Raja Singh | తెలంగాణ బీజేపీ సారధిపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి ఆ పార్టీ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు

Raja Singh | తెలంగాణ బీజేపీ సారధిపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

దూకుడైన నేతకే పగ్గాలివ్వాలని సూచన

విధాత : తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి ఆ పార్టీ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నూతన అధ్యక్షుడిగా అందరిని కలుపుకుపోయే వ్యక్తితో పాటు దేశం పట్ల, ధర్మం పట్ల అవగాహాన ఉండి హిందూత్వ విధానాల మేరకు గట్టిగా పనిచేసే వ్యక్తినే ఎంపిక చేస్తే బాగుంటుందన్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలో రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. అయితే తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎవరుంటే బాగుంటుందో రాజాసింగ్ బయటకు చెప్పకపోయినా ప్రస్తుతం రేసులో ఉన్న వారిలో ఆయన మొగ్గు ఎవరివైపు అన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్థానంలో నూతన అధ్యక్షుడి ఎంపికకు ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ఆలోచన చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సీఎం నినాదం ఇచ్చిన బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బీసీని ఎంపిక చేస్తారా లేక వచ్చే ఎన్నికల దృష్ట్యా సామాజిక, రాజకీయ సమీకరణలన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేస్తారో వేచి చూడాల్సివుంది. బీజేపీ కొత్త అధ్యక్షుడి రేసులో ఈటల రాజేందర్‌, డీకే. అరుణ, ధర్మపురి అర్వింద్‌, రఘునందన్‌రావు సహా పలువురు సీనియర్ నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి.