కాంగ్రెస్‌కు ఆంజనేయులు రాజీనామా

  • Publish Date - October 9, 2023 / 01:06 PM IST
  • మెదక్ లో పార్టీకి మరో షాక్
  • బీఆరెస్ లో చేరుతున్నట్లు ప్రకటన

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. టీపీసీసీ కోఆప్షన్ సభ్యులు, మెదక్ మున్సిపల్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు ఆపార్టీకి రాజీనామా చేశారు. సోమవారం మెదక్ క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజీనామాను ప్రకటించారు. 15 ఏళ్లుగా అనేక కష్టనష్టాలకు ఓర్చి పార్టీని బలోపేతం చేశానన్నారు. పార్టీ అధిష్టానం డబ్బు సంచులున్నోళ్లకు టికెట్లు కట్టబెడుతోందని ఆరోపించారు. ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయినా పార్టీ అభివృద్ధి, బలోపేతం కోసం మెదక్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడిగా, మెదక్ జిల్లా అధికార ప్రతినిధిగా, ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించినట్లు తెలిపారు. గల్లీలో ఉండే కాంగ్రెస్ ఓట్లను ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ నాయకులు నోట్లుగా మార్చుకోవడం పార్టీ విధానంగా మారిపోయిందని ధ్వజమెత్తారు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించే మైనంపల్లి రోహిత్ రావు మెదక్ నియోజకవర్గం భౌగోళిక స్వరూపం, ఇక్కడి పరిస్థితులు తెలుసా అని ఆయన ప్రశ్నించారు.


మెదక్ నియోజకవర్గంలో 11 మంది ఆశావహుల నుంచి రూ.50 వేలు వసూలు చేసి, దరఖాస్తులు స్వీకరించిన అధిష్టానం కనీసం ఫోన్ చేయకుండా మరో వ్యక్తిని అభ్యర్థిని ప్రకటిస్తామనడం శోచనీయమన్నారు. అధిష్టానం స్థానికంగా పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకుండా, డబ్బు సంచులకు అమ్ముడుపోతున్నదన్నారు. డబ్బు సంచులతో వచ్చే అభ్యర్థులను ఖాళీ డబ్బాలతో సాగనంపుతామని హెచ్చరించారు. 2009 నుంచి 2014 వరకు మెదక్ ఎమ్మెల్యేగా పనిచేసిన మైనంపల్లి హనుమంతరావు చేసిన అభివృద్ధి ఏమిటో తెలపాలని సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధి కాంక్షించి త్వరలోనే బీఆర్ఎస్ లో చేరనున్నట్లు మామిళ్ళ ఆంజనేయులు ప్రకటించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సూఫి పార్టీకి రాజీనామా చేశారు. ఈ సమావేశంలో నాయకులు శ్యాంసుందర్, శ్రీనివాస్, మడూరు చంద్రమోహన్ పాల్గొన్నారు.