Eleti Maheshwar Reddy | మేఘాపై కేసులు ఎందుకు పెట్టరు.. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నిలదీత
సుంకిశాల పథకం పంప్‌హౌజ్ గోడ కూలిన ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసు ఎందుకు పెట్టడం లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం సుంకిశాల పంప్‌హౌజ్‌ను సందర్శించారు

విధాత, హైదరాబాద్ : సుంకిశాల పథకం పంప్‌హౌజ్ గోడ కూలిన ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసు ఎందుకు పెట్టడం లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం బీజేఎల్పీ ఎమ్మెల్యేల బృందం సుంకిశాల పంప్‌హౌజ్‌ను సందర్శించింది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్ బాబు, రామారావు పటేల్, ఎమ్మెల్సీ ఎ.వి.ఎన్. రెడ్డి సహా స్థానిక బీజేపీ నాయకులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పథకం నిర్మాణ వివరాలు..పనుల పురోగతి, ప్రమాద ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఇంజనీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సుంకిశాల ఘటన జరిగిన వారం రోజుల పాటు సమాచారాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారన్నదానిపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టతనివ్వాలన్నారు. నిర్మాణ సంస్థ మేఘాను రక్షించేందుకే గోప్యత పాటించారా అని, అందుకే ఈ సంఘటనను మంత్రులు చిన్న సంఘటనగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఒక వేళ ఈ ప్రమాదం పని జరిగేటప్పుడు జరిగివుంటే భారీ ప్రాణ నష్టం జరిగేదన్నారు. సుంకిశాల టన్నెల్‌ను ఓపెన్ చేసేందుకు అనుమతులున్నాయా అని ప్రశ్నించారు. కూలిన రిటైనింగ్ వాల్ స్థానంలో కొత్తదాని నిర్మాణం కోసం జరిగే ఖర్చు వాస్తవానికి ఎవరు భరిస్తారన్నదానిపై ప్రభుత్వం వివరాలు వెల్లడించాలన్నారు. సుంకిశాల ఘటనపై ప్రభుత్వం త్రిమెన్ కమిటీ వేస్తామని చెప్పిందని, మంత్రులు ఆ కమిటీ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మంత్రులు ఈ ఘటన పై సమీక్ష కూడా చేయలేదని, మేఘా కాంట్రాక్టు సంస్థపై కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని నిలదీశారు. మేఘా కృష్ణా రెడ్డి తనకు ఇష్టం వచ్చినట్లు ఈ ప్రాజెక్టు పనులు చేస్తున్నారని, మేఘా కాంట్రాక్టర్ అసలు నాణ్యమైన పనులు చేయదన్నరేవంత్ రెడ్డి మళ్ళీ వారికే ఎలా పనులు కేటాయిస్తున్నారదానిపై ప్రజలు జవాబు చెప్పాలని మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మెుదట రూ.1,500 కోట్ల అంచనా అంటూ ఇప్పుడు రూ.2,215కోట్లకు ఎందుకు పెంచారో చెప్పాలంటూ మహేశ్వర్ రెడ్డి వరస ప్రశ్నలు సంధించారు.
ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ సుంకిశాల ఘటనలో కాంట్రాక్టర్ తప్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మేఘా కృష్ణారెడ్డి లైసెన్స్ రద్దు చేయాలని, ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది అతి చిన్న ప్రమాదం అని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అంటున్నారని, రూ.2వేల కోట్ల ప్రజా ధనం చిన్న విషయమా అంటూ ఆయన తీవ్రంగా స్పందించారు. ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు గోప్యత పాటిస్తోందో చెప్పాలని ఎమ్మెల్యే హరీశ్ డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగి సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత గాని ప్రభుత్వం బయటపెట్టలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని అధికారులు చెప్తున్నారని, కానీ ఆ అంశంలో తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. దీనిపై ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలని హరీశ్ డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేఘా సంస్థపై అనేక ఆరోపణలు చేశారని, మరిప్పుడు వారికెలా పనులు కట్టబెట్టారని ఎమ్మెల్యే హరీశ్ ప్రశ్నించారు.