KTR | కేసీఆర్ కట్టిన సీతారామ ప్రాజెక్టుకు సీఎం రేవంత్‌రెడ్డి రిబ్బన్ కటింగ్: కేటీఆర్
మాజీ సీఎం కేసీఆర్ కట్టిన సీతారామ ప్రాజెక్టుకు సీఎం రేవంత్‌రెడ్డి రిబ్బన్ కట్ చేసి తామే పూర్తి చేసినట్లుగా క్రెడిట్ కొట్టేస్తున్నాడని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు

- పాత గోడకు కొత్త సున్నం కొట్టినట్టుగా రేవంత్ పెట్టుబడుల ప్రహాసనం
- అన్నగా చెల్లెలి బెయిల్ కోసం వెళితే విలీనమని దుష్ప్రచారం
- త్వరలోనే స్టేషన్ ఘనపూర్ సహా పది చోట్ల ఉప ఎన్నికలు ఖాయం
- బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- బీఆరెస్‌లో చేరిన మాజీ మంత్రి రాజయ్య
KTR | విధాత : మాజీ సీఎం కేసీఆర్ కట్టిన సీతారామ ప్రాజెక్టుకు సీఎం రేవంత్‌రెడ్డి రిబ్బన్ కట్ చేసి తామే పూర్తి చేసినట్లుగా క్రెడిట్ కొట్టేస్తున్నాడని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టును ప్రారంభించి గొప్పగా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మంచి జరిగితే రేవంత్ ఖాతాలో.. చెడు జరిగితే మాత్రం కేసీఆర్ ఖాతాలో వేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పూర్తి చేసిన పనులన్నీ తాను పూర్తి చేసినట్లగా బిల్డప్ ఇచ్చి రేవంత్ క్రెడిట్ కొట్టేస్తున్నారని విమర్శించారు. రిజర్వాయర్లు కట్టింది పంపులు పెట్టింది బీఆరెస్ ప్రభుత్వమైతే కేవలం రిబ్బన్ కట్ చేసి వదిలేసేది కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు.
రూ.75 కోట్లతో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి లక్ష ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు నోబుల్ ఫ్రైజ్ ఇవ్వాలన్నారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు గురించి క్రెడిట్ తీసుకునేందుకు ముగ్గురు మంత్రులు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారన్నారు. ఓ మంత్రి పోయి భూమి ముద్దాడితే ఇంకో మంత్రి నెత్తిన నీళ్లు చల్లుకుంటూ వాళ్లే సీతారామ ప్రాజెక్టు కట్టినట్లు చేస్తున్నారని, ఈ పీఆర్ స్టంట్లతోని ప్రజలను ఎక్కువ రోజులు కన్ ఫ్యూజ్ చేయలేరని కేటీఆర్ అన్నారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసని, మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా అన్నీ గమనిస్తారన్నారు.
కాంగ్రెస్ హామీలపై తిరుగుబాటు మొదలైంది
అసెంబ్లీ ఎన్నికల్లో 14సీట్లు స్వల్ప తేడాతో ఓడామని, లోక్ సభ ఎన్నికల్లో మోదీ కేంద్రంగా ఎన్డీఏ కూటమి వర్సెస్ ఇండియా కూటమిగా పోటీ జరుగడంతో ఏ కూటమిలోలేని పార్టీలకు ఏ రాష్ట్రంలోను విజయాలు దక్కలేదని కేటీఆర్ చెప్పారు. అందులో భాగంగా తెలంగాణలో బీఆరెస్‌కు సైతం ఎంపీ సీట్లు రాలేదన్నారు. దీనికి నిరాశ పడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ 420హామీలు, ఆరు గ్యారంటీలు, డిక్లరేషన్లతో ప్రజలు నమ్మించినప్పటికి పోలైన ఓట్లలో 4లక్షల ఓట్ల తేడాతోనే అధికారం కోల్పోయమని గుర్తు చేశారు.
తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో కరెంటు ఉంటే వార్త అయితే గతంలో కేసీఆర్ పాలనలో కరెంటు పోతే వార్తగా ఉండేదన్నారు. కరెంటు కోతలపై విద్యుత్తు అధికారులు ట్రాన్స్‌ఫార్మర్లపై తొండ పడిందని సాకులు చెబుతున్నారని, రాష్ట్రాన్ని ఉసరవెల్లులు నడిపితే తొండలు, ఉడతలే వస్తాయని వ్యంగ్యాస్త్రాలు వేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండానే 30వేల ఉద్యోగాలిచ్చామని ఊదరగొడుతున్నారన్నారి ఎద్దేవా చేశారు. 2లక్షల ఉద్యోగాలిస్తామని, జాబ్ క్యాలెండర్ అని మోసపూరిత హామీలిచ్చిన సంగతిని గ్రహించిన నిరుద్యోగులు తిరుగబడటం మొదలైందన్నారు.
బస్సుల్లో రికార్డింగ్ డ్యాన్స్‌లు పెట్టుకోండి
చివరకు రైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీ చేసినమని సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. రైతు రుణమాఫీ బోగస్ అని తెలిసే రాహుల్‌గాంధీ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని, ధాన్యంకు 500బోనస్ ఇస్తామని చెప్పి సన్నల ఇస్తామని మాట మార్చారన్నారు. మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని, ఇప్పటికే జరిగిన 2.50లక్షల పెళ్లిలకు అన్ని తులాల బంగారం బాకీ ఉందన్నారు. బస్సుల్లో మహిళలకు ఎల్లిపాయలు ఒలిస్తే, అల్లికలు చేస్తే తప్పా అని మంత్రి సీతక్క అన్నారని, రికార్డింగ్ డ్యాన్స్‌లను కూడా పెట్టుకోనీయండని మాకేం అభ్యంతరమన్నారు. బస్సుల్లో సీట్ల కోసం పంచాయతీ లేకుండా చూడాలన్నదే మా ఉద్దేశమన్నారు.
వృద్ధులకు 4వేల పింఛన్ ఇస్తామని చెప్పి 2వేలనే కొనసాగిస్తున్నారన్నారు.బీసీలకు 42శాతం ఇస్తామిన చెప్పి ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు పెడుతారన్నారు. ఇక కుటుంబ పాలన అని మాపై దుష్ప్రచారం చేశారని, సీఎం రేవంత్ రెడ్డి సోదరులు, బావమర్ధిలకు కాంట్రాక్టు ఒప్పందాలు ఎలా ఇస్తున్నారని, వారిది కుటుంబ పాలన కాదా అని ప్రశ్నించారు. ప్రజలకు అన్ని అర్ధమవుతాయని, కాంగ్రెసోళ్లు ఇచ్చిన హామీలను ఎండగట్టాలని, ఉప ఎన్నికలు వస్తాయని అప్పుడు వారి పరిస్థితి తేలుతుందన్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌కు కూడా ఉప ఎన్నిక వస్తుందని, తప్పకుండా రాజయ్య గెలుస్తారన్నారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు.
విదేశీ పెట్టుబడులపై రేవంత్‌రెడ్డి అబద్ధాలు
అసెంబ్లీలో బీఆరెస్ సభ్యులతో చర్చలను ఎదుర్కోలేని కాంగ్రెస్ మంత్రులు బయట అబద్ధాల ప్రచారం చేస్తు రాష్ట్రం అప్పుల పాలైందంటున్నారన్నారు. అప్పుల పాలైందని సీఎం రేవంత్ రెడ్డినే చెబుతుంటే పెట్టుబడులు ఎలా వస్తాయన్నారు. పాత గోడకు సున్నం కొట్టినట్లుగా రేవంత్‌రెడ్డి వీదేశ పెట్టుబడుల వ్యవహారం ఉందని, కాగ్నిజెంట్ కంపనీని మేం తేస్తే రేవంత్ రెడ్డి అది తానే చేసినట్లు తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించాడని ఎద్దేవా చేశారు. పరిపాలన చేతగాక కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటప్పుడు సర్ ఫ్లస్ స్టేట్‌గా ఎలా ఉందని ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీల అమలు వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు.
పార్టీకి మోసం చేసి కాంగ్రెస్‌లో చేరిన వారికి ప్రజలే బుద్ది చెబుతారన్నారు. బీజేపీ వాళ్లు అసెంబ్లీలో తలోదారిగా వ్యవహారించారని, కేంద్ర బడ్జెట్‌లో బీజేపీ తెలంగాణకు మొండి చేయి చూపిందని, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఆ పార్టీ నాయకులు పనిచేస్తున్నారన్నారు. కవిత 150రోజుల నుంచి జైల్లో ఉంటే అన్నగా బెయిల్ కోసం లాయర్లను కలిసేందుకు ఢిల్లీకి వెళితే బీజేపీలో బీఆరెస్ వీలీనం కోసం చీకటి ఒప్పందాలు చేసుకున్నారంటు దుష్ప్రాచారం చేస్తున్నారన్నారు. 24ఏళ్ల పార్టీ ఇంకో 50ఏండ్లు బలంగా ఉండేలా పార్టీని నడిపిస్తామన్నారు. త్వరలోనే బీఆరెస్ పార్టీ కేడర్‌కు ప్రజా ఉద్యమాల కార్యచరణ నిర్ధేశిస్తామన్నారు.