KTR | రెండు లక్షల ఉద్యోగాల హామీలతో కాంగ్రెస్ మోసం:కేటీఆర్

రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశలు చెప్పి.. కాంగ్రెస్‌లోని ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీలు తమ ఉద్యోగాలు తెచ్చుకున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ విమర్శించారు

KTR | రెండు లక్షల ఉద్యోగాల హామీలతో కాంగ్రెస్ మోసం:కేటీఆర్

వారిద్దరికే ఉద్యోగాలు తెచ్చుకున్నారు
నిరుద్యోగులను అవమానిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశలు చెప్పి.. కాంగ్రెస్‌లోని ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీలు తమ ఉద్యోగాలు తెచ్చుకున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ విమర్శించారు. ఒకాయన ముఖ్యమంత్రి అయితే.. మరొకాయన జాతీయస్థాయిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయ్యాడన్నారు. కానీ తెలంగాణలో ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలకు అతి గతి లేదని మండిపడ్డారు. రాజకీయ నిరుద్యోగులు, కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులే పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 అక్టోబర్‌లో ఆనాటి కేసీఆర్‌ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వట్లేదని, నోటిఫికేషన్లు ఇవ్వలేదని, పరీక్షలు సరిగ్గా నిర్వహించలేకపోతుందని అసమర్థ ప్రభుత్వమని యువతను రెచ్చగొట్టారన్నారు.

తమ రాజకీయ నిరుద్యోగాన్ని తీర్చుకోవడానికి ఆనాడు రాహుల్‌గాంధీ, రేవంత్‌ రెడ్డి.. ఈ ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు కూడా తెలంగాణలోని యువతను, నిరుద్యోగలను రెచ్చగొట్టారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ను గెలిపిస్తే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలిస్తామని పత్రికలో ఫుల్‌పేజీ యాడ్‌లు ఇచ్చారని గుర్తు చేశారు. జాబ్‌ క్యాలెండర్‌ అని చెప్పి తేదీలతో సహా ఏ పోస్టుకు ఏ రోజు నోటిఫికేషన్‌ ఇస్తామని చెప్పేలా పత్రికా ప్రకటనలు ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చాకా ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ముందుగా నోటిఫికేషన్‌ ఇవ్వాలి, ఆ తర్వాత పరీక్ష పెట్టాలి.. ఆ తర్వాత ఇంటర్వ్యూ, ఎంపిక.. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదని, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అశోక్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ యువత అడుగుతున్నదేంటి? మీరు చెప్పిన రెండు లక్షల ఉద్యోగాల సంగతేంటి? ఒక్క నోటిఫికేషన్‌ ఎందుకు ఇవ్వలేదు? జాబ్‌ క్యాలెండర్‌ ఏమైందని అడుగుతున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. గ్రూప్‌ 2, 3లో పోస్టులు పెంచుతామన్న సంగతేంటి? అని అడుగుతున్నారని చెప్పారు. మెగా డీఎస్సీ ఏమైందని ప్రశ్నిస్తున్నారని.. నిరుద్యోగులపై సీఎం వ్యాఖ్యలు సరికాదని తప్పుబట్టారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంత దౌర్భాగ్యంగా, ఇంత దివాలాకోరుతనంతో మాట్లాడిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అని విమర్శించారు.