మేడిగడ్డతో పాటు ఆ రెండు బరాజ్‌ల నిర్మాణానికి కేబినెట్ అనుమతి తీసుకోలేదు: పీసీ ఘోష్ కమిషన్

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ నిర్మాణానికి సంబంధించి కేబినెట్ అనుమతి తీసుకోలేదని పీసీ ఘోష్ కమిషన్ తెలిపింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను ఆదివారం అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది

  • By: Subbu |    telangana |    Published on : Aug 31, 2025 3:17 PM IST
మేడిగడ్డతో పాటు ఆ రెండు బరాజ్‌ల నిర్మాణానికి కేబినెట్ అనుమతి తీసుకోలేదు: పీసీ ఘోష్ కమిషన్

విధాత: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ నిర్మాణానికి సంబంధించి కేబినెట్ అనుమతి తీసుకోలేదని పీసీ ఘోష్ కమిషన్ తెలిపింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను ఆదివారం
అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ప్రధానమంత్రికి అప్పటి సీఎం కేసీఆర్ లేఖ రాశారని కమిషన్ తెలిపింది. లేదా ఈ ప్రాజెక్టుకు రూ. 25 వేల కోట్లను గ్రాంట్ గా ఇవ్వాలని ఆ లేఖలో కోరారని నివేదిక వెల్లడించింది,2016 ఫిబ్రవరి 11న అప్పటి సీఎం కేసీఆర్ ప్రధానమంత్రికి లేఖ రాశారు. వ్యాప్కోస్ సవరించిన డీపీఆర్‌ను సిద్దం చేస్తోందని ఆ లేఖలో తెలిపారని కమిషన్ వివరించింది. ప్రాణహిత ప్రాజెక్టుకు రూ.4231 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.74,136 కోట్లు ఖర్చు అవుతోందని అంచనా వేసినట్టు చెప్పారు. వ్యాప్కోస్ 2016 మార్చి 27న రిపోర్ట్ సమర్పించిందని కమిషన్ గుర్తు చేసింది.

కానీ, ఈ రిపోర్టు రాకముందే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.74,136 కోట్లు ఖర్చు అవుతోందని ఎలా తెలిపిందని కమిషన్ ప్రశ్నించింది. 2016 జనవరి 17న వ్యాప్కోస్ సమర్పించిన రిపోర్టులో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.13,593.99 కోట్లు ఖర్చు అవుతోందని తెలిపిందని కమిషన్ అభిప్రాయపడింది. ఈ విషయాన్ని 2016 ఫిబ్రవరి 16న కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ రాసిన లేఖలో తెలిపిన విషయాన్ని కమిషన్ గుర్తుచేసింది. 2014 అక్టోబర్ 24న ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చిందని కమిషన్ తెలిపింది.

2015 జనవరి 21న ఏర్పాటైన నిపుణుల కమిటీ కూడా మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణానికి సిఫారసు చేయలేదని కమిషన్ వివరించింది. అంతేకాదు మేడిగడ్డ బరాజ్ నిర్మాణ ప్రతిపాదనను తిరస్కరించిందని కమిషన్ తెలిపింది. అన్నారం, సుందిళ్ల బరాజ్ ల పేరును కూడా తీసుకోలేదని కూడా వివరించింది. 2016 మార్చి 7న ఏర్పాటైన కేబినెట్ సబ్‌ కమిటీ కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ నిర్మాణానికి సిఫారసు చేయలేదని కమిషన్ తేల్చి చెప్పింది.

మేడిగడ్డ (కాళేశ్వరం) ప్రాజెక్టు నిర్మాణం కోసం సమగ్ర రిపోర్ట్ కోసం సర్వే కోసం వ్యాప్కోస్ కు 2015 ఏప్రిల్ 13న ప్రభుత్వం జీవో 212 జారీ చేసిందని..2016 మార్చి 27న వ్యాప్కోస్ తుది నివేదిక అందించిందని కమిషన్ వివరించింది. 2016 జనవరిలో ప్రధానికి ముఖ్యమంత్రి రాసిన లేఖలో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.71,436 కోట్లు, ప్రాణహితకు రూ.4231 కోట్లుగా పేర్కొన్నారని. ఈ రూ.71,436 కోట్లు ఖర్చు ఎలా అవుతోందో స్పష్టంగా చెప్పలేదని…. కమిషన్ వివరించింది. 2016 జనవరి 17 సమావేశానికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ అందుబాటులో లేవని 2024 డిసెంబర్ 17న లేఖ రాశారని కమిషన్ తెలిపింది.