Bandi Bhagirath Moves High Court To Quash POCSO Case
విధాత క్రైం బ్యూరో | మే 12, 2026 | హైదరాబాద్:
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ భగీరథ్ తెలంగాణ హైకోర్టులో నేడు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం కోర్టులకు వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పిటిషన్‌పై ఈ నెల 14న వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది.
17 ఏళ్ల బాలికను వేధిస్తున్నాడంటూ ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 8న భగీరథ్‌పై పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసు బయటకు రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది.
ఇదే సమయంలో భగీరథ్ కూడా కరీంనగర్ పోలీసులను ఆశ్రయించారు. బాలిక, ఆమె తల్లి తనను డబ్బుల కోసం బెదిరిస్తున్నారని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా కరీంనగర్‌లో కూడా కేసు నమోదైంది. తనపై నమోదైన పోక్సో కేసులో ఎలాంటి వాస్తవం లేదని, తనను మరియు తన తండ్రి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కుట్ర పూరితంగా ఈ వ్యవహారం నడిపిస్తున్నారని భగీరథ్ తన పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం.
సీఎం రేవంత్ రెడ్డి ఆరా.. సిట్ దర్యాప్తుపై దృష్టి
కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో కుమారుడు బండి భగీరథ్
ఈ వ్యవహారం రాజకీయంగా సున్నితంగా మారడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా డీజీపీ సీవీ ఆనంద్‌ను పిలిపించి కేసు వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. దర్యాప్తు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. సీఎం ఆదేశాల మేరకు కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్‌కు కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
పోక్సో కేసు నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్
బాధిత బాలికను మరోసారి విచారించి వాంగ్మూలం నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు. బాధితురాలికి న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని డీసీపీ స్పష్టం చేశారు. మరోవైపు ఈ కేసులో నిందితుడిని ఇంకా అరెస్ట్ చేయకపోవడంపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. ప్రభుత్వం బండి సంజయ్ కుమారుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు.
