A.P BUDJET 2024 | కీలక బిల్లులను ఆమోదించిన ఏపీ అసెంబ్లీ , ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు : సీఎం చంద్రబాబు
ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు పలు కీలక బిల్లులను ఆమోదించింది. మొదటి రోజు సమావేశాలకు నల్ల కండువాలతో హాజరైన వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగిస్తుండగానే సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు.

హెల్త్ యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పునరుద్ధరణ
రెండు నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ : సీఎం చంద్రబాబు
హూ కిల్డ్ బాబాయ్ ప్రశ్నకు త్వరలోనే జవాబు
మరో 3 శ్వేతపత్రాలు విడుదల చేస్తాం
కేంద్ర నిధులతో అమరావతికి మంచి రోజులు
విధాత, హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు పలు కీలక బిల్లులను ఆమోదించింది. మొదటి రోజు సమావేశాలకు నల్ల కండువాలతో హాజరైన వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగిస్తుండగానే సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. కాగా రెండో రోజు సమావేశాలకు మాజీ సీఎం జగన్ తో పాటు, వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. అధికార ఎన్డీఏ కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులతోనే అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. పలు కీలక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు బిల్లును కేబినెట్ ఆమోదం పిదప మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించారు. అలాగే వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పునరుద్ధరిస్తూ పెట్టిన బిల్లుకు కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది .ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభలో ప్రకటన చేశారు. తెలుగులోనే ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా బిల్లులు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించడాన్ని సభ్యులు అభినందించారు.
రెండు నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ : సీఎం చంద్రబాబు
వైసీపీ అస్తవ్యస్థ పాలనతో దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వల్ల రాష్ట్ర బడ్జెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితి నెలకొందని ఏపీ సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శాసన సభలో చంద్రబాబు మాట్లాడుతూ రెండు నెలల సమయం తీసుకుని పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టాలనే ఆలోచనకు వచ్చామని తెలిపారు. తెలుగువారు అంటే ఆంధ్రప్రదేశ్ అనేలా ఎన్టీఆర్ చేశారని గుర్తు చేశారు. పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్ధిక సంస్కరణలు దేశంలో పెనుమార్పులకు దారితీయగా, విజన్ 2020 రూపకల్పనతో అభివృద్ధికి బాటలు వేసి ఐటీకి ప్రాధాన్యమిచ్చి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో బ్రహ్మాండంగా అభివృద్ధి సాధించామన్నారు. ఐటీ రంగంలో సాధించిన ప్రగతితో ప్రపంచంలోని అన్ని దేశాల్లో తెలుగువాళ్లు విస్తరించారన్నారు. రాష్ట్రానికి రాజధానికి లేకుండా గత వైసీపీ ప్రభుత్వం చేసిందని, అమరావతి కలను సర్వనాశనం చేసిందని విమర్శించారు. రాజధాని నిర్మాణం పూర్తయి ఉంటే దాదాపు రెండు మూడు లక్షల కోట్ల రూపాయల ప్రజా సంపద వచ్చి ఉండేదని, ఈ రోజు అప్పులు చేయాల్సిన అవస్థ తీరేదన్నారు. టీడీపీ హయాంలో ఏపీ జీవనాడి పోలవరం 72శాతం పూర్తయిందని, 2020-21 నాటికి పూర్తి కావాల్సిన ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని, కావాలని కాంట్రాక్టర్లను అధికారులను మార్చడం.. రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం చేసి పోలవరాన్ని ఆలస్యం చేశారని, ఈ పరిస్థితుల్లో ప్రజలిచ్చిన తీర్పు..ఓట్లు చీలకుండా పవన్ కల్యాణ్ చూపిన చొరవతో ఎన్టీఏ కూటమిని పజలు గొప్ప ఫలితాలతో అధికారంలోకి తెచ్చారన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్టీఏ కూటమి జట్టుగా కృషి చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధానికి ఆర్ధిక సాయం చేసేందుకు ముందుకొచ్చి బడ్జెట్లో రూ.15వేల కోట్లు కేటాయించిందని. అమరావతికి మళ్లీ మంచిరోజులు వచ్చాయనే ఆశ అందరిలో కనిపిస్తోందన్నారు. పోలవరాన్నికూడా సాధ్యమైనంత తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పారు.
మరో 3 శ్వేతపత్రాలు విడుదల చేస్తాం…
ప్రభుత్వ ఆదాయం ఐదేళ్లలో దోపిడీ జరిగిందని, ఇసుక, మద్యం వంటి వాటి ద్వారా రూ. లక్షల కోట్ల మేర దోపిడీ జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. అసమర్ధ నిర్ణయాలతో అభివృద్ధి లేక ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. 2019 నుంచి రాష్ట్ర వృద్ధిరేటు పడిపోయిందని, మూలధనాన్ని 60 శాతం మేర తగ్గించారని విమర్శించారు. జలవనరులపై 56శాతం, రోడ్లపై 85 శాతం మూలదనం తగ్గిందని పేర్కోన్నారు. రాష్ట్రంలో తప్పకుండా రోడ్లను బాగు చేస్తామని, రేపటి నుంచి మరో 3 శ్వేతపత్రాలు అసెంబ్లీలో ప్రవేశపెడతామని చంద్రబాబు తెలిపారు.
వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరిగిందని, హత్య జరిగాక ఘటనాస్థలికి సీఐ సీబీఐకి విషయం తెలపడానికి సిద్ధపడ్డారని, కానీ, ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి సీఐకి పదోన్నతి ఇచ్చిందన్నారు. విచారణాధికారిపై కేసు పెడితే హైకోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకునే పరిస్థితి నెలకొందని, నేరస్థుడే సీఎం అయితే పోలీసులు కూడా వంత పాడే పరిస్థితి దాపురించిందన్నారు. వివేకా హత్య కేసు నిందితుల అరెస్టుకు వెళ్లిన సీబీఐ సిబ్బందే వెనక్కి తిరిగి వచ్చారని, హు కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలోనే జవాబు వస్తుందని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.