వానకాలం సాగు సీజన్ ప్రారంభం ఏరువాక పౌర్ణమి 29 జూన్ 2026 నుండి తలపెట్టిన రైతు బిడ్డల పొలం బాట కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వివిధ రంగాలలోని రైతు బిడ్డలకు భూమి సునీల్ పిలుపునిచ్చారు. వ్యవసాయ కుటుంబం లో పుట్టి ఉన్నత చదువులు చదివిన లేదా చదువుతున్న అందరం ఓ సారి పొలం బాట పడుదాం. మన చదువును, మన హోదాలను కొన్ని రోజులైన మన మూలాల కోసం ఉపయోగిద్దాం. రైతులతో మాట్లాడుదాం. వారి సమస్యలు, కష్టాలు విందాం. మనం ఇవ్వగలిగే సలహాలు, సమాధానాలు ఇద్దాం. చెయ్యగలిగే సాయం చేద్దాం అని సునీల్ పొలం బాట కార్యక్రమంంలో కలిసి రావాలని రైతు బిడ్డలకు సూచించారు.
రైతు కుటుంబాల నుండి వచ్చి వ్యవసాయం, న్యాయశాస్త్రం, ఇంజినీరింగ్, వైద్యం, మేనేజ్మెంట్, జర్నలిజం, ఇలాంటి వృత్తి విద్యా కోర్సులు చదివిన లేదా చదువుతున్న అందరు ఓ సారి గ్రామాలకు వెళ్లి మీ జ్ఞానాన్ని రైతులకు పంచండి. వారి సమస్యలు వినండి. సలహాలు అందించండి. ఆ సమస్యల పరిస్కారానికి మీవంతు ప్రయత్నించండని కోరారు.
రైతును ఆదుకుందాం, వ్యవసాయాన్ని కాపాడుకుందాం అని అభ్యర్థించారు. మనకు రైతులతో ఉన్న అనుబంధం, సాగుతో సంబంధం, మట్టి పై మమకారం, పల్లెతో పేగుబంధం, మనవంతుగా సేవచేసి నిలుపుకుందాం అని రైతు బిడ్డలకు భూమి సునీల్ పిలుపునిచ్చారు. పొలం బాటలో రైతుల సమస్యలు తెలుసుకుoదాం,సలహాలు, సమాచారం అందిద్దాం, అన్నదాతలకు అండగా నిలుద్దాం అని పేర్కొన్నారు.
