• Telugu News
  • /Telangana

Nalgonda | ఆకతాయిల వేధింపులకు యువతి బలి.. నిందితులను వదలొద్దని మరణ వాంగ్మూలం

ఆకతాయిల వేధింపులకు ఓ యువతి నిండు ప్రాణాలు తీసుకుంది. స్నేహితులే కదా అని సరదాగా ఫొటోలు దిగితే.. తాము చెప్పినట్లు చేయాలని బెదిరింపులకు దిగారు.

Reported by: Somu | తెలంగాణ‌ | Jul 11, 2024, 1:25 pm IST
Read Time: 4 mins
Nalgonda | ఆకతాయిల వేధింపులకు యువతి బలి.. నిందితులను వదలొద్దని మరణ వాంగ్మూలం

స్నేహితులతో దిగిన ఫొటోలే వేధింపులకు కారణమయ్యాయి

విధాత, హైదరాబాద్ : ఆకతాయిల వేధింపులకు ఓ యువతి నిండు ప్రాణాలు తీసుకుంది. స్నేహితులే కదా అని సరదాగా ఫొటోలు దిగితే.. తాము చెప్పినట్లు చేయాలని బెదిరింపులకు దిగారు. వాళ్ల వేధింపులు తాళలేక సదరు యువతి ఆత్మహత్య చేసుకుంది. నల్గొండ జిల్లా మాడుగుల మండలం చింతలగూడెంలో దారుణం చోటుచేసుకుంది. చింతలగూడెం గ్రామానికి చెందిన కొత్త రాజలింగం-రజిత కుమార్తె కొత్త కల్యాణి (19) డిగ్రీ మానేసి ఇంటి వద్దే ఉంటుంది. అదే గ్రామానికి చెందిన ఆరూరి శివ, కొమ్మనబోయిన మధు అనే యువకులు కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నారు. తమను ప్రేమించాలని లేదంటే తమతో దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో పెడతామని వేర్వేరుగా బెదిరిస్తున్నారు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే తన కుటుంబం పరువు పోతుందని కల్యాణి భయపడింది. ఈ నెల 6వ తేదీన తిప్పర్తి మండలం సర్వారం గ్రామంలో తమ బంధువు చనిపోయారని కల్యాణి తల్లిదండ్రులు అక్కడి వెళ్లారు. సోదరుడు కాలేజీకి వెళ్లాడు.

దీంతో ఒంటరిగా ఉన్న కల్యాణికి సదరు యువకుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. ఆ వేధింపులు తాళలేక కల్యాణి పురుగుల మందు తాగింది. అనంతరం తన తల్లిదండ్రులకు కాల్‌ చేసి విషయాన్ని చెప్పింది. అప్పటికే కల్యాణి పురుగుల మందు తాగిన విషయాన్ని గమనించిన స్థానికులు మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నల్గొండ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ మూడు రోజుల పాటు చికిత్స పొందిన కల్యాణి మంగళవారం మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, తన చావుకు ఇద్దరు యువకులే కారణమని చనిపోయే ముందు సదరు యువతి మరణవాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు కల్యాణి ఆత్మహత్యలో ఆరోపణలు ఎదుర్కోంటున్న మధు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడితో పాటు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేస్తామని పోలీసులు తెలిపారు.