Jubilee Hills By Poll | మూడు పార్టీలకు ఇజ్జత్ కా సవాల్.. జూబ్లీహిల్స్ బై పోల్ ఏ పార్టీ తలరాత మార్చేనో!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కావడంతో పార్టీల ప్రచారం జోరందుకున్నది. బీజేపీ మినహా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి.

- మూడు పార్టీలకు
- ఇజ్జత్ కా సవాల్!
- రేవంత్ చరిష్మాకు…
- కేటీఆర్ సామర్థ్యానికి…
- కిషన్ రెడ్డి స్థానబలానికి…అగ్ని పరీక్ష
- మరోసారి గెలిచి కాంగ్రెస్ తడాఖా చూపిస్తుందా?
- ప్రభుత్వంపై వ్యతిరేకత, సానుభూతి బీఆర్ఎస్‌కు కలిసి వస్తుందా?
- గెలిచి బీజేపీ పట్టు బిగిస్తుందా?
- జూబ్లీహిల్స్ బై పోల్ ఏ పార్టీ తలరాత మార్చేనో!
హైదరాబాద్, అక్టోబర్ 14 (విధాత ప్రతినిధి) : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కావడంతో పార్టీల ప్రచారం జోరందుకున్నది. బీజేపీ మినహా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఈ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డి పాలనకు రెఫరెండం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీటు ఒక్కటే కావచ్చు.. కానీ, దీని ప్రభావం మొత్తం రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా మార్చి వేస్తుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఇప్పటికే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సీటును కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ.. పై చేయి చూపించుకున్నది. ఈ ఉప ఎన్నికల్లో తిరిగి ఆధిపత్యం కొనసాగిస్తుందా? అన్న చర్చ జరుగుతోంది. మరో వైపు జూబ్లిహిల్స్ ఎన్నికల్లో అన్నీ తానై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపోటములు ఆయనకు అగ్ని పరీక్ష కానున్నాయి. ఇక బీజేపీ కంటోన్మెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఈ ఎన్నికల్లో అయినా విజయతీరాలకు వెళ్తే రానున్న సార్వత్రిక ఎన్నికలకు మార్గం సుగమం అవుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మూడు పార్టీలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఫలితాల ప్రకటన రోజు అందరి జాతకాలు తేలిపోనున్నాయి.
బీఆర్ఎస్‌కు చావో రేవో
మాగంటి గోపినాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమయ్యాయి. గోపినాథ్ మరణంతో ఆయన భార్య సునీతకు బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ముందుగానే టికెట్ ప్రకటించింది. ఆమె బుధవారం నాడు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించనున్నారు. ఇంతకు ముందు కంటోన్మెంట్ నియోజకవర్గంలో సానుభూతిని ఓట్ల రూపంలో మల్చుకోవడంలో విఫలయ్యారు. ఆ పరిస్థితి ఇక్కడ రాకుండా ఉండేందుకు పార్టీ నాయకులు నిరంతరం ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీత కు ఏరోజుకారోజు ఎలా మాట్లాడాలి, ఏ అంశం మాట్లాడాలనేది తర్పీదునిస్తున్నారు. ఎక్కువగా మాట్లాడకుండా, భర్త గోపినాథ్ ప్రజలకు చేసిన సేవల గురించే స్మరణ చేయాలని సూచిస్తున్నారు. ప్రజల్లో ఉద్వేగాన్ని రాజేయాలని కూడా ఆమెకు చెబుతున్నారు.
ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పై ఆమె అంతగా విమర్శలు కూడా చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీని కూడా నిందించకుండా మహిళా ఓటర్లను ఆకట్టుకునే విధంగా కాలనీలు, బస్తీలలో ప్రచారం చేసుకుంటున్నారు. ఈమె ఇద్దరు కుమార్తెలు కూడా బస్తీలలో జోరుగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని ఒకసారి చుట్టేశారు. కేటీఆర్ అన్నీ తానై డివిజన్ స్థాయి సమావేశాలు, కాలనీల సమావేశాలకు హాజరవుతూ కాంగ్రెస్ పార్టీ ఢోకా పథకాలపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని, కాంగ్రెస్ అంటే మోసాల పార్టీ అంటూ విమర్శిస్తున్నారు. అమలు కాని హామీలిచ్చి, ప్రజలను మభ్యపెట్టి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ప్రచారం గులాబీ పార్టీకి ఏ మేరకు కలిసివస్తోందో ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.
రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికలు కేటీఆర్ నాయకత్వానికి సవాల్ గా పరిణమించాయి. కాంగ్రెస్ కు ఓటేస్తే బుల్డోజర్లు వస్తాయని హైడ్రా కూల్చివేతల అంశాన్ని బీఆర్ఎస్ ప్రధానంగా ఈ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది. సోదరి కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి గెంటేయడం, కోర్టు కేసులు, విచారణల కారణంగా బీఆర్ఎస్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఇక్కడ విజయం సాధిస్తే తప్ప కేటీఆర్ నాయకత్వంపై నమ్మకం పెరిగే సూచనలు కన్పించడం లేదని శ్రేణులు సైతం చర్చించుకుంటున్నాయి.
బీజేపీలో గెలువలేనని …
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో గతేడాది అక్కడ ఉప ఎన్నికలు జరిగాయి. సానుభూతి పవనాల మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి పాలు కాగా అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి జయకేతనం ఎగురవేశారు. శ్రీ గణేష్ విజయం సాధించడంతో బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఖంగుతిన్నది. వ్యతిరేక ఓటుతో పాటు సానుభూతి ఓట్లను కూడా పొందలేకపోయామని బీఆర్ఎస్ తన సమీక్షలో తెలుసుకున్నది. వాస్తవానికి శ్రీ గణేష్ కు బీజేపీ నాయకుడిగా మంచి గుర్తింపు ఉంది. నియోజకవర్గంలో ఆయనకు ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని గడప గడపకు వ్యక్తిగతంగా తిరిగారు. కాంగ్రెస్ పార్టీ ఆయనను అభ్యర్థిగా ప్రకటించడం, స్థానిక ప్రజల పరిచయాలు కలిసివచ్చాయి.
రేవంత్ కు ప్రతిష్టాత్మకం
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాదిన్నర దాటింది. ఈ తరుణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఏడాదిన్నర కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం చెందిందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ప్రస్తుతం ఉపఎన్నిక జరుగుతున్న తీరుకు మధ్య భిన్నమైన వాతావరణం ఉంది. వ్యతిరేకత ఓటు కూడా పెరిగింది. ప్రజలకు ఇచ్చిన హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు ఒకేసారి రుణ మాఫీ, సబ్సిడీ గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నది. ఆర్థిక భారం కారణంగా కొన్ని పథకాలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారు.
రైతు భరోసా కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నాయని విమర్శిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో గుంతలు కూడా పూడ్చలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ప్రతి పక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో నీటి వనరుల సంరక్షణ కోసం, మూసీ పునరుజ్జీవనంపై ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విపక్షాలు విమర్శలు చేశాయి. ఆక్రమణల పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చివేసిందని హైడ్రా పనితీరుపై ప్రతిపక్షాలు ఒంటికాలిపై విమర్శలు గుప్పించాయి. హైడ్రా పనితీరు కూడా ఈ ఎన్నికల్లో కొలమానంగా మారనున్నది. ప్రజలు స్వీకరిస్తారా లేదా వ్యతిరేకంగా ఓటు వేస్తారా అనే ఆందోళన కాంగ్రెస్ నాయకులను వెంటాడుతున్నది. ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నాయకత్వానికి సవాల్ గా మారనున్నది.
కిషన్ రెడ్డికి పరువు దక్కేనా?
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపి ప్రచారంలో ముందుండగా ఇప్పటి వరకు తమ అభ్యర్థి విషయంలో ఏమీ తేల్చుకోలేని స్థితిలో బీజేపీ ఉంది. సరైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారా, ఉన్నవారిలోనే ఒకరిని ఎంపిక చేస్తారా, బయటి వారిని పార్టీలోకి తీసుకుని నిలబెడతారా అనేది తేల్చకుండా నాన్చుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో అభ్యర్థి ఎవరనేది బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించనున్నది. కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే జూబ్లిహిల్స్ ఉండడం సంకటంగా మారింది. బీజేపీ రాష్ట్ర సారథిగా ఎన్.రామచంద్ర రావు వచ్చారు. ప్రతికూల పరిస్థితుల మధ్య ఆయన పీఠం ఎక్కారు.
ఏ ఒక్కరు కూడా ఆయన పట్ల సానుకూలంగా లేరు. కార్యకర్తల అభీష్టానికి వ్యతిరేకంగా ఢిల్లీ నాయకత్వం రామచంద్రరావును నియమించారనే విమర్శలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇక్కడ ఓటమి పాలైతే ఇద్దరు నాయకులు విమర్శల దాడిని ఎదుర్కోవాల్సి ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
బీజేపీ నుంచి సస్పెన్షన్ కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించడం మీకు సాధ్యం కాదని… మీరు కారును గెలిపిస్తారా? కాంగ్రెస్ ను గెలిపిస్తారా? అని వ్యాఖ్యానించడంతో బీజేపీ పరిస్థితికి అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు బరిలో ఉన్నప్పటికీ.. ప్రధాన పోటీ మాత్రం రెండు పార్టీల మధ్యే ఉంటుందా అనే చర్చ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోందని ఓ సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యానించారు.