సభ్యసమాజం అసహ్యించుకునేలా పోలీసులు వ్యవహరించారు
ఏబీవీపీ మహిళా నాయకురాలిపై పోలీసులు వ్యవహరించిన తీరు చూసి సభ్యసమాజం అసహ్యించుకుంటోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు

– ఏబీవీపీ మహిళా నాయకురాలిని జుట్టుపట్టుకుని ఈడ్చుకు పోతారా?
– ప్రజా సమస్యలపై పోరాడే వాళ్లపై ఇట్లాగేనా వ్యవహరించేది?
– తక్షణమే న్యాయ విచారణ జరిపించాలి
– బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే
– బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్
విధాత బ్యూరో, కరీంనగర్: ఏబీవీపీ మహిళా నాయకురాలిపై పోలీసులు వ్యవహరించిన తీరు చూసి సభ్యసమాజం అసహ్యించుకుంటోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఝాన్సీ ప్రజల కోసం నిజాయితీగా, శాంతియుతంగా పోరాడుతున్న నాయకురాలు. ఆమెను జుట్టుపట్టుకుని ఈడ్చుకుంటూ లాక్కుపోతారా? ఇంతకంటే హేయమైన చర్య మరొకటి ఉండదన్నారు. తక్షణమే ఘటనపై న్యాయ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన విద్యారంగ సమస్యలపై నిజాయితీ, నిబద్ధతతో పోరాడుతున్న ఏబీవీపీ నాయకులపై పోలీసుల దాడి హేయమైనదిగా పేర్కొన్నారు.
గత ప్రభుత్వం ఏబీవీపీ నేతలపై విచక్షణారహిత దాడులు చేసి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైళ్లకు పంపిందని, దానికి ప్రజలు గట్టిగానే బుద్ది చెప్పారన్నారు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైనా తన వైఖరిని మార్చుకుంటుందేమోనని భావించామని, వీరి తీరు అలాగే ఉందన్నారు. నిన్న ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే… స్కూటర్ పై వచ్చిన పోలీసులు ఆమె జుట్టుపట్టుకుని ఈడ్చుకుంటూ పోయి హేయంగా ప్రవర్తించారన్నారు. ఆమె తలకు గాయమై ఆసుపత్రి పాలైనట్లు తెలిపారు. మానవత్వమున్న ప్రతి వ్యక్తి కళ్లల్లో ఈ ఘటన చూసి నీళ్లు కారుతున్నాయన్నారు. తక్షణమే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాల్సిన బాధ్యత డీజీపీపై ఉందని, న్యాయ విచారణ జరిపి, కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలని డిమాండ్ చేశారు.