AI Chatbots Study | చాట్‌బాట్‌లు సమాధానాలిచ్చే తీరుపై శాస్త్రవేత్తల ప్రయోగం.. విస్తుపోయే వాస్తవాలు వెల్లడి!
అయ్యా.. బాబూ.. దయచేసి చెప్పు.. ప్లీజ్.. అంటూ బతిమలాడటం కంటే.. దురుసుగా అడిగితేనే కచ్చితత్వంతో కూడిన సమాధానాలు వస్తాయని శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో గుర్తించారు. ఇది శాస్త్రీయ ఆసక్తితో నిర్వహించిన అధ్యయనమని, దీనిని యూజర్‌లు ఫాలో అయితే.. లైఫ్‌లో దెబ్బతింటారని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
AI Chatbots Study | ఈ మధ్య కాలంలో ప్రతి దానికీ ఏఐ చాట్‌బాట్‌లను వినియోగించడం సర్వసాధారణమైపోయింది. అయితే.. మనం అడిగే తీరును బట్టి చాట్‌బాట్‌లు సమాధానాలు ఇస్తారని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ప్రత్యేకించి చాలా మర్యాదపూర్వకంగా అంటే.. ఉదాహరణకు ‘ఈ ప్రశ్న విషయంలో నేను మీ సహాయాన్ని కోరవచ్చునా?.. అని అడిగినప్పడు ఇచ్చే సమాధానాలకంటే.. దురుసుగా .. అంటే నీకు తెలివి లేదని నాకు తెలుసు.. కానీ.. దీన్ని ప్రయత్నించు.. అంటూ అడిగితే మరింత నిర్దిష్టమైన జవాబులు వస్తున్నాయని శాస్త్రవేత్తల పరిశీలనలో వెల్లడైంది. అదే సమయంలో ఇలా కించపరుస్తూ మాట్లాడే విషయంలో కొన్ని నష్టాలు కూడా ఉంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దీనికి సంబంధించిన కొత్త అధ్యయనం అక్టోబర్ 6వ తేదీన arXiv ప్రిప్రింట్ డాటాబేస్‌లో పబ్లిష్ అయ్యింది. ఏఐ సిస్టమ్స్‌ను మర్యాదపూర్వకంగా అడగటానికి, దురుసుగా అడగటానికి మధ్య తేడాను ఈ అధ్యయనం ద్వారా పరిశీలించారు. ఈ పరిశోధన ఇంత వరకూ పీర్ రివ్యూ (నిపుణులు అధ్యయనం చేసి, సరిదిద్దటం) కాలేదు.
యూజర్ ఏ టోన్‌లో అడిగితే ఏఐ చాట్‌బాట్‌లు కచ్చితత్వంతో సమాధానాలు ఇస్తాయో పరిశీలించేందుకు శాస్త్రవేత్తలు 50 రకాల మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను తయారు చేశారు. అనంతరం వాటి పదాల్లో మార్పులు చేసి ఐదు క్యాటగిరీలుగా మార్చారు. అందులో అత్యంత మర్యాదపూర్వకంగా అడగటం, మర్యాదగా, సహజంగా, దురుసుగా, అత్యంత దురుసుగా అడగటం అనే క్యాటగిరీల్లో చేర్చారు. గణితం, చరిత్ర, సైన్స్ తదితర సబ్జెక్టుల నుంచి ప్రశ్నలను ఎంపిక చేశారు. ప్రతి ప్రశ్నకు ఒకటి సరైన సమాధానం ఉండేలా నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. అప్పటికే సమాధానాలు ఉన్న 250 ప్రశ్నలను ఓపెన్‌ఏఐ అభివృద్ధి చేసిన అత్యంత అడ్వాన్స్‌డ్ వెర్షన్ చాట్‌జీపీటీ–4oకు ఫీడ్ చేశారు.
ఫలితాలను విశ్లేషించినప్పుడు మర్యాదపూర్వకంగా అడిగిన వాటికి 81.4శాతం కచ్చితత్వంతో సమాధానాలు వచ్చాయి. చాలా మర్యాదపూర్వక ప్రాంప్ట్‌లకు 80.8శాతం కచ్చితత్వంతో, దురుసుగా అడిగిన ప్రశ్నలకు 84.8 శాతం కచ్చితత్వంతో జవాబులు వచ్చాయి. సాధారణ పద్ధతిలో అడిగినవాటికి 82.8 శాతం కచ్చితత్వంతో సమాధానాలు లభించాయి. ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌ను అభివృద్ధి చేసే ప్రాజెక్టులో భాగంగా ఈ అధ్యయనం నిర్వహించారు.
అయితే.. మర్యాదపూర్వకంగా అడిగిన వాటికంటే దురుసుగా కఠినంగా అడిగిన ప్రశ్నలకు కచ్చితత్వంతో కూడిన సమాధానాలు రావటం ఆశ్చర్యం కలిగించిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే.. తమ ప్రయోగాలు చాలా ప్రాథమికవైనవని తెలిపారు. అంత మాత్రాన తాము ఏఐ చాట్‌బాట్‌లతో దురుసుగా ప్రవర్తించాలని చెప్పబోటం లేదని స్పష్టం చేశారు. ఏఐ–మానవ సంప్రదింపుల్లో డిమాండింగ్ భాష, లేదా అవమానకరమైన భాష ఉపయోగించడం వల్ల వాస్తవ ప్రపంచంలో యూజర్ ఎక్స్‌పీరియన్సెస్, యాక్సెసిబిలిటీ, ఇన్‌క్లూజివిటీపై ప్రతికూల ప్రభావాలు పడుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అంతేకాకుండా.. హానికరమైన కమ్యూనికేషన్ నిబంధనలకు దారి తీస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే చాట్‌బాట్‌లను అధికంగా వినియోగించేవారు మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇలా దూషిస్తూ అడగటం మొదలు పెడితే.. యూజర్ల వ్యక్తిగత జీవితంలోనూ అదే తరహా ధోరణులు ప్రబలే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
Arattai | ఆరట్టై హీట్‌లో భారత్ – ఇండియన్ వాట్సాప్‌కు 75 లక్షల డౌన్లోడ్లు
GPT-5 | చాట్ జీపీటీ కొత్త అవతారం.. ‘ప్రొఫెసర్’ జీపీటీ–5 ఆవిష్కరణ
డిజిటల్ సైలెన్స్ : మానసిక ప్రశాంతతకు మార్గం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram