ACB Raids | రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల హాస్టల్స్‌లో ఏసీబీ సోదాలు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వసతి గృహాల పనితీరు, సౌకర్యాలపై ఆరాతీస్తున్నారు

విధాత, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వసతి గృహాల పనితీరు, సౌకర్యాలపై ఆరాతీస్తున్నారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రంగారెడ్డి, నిజామాబాద్, మంచిర్యాల, హైదరాబాద్ చింతబస్తీ గురుకుల హాస్టల్స్‌లో సోదాలు చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా హాస్టల్స్‌లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. విద్యార్థుల వసతి గృహాల్లో అవతవకలపై ఏసీబీ దృష్టి సారించింది. తప్పుడు బిల్లులతో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్లు గుర్తించారు. హాస్టల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యను, రికార్డులను పరిశీలిస్తున్నారు. విద్యార్థులకు అందించే ఆహార పదార్ధాలను తనిఖీ చేసి కాలం చెల్లిన ఆహార పదార్ధాలను వినియోగించినట్లుగా గుర్తించారు.
ఎనిమిదినెలల్లో గరుకులాల్లో కలుషిత ఆహారం తిని 500 మంది వరకు ఆసుపత్రుల పాలవ్వగా, కలుషిత ఆహారంతో పాటు పాముకాట్లు, అనుమానస్పదంగా మరో 36మంది మరణించినట్లుగా ప్రతిపక్ష బీఆరెస్ ఆరోపిస్తుంది. తాజాగా జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకులంలో పాముకాటుతో చనిపోయిన ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌కు చెందిన అనిరుధ్ కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన గురుకుల హాస్టల్స్ అధ్వాన్న పరిస్థితులపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరు పట్ల విమర్శలు గుప్పించారు. ఆ మరుసటి రోజునే గురుకుల హాస్టల్స్‌లో ఏసీబీ తనిఖీలు కొనసాగుతుండటం గమనార్హం.