హైదరాబాద్‌లో ఇక ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్‌ … లైసెన్స్ జారీలో నూతన విధానం

హైదరాబాద్‌లో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియ కోసం ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్‌కు ఆర్టీఏ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుత విధానం కంటే ప్రామాణికమైన డ్రైవింగ్ టెస్టులు నిర్వహించాలని భావిస్తున్నారు

హైదరాబాద్‌లో ఇక ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్‌ … లైసెన్స్ జారీలో నూతన విధానం

హైదరాబాద్ : హైదరాబాద్‌లో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియ కోసం ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్‌కు ఆర్టీఏ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుత విధానం కంటే ప్రామాణికమైన డ్రైవింగ్ టెస్టులు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించేందుకు ఆర్టీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇకపై టెస్ట్ డ్రైవింగ్ కు వచ్చేవారు వేరేదారిలో లైసెన్స్ పొందే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. డ్రైవింగ్‌లో శిక్షణ పొంది, నైపుణ్యంతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికే లైసెన్స్ జారీ చేస్తామని అధికారులు తెలిపారు. ఇక కొత్తగా అమలు చేయబోయే ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్‌లో ఐదు రకాల ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. వాటిలో హెచ్ అనే ట్రాక్‌లో ఆర్టీఏ ప్రమాణాలను పేర్కొన్న విధంగా వాహనాన్ని రివర్స్ చేయాలి. ఎస్ అనే ట్రాక్‌లో ఒక మూల నుంచి మరో మూలకు వెహికల్‌ను టర్న్ చేయాలి. కే అనే ట్రాక్‌లో బాగా మలుపులు, ఎత్తుపల్లాలు, ఎత్తయిన ప్రదేశాలు, చిన్న లోయలు వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. వాటిలో వాహనాన్ని నడపాలి. చివరగా బండిని పార్కింగ్ చేసి చూపించాల్సి ఉంటుంది.
ట్రాఫిక్ నిబంధనల ప్రకారం టూ వీలర్స్ హెల్మెట్, ఫోర్ వీలర్స్‌ సీటు బెల్ట్ పెట్టుకోవాలి. ఈ ప్రక్రియ అంతా కంప్యూటర్ లో నమోదు చేస్తారు. లైసెన్స్ కోసం వచ్చిన వారు ట్రాక్ పై వాహనాన్ని నడిపేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేసినా కంప్యూటర్‌లో నమోదవుతుంది. దీంతో టెస్ట్‌లో ఫెయిల్ అయినట్టు చూపిస్తుంది. టెస్ట్ లో ఫెయిల్ అయితే.. మరో నెల రోజుల పాటు ట్రైనింగ్ తీసుకుని రమ్మంటారు. పూర్తిగా కంప్యూటరీకరణ వల్ల ఇక్కడ అధికారులను, సిబ్బందిని మేనేజ్ చేసేందుకు అవకాశం ఉండదని అధికారులు తెలిపారు. అంతేకాదు బ్రోకర్లకు కూడా అవకాశం ఉండదని చెప్తున్నారు.