Mahesh Kumar Goud : బీసీ రిజర్వేషన్లకు అడ్డు పడుతున్న బీఆర్ఎస్‌, బీజేపీ

బీజేపీ, బీఆర్‌ఎస్ లోపాయికారి ఒప్పందంతో బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీసీ సంఘాల జేఏసీ ఈ నెల 18న నిర్వహించే రాష్ట్ర బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

Mahesh Kumar Goud : బీసీ రిజర్వేషన్లకు అడ్డు పడుతున్న బీఆర్ఎస్‌, బీజేపీ

హైద‌రాబాద్, అక్టోబ‌ర్‌16(విధాత‌): బీజేపీ, బీఆరెస్ పార్టీలు లోపాయికారి ఒప్పందంతో బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నాయ‌ని పీసీసీ అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ మ‌హేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గురువారం గాంధీ భ‌వ‌న్‌లో బీసీ సంఘాల జేఏసీతో స‌మావేశం అయ్యారు. బీసీ సంఘాల జేఏసీ ఈ నెల‌18వ తేదీన నిర్వ‌హించే రాష్ట్ర బంద్‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ బంద్‌ను పూర్తిగా విజ‌య‌వంతం చేయాల‌ని ఆయ‌న రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను కోరారు. బీసీ బంద్ తో క‌నువిప్పు క‌లుగాల‌న్నారు.
రిజర్వేషన్ల 9 వ షెడ్యూల్ చేర్చే విషయంలో ప్రధాని మోదీని అడిగేందుకు బీజేపీ నేతలు ఎందుకు జంకుతున్నారని ప్ర‌శ్నించారు.

కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్ల‌రేష‌న్‌కు క‌ట్టుబ‌డి ఉంద‌ని చెప్పారు. రాష్ట్రంలో కుల స‌ర్వేకు అగ్ర‌నేత‌ రాహుగాంధీ నే ఆధ్యుల‌ని అన్నారు. తెలంగాణ బీసీ ప్ర‌జ‌ల‌కు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేర‌కు కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం శాస్త్రీయంగా కుల స‌ర్వే నిర్వ‌హించి అఫిషియ‌ల్ డాక్యుమెంట్ ఇచ్చామ‌న్నారు. స్వాతంత్య్రం వ‌చ్చిన త‌రువాత శాస్త్రీయంగా నిర్వ‌హించిన స‌ర్వేగా మ‌హేశ్‌కుమార్ గౌడ్‌ అభివ‌ర్ణించారు. బీసీ రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో వెనుక‌డుగు వేసే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. రాహుల్ గాంధీ ఎవరి వాటా వారికి అన్న నినాదం నేడు ఉద్యమంగా మారిందన్నారు. రాహుల్ గాంధీ నినాదం బీసీల‌కు గొప్ప వరమ‌న్నారు. సిఎం రేవంత్ కు,నాకు ఉన్న సఖ్యత దేశంలో ఎక్కడా లేదన్నారు. రాహుల్ గాంధీ ఆశయ సాధన కోసం సీఎం రేవంత్ ఎనలేని కృషి చేస్తున్నారని మ‌హేశ కుమార్ చెప్పారు.

బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు అసెంబ్లీలో మ‌ద్దతు ఇచ్చి బ‌య‌ట‌కు వ‌చ్చి మొకాల‌డ్డుతున్నార‌ని మ‌హేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం న్యాయ పరంగా పోరాడుదామ‌న్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే అన్న ఆయ‌న‌, రిజర్వేషన్ల కోసం రాజ‌కీయాల‌కు అతీతంగా అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉందన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతామ‌న్నారు.