరేను కోల్పోగా, కెప్టెన్ లానింగ్, లిచ్‌ఫీల్డ్ దూకుడుతో గాడిలో పడింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. లిచ్‌ఫీల్డ్ 37 బంతుల్లో 61, లానింగ్ 45 బంతుల్లో 70 పరుగులు చేసి వెంటవెంటనే అవుటైనా, హర్లీన్ డియోల్, క్లో ట్రయన్ సహకారంతో యూపీ 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి పోరాటానికి తగ్గ స్కోరు అందుకుంది. చివరిలో ముంబై బౌలర్లు పుంజుకున్నప్పటికీ అప్పటికే మంచి స్థానానికి చేరుకున్న యూపీని దెబ్బతీయలేకపోయారు.
టాస్ ఓడినా, లానింగ్ నాయకత్వం, లిచ్‌ఫీల్డ్ దూకుడు, పాండే కీలక వికెట్లు వారియర్స్ విజయానికి ప్రధాన కారణాలు కాగా, ముంబై ఇండియన్స్‌ను మాత్రం బ్యాటింగ్ సమస్యలు వెంటాడుతునే ఉన్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram