Tech tips | వాట్సాప్‌ గూఢచర్యం చేస్తోందా.. రహస్యంగా యూజర్ల పర్సనల్స్‌ తెలుసుకుంటోందా..?

Tech tips | ఇటీవల ఒక ట్విటర్‌ ఇంజినీర్‌ చేసిన ట్వీట్‌తో వాట్సాప్‌ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. వాట్సాప్‌ రాత్రి సమయంలో తాను గాఢ నిద్రలో ఉన్నప్పుడు తన మొబైల్‌ ఫోన్‌లోని మైక్రోఫోన్‌ను వినియోగిస్తోందని ఆయన ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌ వైరల్‌ అయ్యింది.

Tech tips | వాట్సాప్‌ గూఢచర్యం చేస్తోందా.. రహస్యంగా యూజర్ల పర్సనల్స్‌ తెలుసుకుంటోందా..?

Tech tips : డాటా భద్రతపై యూజర్లకు ఎలాంటి అపోహలు అక్కర్లేదని వాట్సాప్‌ తరచుగా తన వైఖరిని స్పష్టం చేస్తూ ఉంటుంది. కానీ, 2021 జనవరిలో వాట్సాప్‌ (WatsApp) తన యూజర్ల డాటాను మెటాతో పంచుకుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో వాట్సాప్‌ తన హెల్ప్‌ సెంటర్‌ వెబ్‌పేజీలో వివరణ ఇచ్చింది. వాట్సాప్‌ వినియోగదారుల వ్యక్తిగత సందేశాలను చూడలేదని, వారి కాల్స్‌ను వినలేదని, అంతేగాక వినియోగదారుల కాంటాక్టులనుగానీ, లొకేషన్‌నుగానీ మెటాతో పంచుకోదని పేర్కొంది. తన మెస్సేజ్‌లపై వాట్సాప్‌ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ (మెస్సేజ్‌ను పంపుతున్న, స్వీకరిస్తున్న ఇద్దరికి మాత్రమే యాక్సెస్‌) ను అందిస్తుందని తెలిపింది. అందువల్ల ఇతరులే కాదు, ఆఖరికి వాట్సాప్ కూడా యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయలేదని వివరించింది.

దాంతో అప్పట్లో ఆ వివాదం సద్దుమణిగినప్పటికీ.. ఇటీవల ఒక ట్విటర్‌ ఇంజినీర్‌ చేసిన ట్వీట్‌తో వాట్సాప్‌ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. వాట్సాప్‌ రాత్రి సమయంలో తాను గాఢ నిద్రలో ఉన్నప్పుడు తన మొబైల్‌ ఫోన్‌లోని మైక్రోఫోన్‌ను వినియోగిస్తోందని ఆయన ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌ వైరల్‌ అయ్యింది. ఎలాన్‌ మస్క్‌ కూడా ఆ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ ‘వాట్సాప్‌ను విశ్వసించలేం’ అని పేర్కొన్నారు. ఆ వైరల్ ట్వీట్ పలువురు వినియోగదారులను ఆందోళనకు గురిచేసింది. చాలామంది యూజర్లు వాట్సాప్‌ తమ మొబైల్స్‌లోని మైక్రోఫోన్ల ద్వారా గూఢచర్యానికి పాల్పడుతున్నదని చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ నిజంగానే యూజర్లపై గూఢచర్యానికి పాల్పడుతున్నదా.. రహస్యంగా వారి సంభాషణలను వింటున్నదా..? అనే అంశాలను చర్చిద్దాం..

1. వాట్సాప్‌ను విశ్వసించలేం : ఎలాన్ మస్క్

తెల్లవారుజామున 4:20 గంటల నుంచి 6:53 గంటల వరకు తాను గాఢ నిద్రలో ఉన్న సమయంలో తన మొబైల్‌ ఫోన్‌లోని మైక్రోఫోన్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో వాట్సాప్‌ యాక్సెస్ చేస్తున్నట్లు ఆండ్రాయిడ్ డ్యాష్‌బోర్డులో కనిపిస్తున్నదని ఫోడ్‌ దబిరి (Foad Dabiri) అనే ట్విటర్ ఇంజనీర్ ట్విటర్‌లో పేర్కొన్నాడు. ఈ మేరకు ఆండ్రాయిడ్ డ్యాష్‌బోర్డు స్క్రీన్‌ షాట్‌ను షేర్ చేస్తూ ట్వీట్‌ చేశాడు. దాంతో వాట్సాప్‌ గోప్యతపై మరోసారి అనుమానాలు రేకెత్తాయి. వాట్సాప్‌ గోప్యతను విశ్వసించలేం అంటూ ఇంజనీర్ ట్వీట్‌ను ఎలాన్ మస్క్‌ రీట్వీట్‌ చేశారు.

2. కావాలంటే గూగల్‌ దర్యాప్తు చేయవచ్చు : వాట్సాప్‌

యూజర్స్‌ గోప్యతలో ఎలాంటి సందేహం అక్కర్లేదని, ఆందోళన చెందవద్దని వాట్సాప్‌ మరోసారి ట్విటర్లో స్పష్టంచేసింది. గూగుల్‌ పిక్సెల్‌ మొబైల్‌ ఫోన్‌లో ఉన్న ఆండ్రాయిడ్‌లోని బగ్ కారణంగా సమస్య తలెత్తుతున్నదని పేర్కొంది. గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడుతున్న ట్విటర్‌ ఇంజనీర్‌తో తాము మాట్లాడామని తెలిపింది. ట్విటర్‌ ఇంజినీర్‌ వాడుతున్న ఫోన్ గూగుల్ పిక్సెల్ అయినందున, ఈ విషయంపై దర్యాప్తు చేయాలని గూగుల్‌ను వాట్సాప్‌ కోరింది. వాట్సాప్‌ వినియోగదారులకు వారి మైక్రోఫోన్ సెట్టింగులపై పూర్తి నియంత్రణ ఉంటుందని, వినియోగదారు కాల్ చేస్తున్నప్పుడు, వాయిస్ నోట్ లేదా వీడియోను రికార్డ్ చేస్తున్నప్పుడు మాత్రమే మైక్‌ని యాక్సెస్ చేయగలరని మరో ట్వీట్‌లో వాట్సాప్ పేర్కొంది.

3. అది బగ్గేనని తేల్చిన గూగుల్

ట్విటర్‌ ఇంజినీర్‌ ఫోన్‌లోని మైక్రోఫోన్‌ను వాట్సాప్‌ యాక్సెస్‌ చేస్తున్నట్లుగా ఆండ్రాయిడ్‌ డ్యాష్‌ బోర్డులో కనిపించడానికి ఆ ఆండ్రాయిడ్‌లో ఉన్న బగ్గే కారణమని, ఫోన్‌ ఆండ్రాయిడ్‌లో తప్పుడు సమాచారాన్ని ఉత్పత్తి చేసే బగ్ నిజంగానే ఉందని Google ప్రతినిధి ధృవీకరించారు. ఫోన్‌ ప్రైవసీకి సంబంధించి ఆ బగ్‌ తప్పుడు సూచనలు ఇస్తున్నదని తెలిపారు. సమస్యను తాము పరిష్కరించామని చెప్పారు.

4. సీరియస్‌గా తీసుకున్న ఇండియన్‌ గవర్నమెంట్

వాట్సాప్‌ తన యూజర్ల ఫోన్‌లలోని మైక్రోఫోన్‌లను రహస్యంగా వినియోగిస్తుందన్న ప్రచారం వెల్లువెత్తడంతో భారత ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నది. ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకుందని భారత ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి తెలిపారు. యూజర్ల వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమేనేది అంగీకరించలేని అంశమని, గోప్యత ఉల్లంఘన జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి ట్వటర్‌లో పేర్కొన్నారు.

5. వాట్సాప్‌ గోప్యతా విధానం ఇదే

వినియోగదారుల వ్యక్తిగత సమాచార గోప్యత, భద్రతలకే తమ గోప్యతా విధానం ప్రాధాన్యం ఇస్తుందని వాట్సాప్‌ నొక్కి చెప్పింది. వాట్సాప్‌ అధికారిక వెబ్‌సైట్‌లో దాని ప్రైవసీ పాలసీ గురించి ఈ విధంగా ఉంది. ‘మేముగానీ, మెటాగానీ మీ వ్యక్తిగత సందేశాలను చూడటమో, మీ కాల్స్‌ను వినడటమో చేయలేం. మీరు మీ కుటుంబసభ్యులు, మిత్రులు, సహోద్యోగులకు పంపుకునే సందేశాలను మేం చదవలేం, కాల్స్‌ను వినలేం. మీరు వాట్సాప్‌లో ఏది షేర్ చేసినా అది మీ మధ్యనే ఉంటుంది. మొబైల్‌లో మీరు కోరుకుంటేనే మైక్రోఫోన్‌ను వాడగలరు. దాన్ని గూఢచర్యం అనలేం’ అని వాట్సాప్‌ స్పష్టం చేసింది.