BRS | సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనపై బీఆరెస్ స్కానింగ్‌

సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనపై బీఆరెస్ పార్టీ స్కానింగ్ కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటనలో పెట్టుబడుల సాధనకు ఎక్కడెక్కడికి వెలుతున్నారు..

BRS | సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనపై బీఆరెస్ స్కానింగ్‌

కొరియా పర్యటనలో రేవంత్‌తో ఫినిక్స్ కంపనీ సురేశ్ భేటీపై రచ్చ

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనపై బీఆరెస్ పార్టీ స్కానింగ్ కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటనలో పెట్టుబడుల సాధనకు ఎక్కడెక్కడికి వెలుతున్నారు..ఎవరెవరిని కలుస్తున్నారు..ఏయే కంపనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారన్న వివరాలతో పాటు ఒప్పందాలు చేసుకుంటున్న కంపనీల చరిత్రను సైతం ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ప్రజలముందుంచుతుంది బీఆరెస్ సోషల్ మీడియా. అమెరికా పర్యటన ముగించుకుని దక్షిణ కొరియాలో అడుగుపట్టిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబులతో ఫినిక్స్ గ్రూప్ చైర్మన్‌ సురేశ్ చుక్కపల్లి భేటీ కావడంపై బీఆరెస్ పార్టీ ప్రశ్నల వర్షం కురిపించింది.

గతంలో మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఎన్‌. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఫినిక్స్ కంపనీ సురేశ్ చుక్కపల్లి కల్వకుంట్ల కుటుంబానికి బినామీ అని..అతడిని జైల్లో వేయాలని..అతనిపై నేను పూర్తిగా ఈడీ, సీబీఐకి ఆధారాలిస్తానని చెప్పడం జరిగింది. ఆ వీడియోను సీఎం రేవంత్‌రెడ్డి కొరియా పర్యటనలో సురేశ్ చుక్కపల్లి కలిసి వున్న ఫోటోలతో జత చేస్తూ ఎక్స్‌లో పోస్టు చేసింది. సురేశ్ చుక్కపల్లి వ్యవహారంలో అప్పుడు అలా..ఇప్పుడు ఇలా కాంగ్రెస్ నేతలు వ్యవహారించడాన్ని బీఆరెస్ నిలదీసింది. ఇలాంటి ఫేక్ ప్రచారంతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారంటూ విమర్శలు సంధించింది.

గతంలో ఫీనిక్స్ సంస్థలో సోదాలు ఐటీ శాఖ సోదాలు సైతం నిర్వహించింది. బీఆరెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫీనిక్స్ చైర్మెన్ చుక్కపల్లి సురేష్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఫీనిక్స్ సంస్థలో కేటీఆర్ భారీగా పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణలు అప్పట్లో విపక్షాలు చేశాయి. ఫీనిక్స్ కు ప్రయోజనం కలిగేలా రూల్స్ కు విరుద్ధంగా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ఫీనిక్స్ గ్రూప్ దాదాపు లక్షా 50 వేల కోట్ల వ్యాపారం చేస్తుందని, హైదరాబాద్ నగరంలోని వందలాది ఎకరాల భూములను బీఆరెస్‌ ప్రభుత్వం ఫీనిక్స్ గ్రూప్ అప్పనంగా అప్పగించిందని విపక్షాలు ఆరోపించాయి.