Leopard caught | ఎట్టకేలకు ఆ చిరుతపులి చిక్కింది.. ఊపిరిపీల్చుకున్న జనం
Leopard caught | శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిధిలో గత ఐదు రోజులుగా కలకలం రేపుతున్న చిరుతపులి ఎట్టకేలకు చిక్కింది. ఆ చిరుతపులిని పట్టుకునేందుకు అధికారులు ఏర్పాటు చేసిన బోనులోని మేకను తినేందుకు వచ్చి ఇరుక్కుపోయింది. దాంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
Leopard caught : శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిధిలో గత ఐదు రోజులుగా కలకలం రేపుతున్న చిరుతపులి ఎట్టకేలకు చిక్కింది. ఆ చిరుతపులిని పట్టుకునేందుకు అధికారులు ఏర్పాటు చేసిన బోనులోని మేకను తినేందుకు వచ్చి ఇరుక్కుపోయింది. దాంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఆ చిరుతపులి ముందుగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కుకు తరలించి వైద్య పరీక్షలు చేయించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం దానిని నల్లమల అడవిలో వదిలేయనున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిధిలో కలకలం రేపుతున్న చిరుతపులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు గత ఐదు రోజుల నుంచి తీవ్రంగా శ్రమించారు. శంషాబాద్‌లో పులి సంచారం గురించి తెలియగానే దాన్ని పట్టుకునేందుకు అధికారులు ఐదు బోన్లు, 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బోన్‌లలో మేకలను ఎరగా వేశారు. అయినా చిరుత చాలా తెలివిగా వ్యవహరించింది. పలుమార్లు బోను దగ్గరి వరకు వచ్చిన చిరుత.. మేక కోసం లోపలికి వెళ్లకుండా వెనక్కి వెళ్లిపోయింది.
అయితే ఎట్టకేలకు శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు ఆ చిరుత బోనులో చిక్కడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గత ఆదివారం తెల్లవారుజామున గొల్లపల్లి నుంచి ప్రహరీగోడ దూకి చిరుత శంషాబాద్ విమానాశ్రయం లోపలికి వచ్చింది. ప్రహరీ దూకుతుండగా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వైర్లకు అది తగలడంతో ఎయిర్‌పోర్ట్ కంట్రోల్ రూమ్‌లో అలారం మోగింది. దాంతో అప్రమత్తమైన విమానశ్రయ సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత కోసం గాలింపు చేపట్టిన అధికారులు ట్రాప్‌లు, బోన్లు ఏర్పాటు చేసి చివరికి దాన్ని బంధించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram