విధాత ప్రతినిధి, ఉమ్మడి నిజామాబాద్: కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం పర్యటించిన మంత్రి కేటీఆర్‌కు అక్కడి బీడీ కార్మికుల నుంచి నిరసన సెగ తగిలింది. బీఆర్ఎస్ నిర్వహించిన కార్యకర్తల సభలో మంత్రి ప్రసంగిస్తుండగా, బీడీ కార్మికులు తమ డిమాండ్లపై పోస్టర్లు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా నెరవేర్చడం లేదని మండిపడ్డారు. ఈ సందర్భంలో బీడీ కార్మికుల తరఫున బీఎల్టీయూ నేత నాగరాజు నిరసన తెలియజేస్తుండగా, బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. పిడిగుద్దులతో దాడి చేశారు.
ఈ తరుణంలో సభలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పోలీసులు రంగంలోకి దిగి చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అనంతరం నాగరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వ తీరుపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రశ్నించే వారిని అరెస్టు చేసి స్టేషన్ తరలించడం ఏంటి అని పోలీసుల తీరుపై మండిపడ్డారు. పోలీసులు బీఆర్ఎస్ కు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.