Ganga Prasad, Veera jawan, Nizamabad
జనసంద్రంగా అంతిమయాత్ర
సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
పార్థీవ దేహానికి నివాళులర్పించిన కలెక్టర్, సీపీ
విధాత, ప్రతినిధి నిజామాబాద్: సిక్కిం వరదల్లో గల్లంతై, మృతి చెందిన ఆర్మీ వీర జవాన్ గంగాప్రసాద్ (32) కు అశ్రు నివాళి అర్పించారు. మృతదేహం ఆదివారం ఉదయం స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్ పల్లికి చేరుకుంది. తీస్తా నది ఉగ్రరూపం దాల్చి సంభవించిన వరదల్లో లాన్స్ నాయక్ హోదాలో పని చేస్తున్న ఆర్మీ జవాన్ గంగాప్రసాద్ గల్లంతై మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.
గల్లంతైన జవాన్ల ఆచూకీ కోసం జరిపిన గాలింపు చర్యల్లో గంగాప్రసాద్ మృతదేహం గురువారం లభ్యమైంది. మృతదేహానికి పోస్టుమార్ధం నిర్వహించిన మీదట ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు. అక్కడి నుండి ఆదివారం ఉదయం స్వగ్రామమైన కుమ్మన్ పల్లికి ఆర్మీ జవాన్ పార్థీవదేహం చేరుకుంది. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బోధన్ శివారు నుంచి కుమ్మన్ పల్లి వరకు వేలాది మంది అంతిమ యాత్రలో పాల్గొని, వీర జవాన్ కు అశ్రు నివాళులర్పించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, ఆర్మీ ఆఫీసర్లు, ఇతర ఉన్నతాధికారులు అంత్యక్రియల్లో పాల్గొని, గంగాప్రసాద్ పార్థీవదేహం పై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అంతకుముందు బాధిత కుటుంబ సభ్యులను కలెక్టర్ పరామర్శించి ఓదార్చారు.
గంగాప్రసాద్ అంతిమ యాత్ర సాగిన బోధన్ నుంచి కుమ్మన్ పల్లి వరకు ఇసుక వేస్తే రాలనంతగా అశేష జనవాహినితో నిండిపోయింది. రహదారి మొత్తం జనసంద్రంగా మారింది. గంగా ప్రసాద్ అమర్ హై అంటూ నినాదాలు హోరెత్తాయి. త్రివర్ణ పతాకాలు చేతబూని వేలాది మంది స్వచ్ఛందంగా మోటార్ సైకిళ్లపై ర్యాలీగా అంతిమ యాత్రలో వీర జవాన్ కు కన్నీటి వీడ్కోలు పలికారు.
కాగా.. దారి పొడుగునా రోడ్డుకు ఇరువైపులా చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా కులమతాలకు అతీతంగా బారులు తీరిన ప్రజలు వీర జవాన్ పార్థీవదేహంపై పూలు చల్లుతూ అశ్రు నయనాలతో వీడ్కోలు పలికారు. అమర్ రహే గంగాప్రసాద్, జోహార్ గంగాప్రసాద్ నినాదాల నడుమ అంతిమ యాత్ర సాగింది. జవాన్ గంగాప్రసాద్ మృతదేహానికి ఆర్మీ అధికారులు సైనిక లాంఛనాలతో నివాళులర్పించారు. గాలిలోకి కాల్పులు జరిపి శ్రద్ధాంజలి ఘటించారు.