Bhu Matha । భూమాతతో భారీ ఊరట.. ఇక నుంచి రైతులు కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేదు..
భూమి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రెండు అంచెల వ్యవస్థను అమలులోకి తీసుకు వస్తున్నది. ఒకటి అధికార వ్యవస్థ.. రెండవది ట్రిబ్యునల్ వ్యవస్థ. ఈ మేరకు జిల్లాకు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉన్నది. ఈ మేరకు ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం కొత్త చట్టంలో స్పష్టం చేసింది.

Bhu Matha । భూమి యజమానులకు శుభవార్త… భూమి సమస్యలన్నీఇక నుంచి స్థానికంగానే పరిష్కారం కానున్నాయని ప్రభుత్వం చెపుతోంది. ఈ మేరకు కొత్త ఆర్వోఆర్ ముసాయిదా బిల్లును ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు అసెంబ్లీ ఉభయ సభల ఆమోదం పొంది, గవర్నర్ సంతకం కాగానే చట్టంగా మారి వెంటనే అమలులోకి రానున్నది. వెబ్‌సైట్ పూర్తిస్థాయిలో రూపొందటానికి, వర్కింగ్ గైడ్ లైన్స్ రావడానికి రెండు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన రోజు నుంచి రైతులు తమ రికార్డులు సరి చేసుకోవడానికి కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోతుంది. రైతులు తమ భూమి సమస్యలను తాసిల్దార్‌కు తెలియజేస్తూ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి పరిష్కరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం తాసిల్దార్లకు పూర్తి స్థాయిలో అధికారం అప్పగిస్తోంది. అలాగే భూ యజమానులకు తాసిల్దార్ న్యాయం చేయకపోతే ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవచ్చు.. అక్కడ పరిష్కారం కాకపోతే కలెక్టర్ వద్ద పరిష్కరించుకోవచ్చు. ఇలా రైతులు తమ సమస్యల పరిష్కారానికి సలువైన మార్గాలను ప్రభుత్వం అమలులోకి తీసుకు వస్తున్నది. ఇప్పటి వరకు అమలులో ఉన్న ధరణి చట్టం వల్ల రైతులు తమ రికార్డుల కరెక్షన్‌కు కూడా కోర్టును ఆశ్రయించాల్సిన దుస్థితి ఉండేది. దీనిని మార్చి తాకసిల్దార్లే సమస్యను పరిష్కరించే నూతన వ్యవస్థను ప్రభుత్వం తీసుకు వస్తోంది.
సమస్యల పరిష్కారానికి రెండంచెల వ్యవస్థ
భూమి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రెండు అంచెల వ్యవస్థను అమలులోకి తీసుకు వస్తున్నది. ఒకటి అధికార వ్యవస్థ.. రెండవది ట్రిబ్యునల్ వ్యవస్థ. ఈ మేరకు జిల్లాకు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉన్నది. ఈ మేరకు ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం కొత్త చట్టంలో స్పష్టం చేసింది. గత ప్రభుత్వం అమలులోకి తీసుకు వచ్చిన కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌ను ఈ ప్రభుత్వం అలాగే కొనసాగిస్తోంది. వ్యవసాయ భూముల క్రయవిక్రయాలను గత ప్రభుత్వంలో మాదిరిగా తాసిల్దార్లే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లు చేస్తారు. అయితే ఇప్పటి నుంచి భూముల రిజిస్ట్రేషన్ లో స్పష్టమైన భూమి కొలతలున్న కో ఆర్డినేట్స్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ మేరకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలలో కో ఆర్డినేట్స్‌తో కూడిన చిత్రపటాన్ని పొందు పరుస్తారు.
గ్రామ కంఠాలకు కూడా పక్కా రికార్డులు
తెలంగాణలో ఇప్పటి వరకూ గ్రామ కంఠాల భూములకు ఎలాంటి రికార్డులు లేవు. దీనితో గ్రామాల్లో ఇళ్లు కట్టాలంటే బ్యాంకు నుంచి కూడా రుణాలు లభించేవి కావు. దీంతో ఇళ్ల నిర్మాణానికి గాను గ్రామస్తులు డబ్బు సమకూర్చుకునేందుకు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో వ్యవసాయేతర భూములతోపాటు మొట్టమొదటిసారి గ్రామ కంఠాలకు కూడా పక్కా రికార్డులు రూపొందించాలని కొత్తగా తీసుకువచ్చిన చట్టంలో పొందుపరిచారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి స్వామిత్వ పథకం కింద వచ్చే నిధులతో సర్వే చేయనున్నారు. ఈ సర్వే పూర్తయిన తరువాత అవార్డు ప్రకటించాలని, అప్పటి నుంచి కో ఆర్డినేట్స్ ఉన్న ప్లాట్లు, ఇంటి స్థలాలకే రిజిస్ట్రేషన్ చేయనున్నారు.
డబుల్ రిజిస్ట్రేషన్ల దందాలకు చెక్
ఎక్కడ కూడా డబుల్ రిజిస్ట్రేషన్లు, కబ్జాలకు ఆస్కారం లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం పక్కా చర్యలను ఈ చట్టం ద్వారా చేపట్టనున్నది. ఇందు కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున సర్వేయర్లను నియమించే అవకాశం ఉంది. పక్కా కొలతలు, రికార్డులు ఉంటేనే ఇక నుంచి భూములు రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి.