Telangana High Court | స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు: విచారణ గురువారానికి వాయిదా
స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగియలేదు. తదుపరి విచారణను హైకోర్టు గురువారం (రేపు) మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది.

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 9 పై విచారణను తెలంగాణ హైకోర్టు గురువారం నాటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణను చేపట్టనున్నట్టు హైకోర్టు తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వవద్దని పిటిషనర్ వాదనలను హైకోర్టు పట్టించుకోలేదు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ను సవాల్ చేస్తూ బి. మాధవరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మాధవరెడ్డితో పాటు మరికొందరు కూడా పిటిషన్లు వేశారు. మరో వైపు బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తదితరులు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. బుధవారం నాడు ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణను ప్రారంభించింది. స్థానిక సంస్థల నోటిఫికేషన్ ఇచ్చారా? షెడ్యూల్ ఇచ్చారా అని హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది. గతంలో స్పెషల్ బెంచ్ కౌంటర్ దాఖలు చేయాలని ఏమైనా ఆదేశాలు ఇచ్చిందా అని హైకోర్టు ప్రశ్నించింది. ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా అని అడిగింది. ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసిన విషయాన్ని హైకోర్టు దృష్టికి తెచ్చారు ప్రభుత్వ న్యాయవాది. లంచ్ తర్వాత అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని పిటిషన్ పై విచాచారణను వాయిదా వేసింది కోర్టు. మధ్యాహ్నం లంచ్ తర్వాత ఈ పిటిషన్ పై విచారణను ప్రారంభించింది.
భోజన విరామం తర్వాత బీసీ రిజర్వేషన్ల అంశంపై పిటిషనర్ల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై శాస్త్రీయమైన ఆధారాలు చూపడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. బీసీ కులగణన చేసినా దానికి సంబంధించిన వివరాలు బయటపెట్టలేదని హైకోర్టుకు తెలిపారు. బీసీ కులగణన ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లను కల్పించినట్టు చెబుతున్నారని, మరి ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు మాత్రం 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకున్నారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఎస్సీ, ఎస్టీల జనాభా తగ్గిందా? పెరిగిందా? అనే లెక్కలు ప్రభుత్వం వద్ద లేవని పిటిషనర్ తరపు న్యాయవాది ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ జనాభాను పరిగణనలోకి తీసుకోకుండా బీసీ రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. 2018లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తే ఇదే హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది గుర్తు చేశారు. రాజ్యాంగ విరుద్దంగా ఎన్నికల నిర్వహణను తాము వ్యతిరేకిస్తున్నామని పిటిషనర్ వాదించారు.
బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి వాదనలు వినిపించారు. రిజర్వేషన్లను పెంచుకోనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని వాదనలు వినిపించారు. ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకొనే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపును అన్ని రాజకీయ పార్టీలు సమర్ధించాయని ఆయన హైకోర్టు దృష్టికి తెచ్చారు. శాసనవ్యవస్థ చేసిన చట్టాన్ని ఎవరూ ప్రశ్నించలేరని చెబుతూనే సవరణ చేసినా చట్టం చేసినా శాసన వ్యవస్థదే నిర్ణయమని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై స్టే ఇవ్వాలని కోరడాన్ని ఆయన సరైంది కాదన్నారు. సమగ్ర కులగణన ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. రాష్ట్రంలో బీసీలు 56 శాతం మంది ఉన్నారని కులగణనలో తేలిన విషయాన్ని సింఘ్వి కోర్టు దృష్టికి తెచ్చారు. చట్టసభలు చేసిన చట్టాలను గవర్నర్లు త్రిశంకుస్వర్గంలో ఉంచుతున్నారని సింఘ్వి అన్నారు. బిల్లులపై గవర్నర్లు నెలల పాటు ఏ నిర్ణయం చెప్పడం లేదన్నారు. బిల్లులను ఆమోదించడం లేదు, తిరస్కరించలేదు, తిప్పి పంపడం లేదనే విషయాన్ని కోర్టుకు తెలిపారు. ప్రజల ద్వారా ఎన్నికైన సభలు చేసే చట్టాలను ఆమోదించకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. తమిళనాడులో ఒక బిల్లు ఐదేళ్లు గవర్నర్ వద్దే ఉందన్నారు. ఆర్టికల్ 200ను గవర్నర్లు దుర్వినియోగం చేస్తున్నారని సింఘ్వి అన్నారు. గవర్నర్లు నిర్ణయాలు తీసుకోకపోతే వ్యవస్థ స్థంభించిపోతోందన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ గవర్నర్ ఇలానే వ్యవహరించారని ఆయన ఆరోపించారు. గవర్నర్ల చర్యల వల్ల ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోతున్నాయని సింఘ్వి వాదించారు. సమగ్ర అధ్యయనం తర్వాతే బీసీ బిల్లు చేశారు, జీవో తెచ్చారని పూర్తి వాదనలు విన్న తర్వాతే జీవో 9 పై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు.
గవర్నర్ బిల్లును ఆమోదించనందున ఈ బిల్లుకు ఆమోదం లభించినట్టుగా ప్రభుత్వం నోటిఫై చేసిందా ? అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఎక్స్‌ట్రా ఆర్డినరి గెజిట్ లోనే నోటిఫై చేసినప్పుడు దాన్ని చట్టంగా పరిగణించలేం కదా అని హైకోర్టు అడిగింది. బిల్లులో తెచ్చిన సవరణలనే తర్వాత ఆర్డినెన్స్ రూపంలో ఇచ్చారా అని జడ్జి అడిగారు. కమిషన్ డేటాను పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజలనుంచి అభ్యంతరాలను ఆహ్వానించిందా? ఈ మేరకు కొన్ని తీర్పులున్నాయి కదా అని హైకోర్టు ప్రశ్నకు అన్ని పార్టీలు బీసీ రిజర్వేషన్లను సమర్ధించాయని ప్రభుత్వ తరపు న్యాయవాది సమాధానం ఇచ్చారు. చట్టాన్ని ఎవరూ ఛాలెంజ్ చేయలేదని హైకోర్టు దృష్టికి తెచ్చారు. చట్టం ద్వారా జారీ అయిన జీవోను ఛాలెంజ్ చేశారని చెప్పారు. జీవోకు కారణమైన చట్టాన్ని చాలెంజ్ చేయకుండా జీవోను ఛాలెంజ్ చేశారన్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని రాజ్యాంగంలో లేదని సుప్రీంకోర్టు ఆదేశం మాత్రమేనని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. డేటా ఆధారంగా రిజర్వేషన్ల పెంపునకు ప్రభుత్వానికి, శాసనవ్యవస్థకు నిర్ణయం తీసుకొనే అధికారం ఉందని ప్రభుత్వం వాదించింది. ఎంపిరికల్ డేటా ఉంటే 50 శాతం క్యాప్ పెంచవచ్చని తీర్పులున్నాయని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. 2019 లో ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ గవర్నర్ వద్ద బిల్లు ఎంతకాలం నుంచి పెండింగ్ లో ఉందని హైకోర్టు ప్రశ్నించింది. ట్రిపుల్ టెస్ట్ విధానాన్ని అమలు చేశారా అని హైకోర్టు అడిగింది. షెడ్యూలల్ నోటిఫై అయిందా అని అడ్వకేట్ జనరల్ ను హైకోర్టు ప్రశ్నించింది. ఇంకా వాదనలున్నాయని… విచారణను రేపటికి వాయిదా వేయాలని హైకోర్టును అడ్వకేట్ జనరల్ కోరారు. అడ్వకేట్ జనరల్ వినతి మేరకు విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.