విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల ప్రచార హడావిడి స్తబ్దుగానే ఉంది. అధికార బీఆర్ఎస్ మినహా, మిగిలిన పార్టీల అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో ప్రచారాలు ఊపందుకోలేకపోతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ఖరారుతో బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకెళుతోంది. ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటర్లను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు మొదలెట్టారు.
ఎన్నికల ప్రకటన వెలువడక ముందే అధికార పార్టీ అభ్యర్థులు ప్రచారంలో ముందున్నారు. బీఆరెస్ రాష్ట్ర అధినాయకులూ ప్రచారాలతో మోగిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని వనపర్తి, షాద్ నగర్ నియోజకవరర్గాల్లో ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటించారు. కొడంగల్, మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుసుడిగాలి పర్యటన చేశారు.
ఆయా నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూనే, ఎన్నికల సభలను తలపిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇద్దరు అధినాయకులు ఉమ్మడి జిల్లాలో ప్రచారం చేయడంతో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్, బీజేపీ తీరుని ఎండగట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పైనే ఫోకస్ చేసి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నేతలకు ముందుగా టికెట్ ప్రకటించడంతో ఇతర పార్టీల కంటే ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఎక్కువ కలిగింది.
పరేషాన్ లో కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ టికెట్ల జాబితా ఇంకా వెలువడలేదు. ఆ పార్టీ అభ్యర్థులు, శ్రేణుల్లో అయోమయం నెలకొంది. టికెట్ ఎవరికి వస్తుందో అన్న టెన్షన్ కొనసాగుతోంది. ఆశావహులంతా ఊహల్లో లెక్కలు వేస్తున్నారు. టికెట్ తమకే వస్తుందనే ధీమాలో ఉన్నారు. కార్యకర్తల్లో గందరగోళం మాత్రం తొలగడం లేదు. ఇటీవల ఆ పార్టీ నేతల్లో మరింత టెన్షన్ మొదలైంది. మరోవైపు రోజుకో పేరుతో నియోజకవర్గాల వారీగా సోషల్ మీడియోలో జాబితాలు చక్కర్లు కొడుతున్నాయి.
బీజేపీ నేతల్లో అయోమయం
కాంగ్రెస్ పార్టీ దారిలోనే బీజేపీ ఉంది. ఇంతవరకు అభ్యర్థుల జాబితా ప్రకటించలేదు. టికెట్ ఆశించే అభ్యర్థులు అయోమయం లో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో నేటికీ తొలి జాబితా కూడా ప్రకటించలేదు. అభ్యర్థులు ప్రచారం చేసుకోవాలంటే ఎవరికి టికెట్ వస్తుందో అనే ఆలోచన చేస్తున్నారు. ముందస్తు గా ప్రచారం చేస్తే టికెట్ వస్తుందో, రాదో అన్న సందిగ్ధంలో ఉన్నారు. పాలమూరు జిల్లాకేంద్రంలో ప్రధాని మోడీ సభ విజయవంతంగా నిర్వహించారు. ఈ సభను స్ఫూర్తి గా తీసుకొని ప్రచారంలో ముందుకు వెళ్లాల్సిన నేతలు, ఇంకా మౌనంగా ఉన్నారు. టికెట్ వచ్చాక ప్రచారం మొదలెడదామనే ధోరణిలో ఆ పార్టీ నేతల తీరు ఉన్నట్లు తెలుస్తోంది.