MLA Jagadish Reddy | రుణమాఫీ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి

రైతు రుణమాఫీలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, బీఆరెస్‌ ఎమ్మెల్యే జి. జగదీశ్‌ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు

MLA Jagadish Reddy | రుణమాఫీ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి

తెలంగాణకు సంబంధం లేని రాజీవ్ విగ్రహం ఎందుకు

MLA Jagadish Reddy | రైతు రుణమాఫీ (Rythu Runa Mafi)లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) విఫలమైందని మాజీ మంత్రి, బీఆరెస్‌ ఎమ్మెల్యే జి. జగదీశ్‌ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీపై ఒక్కో మంత్రి ఒక్కోవిధంగా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. అందరికి రుణమాఫీ చేయలేదని మంత్రులే చెబుతున్నారన్నారని, బ్యాంకుల లెక్కప్రకారం 50 లక్షల మందికిపైగా రైతులుకు సంబంధించి రూ.49 వేల కోట్లు రుణాలున్నాయని, అయితే మంత్రులు మాత్రం రూ.31 వేల కోట్లు మాఫీ చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటివరకూ రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య స్పష్టంగా చెప్పట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై కాంగ్రెస్ పగటి దొంగలా దొరికిందని విమర్శించారు. రూ.17లక్షల 13వేల మందికి ఇంకా రుణమాఫీ జరగలేదని స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఒప్పుకున్నారని తెలిపారు.

రుణమాఫీ పడని రైతులకు ఏ తేదీలోపు చేస్తారో చెప్పాలని నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మాత్రం రైతులందరికీ రుణాలు మాఫీ చేశామంటూ చేశామని డ్యాన్స్‌ చేస్తున్నరని విమర్శించారు. మరి ఇప్పుడు ముక్కు నేలకు రాయాల్సింది ఎవరని ప్రశ్నించారు. అసంపూర్ణ రుణమాఫీతో రైతులను మోసం చేసిన రేవంత్‌రెడ్డి తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలని తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ కాని రైతులు ఎక్కడా ఫిర్యాదు చేయాలో స్పష్టత లేదన్నారు. తమకేం తెలియదని అధికారులు, బ్యాంకు సిబ్బంది చెబుతున్నారని వెల్లడించారు. అసలు ఎంతమందికి మాఫీ చేస్తారూ.. ఇప్పటివరకు ఎంతమందికి చేశారో చెప్పాలన్నారు. మిగిలినవారికి ఏ తేదీలోగా మాఫీ చేస్తారో స్పష్టం చేయాలన్నారు. రుణమాఫీపై కాంగ్రెస్‌ సర్కార్‌ శ్వేతపత్రం (White paper) విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రతిపక్షంగా ఇంకా తమ పని మొదలుపెట్టలేదని జగదీశ్‌ రెడ్డి అన్నారు. దగాపడ్డ రైతులే స్వయంగా రోడ్డెక్కుతున్నారని తెలిపారు. ఆందోళన చేస్తున్న రైతులను కేసులతో భయపెడుతున్నారని విమర్శించారు. రూ.2 లక్షలకు మించి ఉన్న రుణం కడితేనే మాఫీ చేస్తామంటున్నరని, ప్రభుత్వం రూ.2లక్షలు మాఫీ చేస్తే మిగతావి రైతులే కట్టుకుంటారని వెల్లడించారు. ఏ తేదీలోగా మాఫీ చేస్తారో చెబితే మిగతావి రైతులు కడుతామంటున్నరని వెల్లడించారు.

రాజీవ్ విగ్రహం తొలగిస్తాం

బీఆరెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సెక్రటేరియట్‌ వద్ద రాజీవ్‌ గాంధీ విగ్రహం తొలగిస్తామని జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల అభిప్రాయం మేరకు అక్కడ విగ్రహం పెడతామని, రాజీవ్‌ గాంధీకి తెలంగాణతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంతో ఆత్మతో సంబంధం లేనోళ్లు ఇవ్వాళ సెక్రటేరియట్‌లో కూర్చున్నారని, అందుకే తెలంగాణకు సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. రాజీవ్‌గాంధీ తన జీవిత కాలంలో ఎప్పుడైన తెలంగాణ పదం ఉచ్చరించడా అని, తెలంగాణకు ప్రత్యేకంగా ఏమైనా అభివృద్ధి చేశాడా అని ప్రశ్నించారు. రాజకీయ వైషమ్యాలకు దూరంగా హుందాగా వ్యవహారించిన కేసీఆర్‌ గత పాలకులు పెట్టిన పేర్ల జోలికి వెళ్లలేదన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుకు పూనుకుని అభ్యంతరకర విధానాలకు తెరలేపిందన్నారు. ఇప్పటికే ఈ సమస్యపై రాహుల్ గాంధీకి హరగోపాల్ ఉత్తరం రాశారని, కోదండరామ్ సైతం దీనిపై స్పష్టమైన అభిప్రాయం చెప్పాలని జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.