వాహ‌న‌దారుల‌కు ఊర‌ట‌.. తొలి సీఎన్‌జీ బైక్ వ‌చ్చేసింది.

పెరిగిన పెట్రోల్ ధ‌ర‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న వాహ‌న‌దారుల‌కు ఊర‌ట క‌లిగించే వార్త ఇది. ప్ర‌పంచంలోనే తొలిసారిగా సీఎన్‌జీ బైక్ వ‌చ్చేసింది.

వాహ‌న‌దారుల‌కు ఊర‌ట‌.. తొలి సీఎన్‌జీ బైక్ వ‌చ్చేసింది.

పెరిగిన పెట్రోల్ ధ‌ర‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న వాహ‌న‌దారుల‌కు ఊర‌ట క‌లిగించే వార్త ఇది. ప్ర‌పంచంలోనే తొలిసారిగా సీఎన్‌జీ బైక్ వ‌చ్చేసింది. ప్ర‌ముఖ ఆటో దిగ్గ‌జం బ‌జాజ్ ఆటో కంపెనీ ఈ బైక్‌ను ఫ్రీడ‌మ్ 125 పేరుతో శుక్ర‌వారం మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ హాజ‌రై ఈ బైక్‌ను లాంఛ్ చేశారు.

సీఎన్‌జీ బైక్ ప్ర‌త్యేక‌త‌లివే..

ఫ్రీడ‌మ్ 125 బైక్.. ఫ్రీడ‌మ్ డిస్క్ ఎల్ఈడీ, ఫ్రీడ‌మ్ డ్ర‌మ్ ఎల్ఈడీ, ఫ్రీడ‌మ్ డ్ర‌మ్ అనే మూడు వేరియంట్ల‌లో మార్కెట్లో ల‌భించ‌నుంది. డ్యూయ‌ల్ టోన్ క‌ల‌ర్‌తో ఏడు రంగుల్లో ఈ బైక్ అందుబాటులో ఉంది. ఫ్రీడ‌మ్ బైక్‌కు ట్విన్ ట్యాంక‌ర్‌ను అమ‌ర్చారు. అంటే సీఎన్‌జీతో పాటు పెట్రోల్ ట్యాంక‌ర్‌ను అమ‌ర్చారు.

ఫీచ‌ర్లు ఇవే..

125 సీసీ ఇంజిన్ క‌లిగిన ఫ్రీడ‌మ్ 125లో 2 కేజీల సీఎన్‌జీ ట్యాంక్, 2 లీట‌ర్ల పెట్రోల్ ట్యాంక్‌ను అమ‌ర్చారు. సీఎన్‌జీ 2 కేజీల‌కు 200 కి.మీ., పెట్రోల్ రెండు లీట‌ర్ల‌కు 130 కి.మీ. క‌లిపి 330 కి.మీ. వ‌ర‌కు ప్ర‌యాణించొచ్చు. ఇంజిన్ 9.5 పీఎస్ ప‌వ‌ర్, 9.7 ఎన్ఎం టార్క్‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. సీఎన్‌జీపై టాప్‌స్పీడ్ గంట‌కు 90.5 కి.మీ., పెట్రోల్‌పై టాప్ స్పీడ్ 93.4 కిలోమీట‌ర్లు వెళ్తుంద‌ని బ‌జాజ్ ఆటో పేర్కొంది. ఇక సాధార‌ణ పెట్రోల్ బైక్‌తో పోల్చితే 50 శాతం త‌క్కువ ఆప‌రేటింగ్ ఖ‌ర్చుతో ఈ బైక్ న‌డ‌నుంది. సీఎన్‌జీ, పెట్రోల్ మోడ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకునే వెసులుబాటు క‌ల్పించారు.

ధ‌ర‌లు ఇలా..

ఫ్రీడ‌మ్ డిస్క్ ఎల్ఈడీ వేరియంట్ ధ‌ర రూ. 1.10 ల‌క్ష‌లుగా నిర్ణ‌యించింది బ‌జాజ్ ఆటో సంస్థ‌. డ్ర‌మ్ ఎల్ఈడీ రూ. 1.05 ల‌క్ష‌లు, డ్ర‌మ్ వేరియంట్ ధ‌ర రూ. 95 వేల‌కే ల‌భించ‌నుంది. ఫ్రీడ‌మ్ 125 బైక్ బుకింగ్స్ ప్రారంభ‌మ‌య్యాయని పేర్కొంది. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌లో త‌క్ష‌ణ‌మే తీసుకొస్తామ‌ని, ఇత‌ర రాష్ట్రాల్లో ద‌శ‌ల‌వారీగా అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని కంపెనీ స్ప‌ష్టం చేసింది.