కాంగ్రెస్‌ను బలహీనపర్చడమే.. ఇదే కాషాయ పార్టీ లక్ష్యం!

  • Publish Date - October 7, 2023 / 01:40 PM IST
  • తెలంగాణ బరిలో 3 పార్టీలు
  • కాంగ్రెస్‌, బీఆరెస్‌ మధ్యే పోటీ

విధాత: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి అవసరమైన మెజారిటీ మార్క్‌ను చేరుకోలేకపోవచ్చనే విషయంపై ఇప్పటికే అనేక సర్వేలు వెల్లడించాయి. చాలామంది రాజకీయ విశ్లేషకులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పేరుకు మూడు పార్టీలు బరిలో ఉన్నా.. పోటీ మాత్రం బీఆరెస్‌, కాంగ్రెస్‌ మధ్య నువ్వా నేనా? అన్న స్థాయిలో ఉండబోతున్నదని అర్థమవుతున్నది. సర్వేలు కూడా ఇదే చెబుతున్నాయి.


కానీ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ పాల్గొన్న ఇద్దరు అగ్రనేతలు వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఈసారి ఏ పార్టీకి 60 సీట్లు వచ్చే అవకాశం లేదు. అధికారంలోకి వచ్చే బీజేపీకి ఉన్నఅవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి’ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం చర్చనీయాంశమైంది.


ఇప్పటి వరకూ వెలువడిన అన్ని సర్వేల్లో బీజేపీకి ఎంఐఎం కంటే తక్కువే సీట్లు వస్తాయని తేలింది. అంతేకాదు ఆ పార్టీ రెండంకెల సీట్లు దక్కించుకుంటే అదే ఎక్కువ అన్నట్టు ఉన్నది. మరి బీజేపీ అధికారంలోకి ఎలా వస్తుందని పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మెజారిటీ రాకున్నా, అధికారానికి అవసరమైన సంఖ్యా బలం లేకున్నా గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో ఆ పార్టీ వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే.


అదే విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని ఇప్పటినుంచే వ్యూహాలు రూపొందిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్‌ సంతోష్‌దే ప్రధాన పాత్ర అని ఆరోపిస్తూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనను విచారణకు హాజరుకాలేదు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు వెలుగులోకి వచ్చి ఆప్‌ మంత్రి మనీష్‌ సిసోడియా, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, ఆయన తనయుడు రాఘవ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితలకు ఈ కేసులో ప్రమేయం ఉన్నదని ఈడీ కేసు నమోదు చేసి విచారించింది.


ఈ కేసులో ఒక్క కవిత తప్పా ఆరోపణలు ఎదుర్కొన్న అందరూ అరెస్టయ్యారు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అప్పుడే బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య క్విడ్‌ ప్రొ కో నడుస్తున్నదని కాంగ్రెస్‌ సహా ఇతర విపక్షాలు విమర్శించాయి. అందుకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్‌ను అరెస్టు చేయలేదనే వాదనలు వినిపించాయి.


మొన్న రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోదీ సహా ఆ పార్టీ కేంద్ర నాయకుల వ్యాఖ్యలు చూస్తుంటే.. కాంగ్రెస్‌ పార్టీనే టార్గెట్‌గా చేసుకున్నట్టు కనిపిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. ఆ పార్టీకి అధికారంలోకి వచ్చే అవకాశాలను దెబ్బకొట్టడానికే బీజేపీ ప్రయత్నాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ప్రజలను పక్కదోవ పట్టించి పరోక్షంగా బీఆర్‌ఎస్‌కు మేలు చేసేలా బీజేపీ నేతల కామెంట్లు ఉన్నాయంటున్నారు. బీఎల్‌ వ్యాఖ్యలు కూడా దానికి బలం చేకూర్చేలా ఉన్నాయని చెబుతున్నారు.


ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్‌పై చేసిన విమర్శలు కూడా హాస్యాస్పదంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘ప్రాంతీయ ఆకాంక్షలను విస్మరించిన కాంగ్రెస్‌.. ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చేందుకు కారణమైంది’ అని నడ్డా చెబుతున్నారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, ఆర్జేడీ, జేఎంఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, బీఆర్‌ఎస్‌, వైసీపీ ఇలా అన్ని పార్టీలు కుటుంబ పార్టీలుగా మారాయన్నారు.


నడ్డా పేర్కొన్న ప్రాంతీయ పార్టీల్లో పీడీపీ, శివసేన ఎన్డీఏలో భాగస్వామిగానే ఉన్నాయి. ఆ పార్టీలతో కలిసి ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని పంచుకున్నది నిజం కాదా? ఇక మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నడ్డా పేర్కొన్న పార్టీల్లో ఆర్జేడీ, డీఎంకేలు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాయి. వారి ప్రభుత్వం తెచ్చిన అనేక వివాదాస్పద బిల్లులను వ్యతిరేకించాయి. మిగిలిన ప్రాంతీయ పార్టీల్లో బీఆర్‌ఎస్‌, వైసీపీ ఎన్డీఏ భాగస్వామి కాకున్నా ప్రభుత్వానికి పార్లమెంటులో బిల్లులను ఆమోదించుకునే ప్రయత్నంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించింది వాస్తవమే.


మరి ఈ ప్రాంతీయ పార్టీల మద్దతు ఎందుకు తీసుకున్నారు? కుటుంబ పార్టీలుగా చెబుతున్న ప్రాంతీయ పార్టీలతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? అనే ప్రశ్నలు సంధిస్తున్నారు. దేశంలో బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ అన్న నడ్డా మాటలకు కూడా జనం నవ్వుకుంటున్నారు. ఆ పార్టీకి ఒక జాతీయ విధానం అంటూ ఏదీ లేదని విమర్శిస్తున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానాన్ని అవలంబిస్తున్నది. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అని నినదించిన బీజేపీకి అది సాధ్యం కాదని తెలిసింది.


దీంతో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్నచోట్ల తమకు బలం లేకున్నా ప్రాంతీయ పార్టీలను ముందుపెట్టి ఆ పార్టీని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నది. ప్రాంతీయ పార్టీల భుజాలపై తుపాకీ పెట్టి కాంగ్రెస్‌ పార్టీని కాలుస్తున్నదనే విమర్శలు బీజేపీపై ఉన్నాయి. ఈ తొమ్మిదిన్నరేళ్ల మోదీ పాలనలో జరిగిన పరిణామాలు చూస్తే ఆ విమర్శలు వాస్తవాలే అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.