విధాత, హైదరాబాద్ : ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించి ఫోన్ ట్యాపింట్ కేసులో సస్పెన్షన్ లో ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ బుధవారం సోదాలు చేపట్టింది. భుజంగరావుకు చెందిన హైదరాబాద్, సూర్యాపేట సహా మొత్తం 15 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ లోని హఫీజ్ పేటలో ఉన్న భుజంగరావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న భుజంగరావు జైలు నుంచి బెయిల్ పై విడుదలైన అనంతరం ఇదే నివాసంలో ఉంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ చీఫ్ టి.ప్రభాకర్ రావు సారధ్యంలోని ఫోన్ ట్యాపింగ్ బృందంలో క్రియాశీలకంగా వ్యవహరించిన నిందితుల్లో భుజంగరావు కూడా కీలకంగా ఉన్నారు.
పలు పార్టీల ప్రముఖ నేతల ఫోన్లను, సెలబ్రిటీలు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల, నగల వ్యాపారుల ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న భుజంగరావు రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లి వచ్చారు. మరో నెలలో భుజంగరావు రిటైర్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుండగా..ఇంతలోనే ఏసీబీ దాడులు నిర్వహించడం ఆసక్తి రేపింది.