Sudha Murthy | కుల గణన సిబ్బందితో సుధా మూర్తి సంచలన వ్యాఖ్యలు

కర్ణాటక ప్రభుత్వం నిర్వహిస్తున్న కుల గణనలోకి పాల్గొనేందుకు ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఆయన భార్య సుధా మూర్తి నిరాకరించారు. ఈ సందర్భంగా సుధా మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.

  • By: TAAZ |    states |    Published on : Oct 16, 2025 6:22 PM IST
Sudha Murthy | కుల గణన సిబ్బందితో సుధా మూర్తి సంచలన వ్యాఖ్యలు

Sudha Murthy | కర్ణాటకలో సామాజిక, విద్యా సర్వేలో పాల్గొనేందుకు ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఆయన భార్య సుధా మూర్తి నిరాకరించారు. ఈ సందర్భంగా సుధామూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కర్ణాటకవ్యాప్తంగా కొసాగుతున్న కుల గణనలో భాగంగా ఎన్యూమరేటర్ల బృందం ఇటీవల నారాయణ మూర్తి నివాసానికి వెళ్లింది. అయితే.. తమ ఇంట్లో కుల గణన నిర్వహించేందుకు వాళ్లు నిరాకరించినట్టు తెలిసింది. ‘మా ఇంట్లో కుల గణన నిర్వహించడం మాకు ఇష్టం లేదు’ అని సుధామూర్తి పేర్కొన్నారని తెలిసింది. తాము ఎలాంటి వెనుకబడి కులానికి చెందినవారిమి కాదని, కనుక ఈ సర్వేలో పాల్గొనబోవడం లేదని కన్నడ భాషలో సిబ్బందికి సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ద్వారా రాతపూర్వకంగా తెలియజేశారని సమాచారం.

ఈ సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారాన్ని సామాజిక, విద్యా సర్వే 2025 వెనుకబడిన వర్గాల కమిషన్‌ జారీ చేసింది. దీనిపై సుధామూర్తి సంతకం చేశారు. ‘మాకున్న కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా సామాజిక, విద్యా సర్వేకు సమాచారం అందించేందుకు నేను నిరాకరిస్తున్నాను. మేం ఎటువంటి వెనుకబడి కులానికి చెందిన వాళ్లం కాదు. అందుకే మేం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కుల గణన సర్వేలో పాల్గొబోవడం లేదు’ అని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంలో వివరణ తీసుకునేందుకు మీడియా ప్రయత్నించగా.. ఆమె వ్యక్తిగత సిబ్బంది కానీ, ఇన్ఫోసిస్‌ అఫిషియల్స్‌ కానీ స్పందించలేదు.

సెప్టెంబర్‌ 22న ప్రారంభమైన సర్వే.. అక్టోబర్‌ 7తో ముగియాల్సి ఉన్నప్పటికీ.. అక్టోబర్‌ 18 వరకూ గడువు పొడిగించారు. ఈ ప్రక్రియలో రాష్ట్రంలోని వివిధ పాఠశాలల టీచర్లు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న నేపథ్యంలో స్కూళ్లకు అప్పటి వరకూ సెలవులు ప్రకటించారు. దీంతో బోధనా తరగతుల విషయంలో విద్యార్థులు గణనీయమైన రోజులను కోల్పోతున్నారు.