Padi Kaushik Reddy | ఇంటింటికి పాడి కౌశిక్‌రెడ్డి దంపతులు.. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చెక్కుల పంపిణీ
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి రాజకీయాల్లో తన వ్యవహారశైలితో నిత్యం వార్తల్లో నిలవడం పరిపాటిగా మారింది.

విధాత, హైదరాబాద్ : హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి రాజకీయాల్లో తన వ్యవహారశైలితో నిత్యం వార్తల్లో నిలవడం పరిపాటిగా మారింది. ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు తనను గెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని భార్య, కూతురితో సహా వీడియో విడుదల చేయడం మొదలుకుని ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్‌పై బొగ్గు బూడిద అక్రమ రవాణాకు సంబంధించి ఆరోపణలలో, అసెంబ్లీ చర్చల్లోనూ తన దూకుడైన విమర్శలతో అందరి దృష్టిని ఆకర్షించారు.
ఇంటి ఇంటికి కౌశిక్ అన్న @BRSparty pic.twitter.com/RQ790ltKiK
— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) August 15, 2024
తాజాగా నియోజకవర్గం పరిధిలోని లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఏకంగా తన సతీమణి షాలినీ రెడ్డితో కలిసి ద్విచక్ర వాహనంపై లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. వీణవంక మండలంలోని మామిడాలపల్లి, ఇప్పలపల్లి, చల్లూర్, వల్బాపూర్, కనగర్తి, బేతిగల్, కిష్టంపేట లక్ష్మక్కపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దంపతులు ఇంటింటికి తిరిగి చెక్కులను అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.