eggs found in volcano | వేల గుడ్లను పొదుగుతున్న అగ్నిపర్వతం? ఎక్కడ.. ఆ కథేంటి?

అగ్నిపర్వతాలు విస్ఫోటం చెందితే.. పెను విధ్వంసాన్ని సృష్టిస్తాయి. కానీ.. అవే అగ్నిపర్వతాలు సముద్ర గర్భాన వేల అడుగల లోతున జీవ వైవిధ్యాన్ని కూడా కాపాడుతుంటాయి. దీనికి సంబంధించిన సంచలన విషయం అధ్యయనాల్లో వెల్లడైంది.

eggs found in volcano | వేల గుడ్లను పొదుగుతున్న అగ్నిపర్వతం? ఎక్కడ.. ఆ కథేంటి?

eggs found in volcano | సముద్రగర్భం మిస్టరీల పుట్ట. ఒకదాన్ని గుర్తించి, దానిని అధ్యయనం చేస్తుండగానే మరోటి నేనున్నానంటూ సవాలు విసురుతూ ఉంటుంది. ఇలాంటి ఒక మిస్టరీ మీద తీవ్రస్థాయిలో పరిశోధన చేస్తున్నారు శాస్త్రవేత్తలు. కెనడాలో చురుకుగా ఉన్న ఒక అగ్నిపర్వతం వద్ద వేల కొద్దీ గుడ్లు ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. అయితే.. ఇది భూమిపై కాకుండా.. సముద్ర గర్భంలో ఉండటం విశేషం. మానవులకు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్న పసిఫిక్‌ వైట్‌ స్టేక్‌ అనే సముద్ర జీవి (చేప) ఈ గుడ్లను పెట్టి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వాంకోవర్‌ దీవి సమీప తీరంలో ఉన్న ఒక అగ్నిపర్వతం వద్ద ఈ గుడ్లను గుర్తించారు. మెరైన్‌ ఎకోసిస్టమ్‌లో వైచిత్రిని ఇది వివరిస్తున్నదని అంటున్నారు. సాధారణంగా గుడ్లను వాటి తల్లులే పొదుగుతాయి. అయితే.. ఇక్కడ అగ్నిపర్వతం ఒక ఇంక్యుబేటర్‌గా మారి వాటిని పొదుగుతున్నదన్నదని చెబుతున్నారు. అంటే.. ఆ అగ్నిపర్వతం నుంచి వెలువడే వేడి.. ఆ గుడ్లను పొదిగేందుకు దోహదం చేస్తున్నదన్నమాట. 2019లో మొదటిసారి వీటిని గమనించిన శాస్త్రవేత్తలు ఈ మిస్టీరియస్‌ గుడ్లను చూసి ఆశ్చర్యపోయారు. వాస్తవానికి అప్పటివరకూ సదరు అగ్నిపర్వతం నిద్రాణ స్థితిలో ఉన్నట్టు భావించారు. అయితే.. తర్వాత అన్వేషణలు ఆ భావనను పూర్తిగా మార్చేశాయి. 3600 అడుగుల ఆ అగ్నిపర్వతం సముద్రజీవులు బతికేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నదని తేలింది. ఆ అగ్నిపర్వతం విడుదల చేసే వెచ్చదనం, పుష్టికర ధాతువులతో (మినరల్స్‌) కూడిన జలాలు.. ఆ గుడ్లను పొదుగుతున్నాయి.

పసిఫిక్‌ మహా సముద్రం లోతుల్లో పసిఫిక్‌ వైట్‌ స్కేట్‌ అనే చేప జీవిస్తుంటుంది. అది అత్యంత చల్లటి వాతావరణం ఉండే 2,600 నుంచి 9,500 అడుగుల లోతు వరకూ ఈదుకుంటూ వెళ్లగలదు. ఈ స్కేట్‌లు ఆరున్నర అడుగల వరకూ పెరుగుతాయి. వాటి గుడ్లు కూడా అదే స్థాయిలో 18 నుంచి 20 అంగుళాల వెడల్పుతో ఉంటాయి. ఈ గుడ్ల నుంచి చేపపిల్లలు బయటకు రావడానికి నాలుగు సంవత్సరాల సుదీర్ఘ సమయం పడుతుంది. ఈ పరిస్థితిలో వాటిలో పిండం అభివృద్ధిని ఈ అగ్నిపర్వతం నుంచి వచ్చే వెచ్చదనం ప్రభావతం చేస్తుంది. అంటే.. ఈ అగ్నిపర్వతం ఆ గుడ్లను ఒక ఇంక్యుబేటర్‌ మాదిరిగా పొదుగుతూ ఉంటుందన్నమాట. 2023లో పసిఫిక్‌ వైట్‌ చేపలు వాంకోవర్‌ దీవి సమీపంలోని అగ్నిపర్వతం వద్ద గుడ్లు పెడ్టడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. ఇదే కాకుండా ఇంకా అనేక సముద్రజీవులు సైతం ఇలా అగ్నిపర్వతాల వద్ద గుడ్లు పెడుతుంటాయని చెబుతున్నారు.

ఇవికూడా చదవండి..

Maoists | కర్రెగుట్టల నుంచి మకాం మార్చిన మావోయిస్టులు! ఆపరేషన్‌లో కీలక మలుపు..
Machilipatnam | మచిలీపట్నం.. అదేనండీ.. బందర్‌కు ఆ పేరెలా వచ్చింది?మీకు తెలుసా
Zealandia continent | క‌నిపించేవి ఏడు ఖండాలైతే.. క‌నిపించ‌ని ఆ ఎనిమిదో ఖండ‌మే.. జీలాండియా!
King Cobra, Mongoose Fight | కింగ్ కోబ్రా, తెల్ల తోక ముంగిస మ‌ధ్య ఫైట్‌లో గెలిచేదేంటి?