Harish Rao | ఎంపీలా? దిష్టిబొమ్మలా?.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై హరీష్ రావు ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన పదహారు మంది ఎంపీలున్నా....పత్తి రైతుల సమస్యలపై ప్రశ్నించకుండా దిష్టిబొమ్మలుగా మారారని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు.

Harish Rao | ఎంపీలా? దిష్టిబొమ్మలా?.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై హరీష్ రావు ఫైర్

విధాత, వరంగల్ ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన పదహారు మంది ఎంపీలున్నా….పత్తి రైతుల సమస్యలపై ప్రశ్నించకుండా దిష్టిబొమ్మలుగా మారారని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఈ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకంటే ఆ…దిష్టిబొమ్మలే నయమని, చేలల్లో పెట్టే దిష్టిబొమ్మలైనా కనీసం పంటను కాపాడుకునేందుకు ఉపయోగపడుతాయని, కానీ, ఈ ఎంపీ దిష్టిబొమ్మలు రైతుల నోరెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బీఆర్ఎస్ నాయకుల బృందంతో కలిసి వరంగల్ ఎనుమాముల మార్కెట్ ను హరీష్ రావు దర్శించారు. అనంతరం ఆయన కేసముద్రం మార్కెట్​ ను సైతం సందర్శించారు.

ఈ సందర్బంగా మక్క, పత్తి రైతులతో మాట్లాడారు. సీసీఐ తీరుకు నిరసనగా కాటన్ జిన్నింగ్ మిల్లర్లు, ట్రేడర్లు సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేసిన నేపత్యంలో బీఆర్ఎస్ పార్టీ బృందం మార్కెట్ ను సందర్శించింది. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ రెండు పార్టీల నాయకులకు రైతుల సమస్యల కంటే బీఆర్ఎస్ ను విమర్శించడానికే పనిచేస్తున్నారని అన్నారు. రైతులంటే ఈ ప్రభుత్వాలకు కనికరం లేదన్నారు.

సీఎంకు తీరిక లేదా?

60 సార్లు ఢిల్లీకి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డికి పత్తి రైతుల గురించి, సీసీఐ గురించి బడేబాయ్ మోదీతో మాట్లాడే తీరిక లేదా? అంటూ హరీష్ ప్రశ్నించారు. మోదీతో దోస్తీ ఉంది.. ప్రధానితో మాట్లాడి.. పత్తి రైతులకు మద్దతు ధర ఇప్పించండంటూ ఆయన డిమాండ్ చేశారు. కలెక్షన్ల పై మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరుపుకున్నారు.. తప్ప రైతు సమస్యల పై ఏ రోజు సమీక్ష జరపలేదన్నారు. పత్తి కొనుగొళ్ళు నిలిచిపోవడంతో రైతులు ఆందోళనకు గురి అవుతున్నారన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇబ్బందులు పడుతున్నారని, కిసాన్ యాప్ రద్దు చేయాలన్నారు. కేంద్రం తీసుకువచ్చిన నిబంధనలు.. బడా పారిశ్రామిక సంస్థలు వ్యాపారులకు లాభం తప్ప రైతులకు ఏలాంటి లాభం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్, బండా ప్రకాష్, సిరికొండ మధుసూదనాచారి, ఎర్రబెల్లి దయాకర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, తక్కెళ్ళపెల్లి రవిందర్ రావు, నరేందర్, ధర్మారెడ్డి, సత్యవతి రాథోడ్, సాంబారి సమ్మారావు తదితరులు పాల్గొన్నారు.