అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ఉత్కంఠ
రిజర్వేషన్ల రద్దు అంశంపై అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు దర్యాప్తు కోసం ఢిల్లీ పోలీసులు హైదరాబాదులోనే మకాం వేశారు. ఇప్పటికే ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డి సహా ఐదుగురికి నోటీసులు జారీ చేసిన

- హైదరాబాదులోనే ఢిల్లీ పోలీసులు
- నగరానికి చేరుకున్న ఐపీఎస్ అధికారి
విధాత : రిజర్వేషన్ల రద్దు అంశంపై అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు దర్యాప్తు కోసం ఢిల్లీ పోలీసులు హైదరాబాదులోనే మకాం వేశారు. ఇప్పటికే ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డి సహా ఐదుగురికి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ పోలీసులు మే 1న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి తరఫున న్యాయవాది మాత్రమే హాజరై సమాధానం ఇవ్వగా.. మిగతా వారంతా విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో మరోసారి వారందరికీ నోటీసులు జారీ చేసి వారిని అరెస్టు చేసేందుకు ఢిల్లీ పోలీసులు హైదరాబాదులోని మకాం పెట్టారు.
శుక్రవారం ఈ కేసులో విచారణకు ఢిల్లీ నుంచి మరో ఐపిఎస్ అధికారి కూడా హైదరాబాద్ కు రావడం ఆసక్తికరంగా మారింది. అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు సైతం కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఐదుగురికి ఇప్పటికే ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణ నిమిత్తం వారిని అరెస్టు చేయాలని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వారి విచారణ పూర్తి చేస్తే ఆ వెంటనే ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసేందుకు ఎదురుచూస్తున్నారు. హైదరాబాదులో ఉన్న ఢిల్లీ పోలీసులు ఇప్పుడు ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. కాగా తమ అదుపులో ఉన్న ఐదుగురిని సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే విచారించారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్ లు సీజ్ చేశారు.