మొగోళ్ల‌కు మ‌హిళ‌ల‌కు తాకులాట పెట్టిన రేవంత్‌: కేటీఆర్‌

సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలో ఒక్కటి అమలు చేసి మొగోల్లకు మహిళకు తాకులాట పెట్టిండని బీఆరెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

మొగోళ్ల‌కు మ‌హిళ‌ల‌కు తాకులాట పెట్టిన రేవంత్‌: కేటీఆర్‌

అక్క‌ర‌కు రాని చుట్టాల‌కు ఓటెందుకు వేయాలి
అర‌చేతిలో వైకుంఠం చూపి గెలిచిన కాంగ్రెస్‌
నాకు రాజ‌కీయ జ‌న్మ‌నిచ్చింది సిరిసిల్ల‌నే
జోడిదొరికితే కేంద్రంపై పోరాడుతా
సిరిసిల్ల‌లో బీఆరెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

విధాత‌: సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలో ఒక్కటి అమలు చేసి మొగోల్లకు మహిళకు తాకులాట పెట్టిండని బీఆరెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమ‌వారం సిరిసిల్ల పట్టణంలో బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన ఆయ‌న‌ కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు అయ్యాయా చెప్పండని అడిగారు. మోచేతికి బెల్లం పెట్టి మోసపూరిత హామీలతో కాంగ్రెస్‌ గెలిచిందన్నారు. మీరు నన్ను ఇక్కడా గెలిపించిన కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి గెలిచిందన్నారు.

అబద్ధాలు చెప్పి డిజిటల్ ప్రపంచంలో ఒక్క నిమిషాల్లో దొరికిపోయారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పోయాకా అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను పట్టుకొని కాంగ్రెస్ పార్టీ నేత‌లు అనేక మాటలు, బూతులు మాట్లాడుతున్నారన్నారు. 100 రోజుల్లో రైతు రుణమాఫీ, ఫించన్లు వచ్చాయా అని ప్రశ్నించారు. ఓట్లు వేసుకునేటప్పుడు ఒక లెక్క ఓట్లు వేయించుకున్నాకా ఒక లెక్క అన్న‌ట్లుగా కాంగ్రెస్ పార్టీ తీరు ఉంద‌న్నారు. 3 వేల కోట్ల రూపాయల ఖర్చు చేసుకొని నేత‌ కార్మికులను కాపాడుకున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. 5 ఏళ్లలో ఒక్క రూపాయి కానీ, మందు కానీ పంచలేదన్నారు. త‌న‌కు రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్లనే అని కేటీఆర్ చెప్పారు. సిరిసిల్ల పట్టణం అతి సుందరంగా తీర్చిదిద్దుకున్నామ‌న్నారు.

రాముడు అందరివాడని అయితే మతం పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్నారని బీజేపీని విమ‌ర్శించారు. వేములవాడ రాజన్న, కొండగట్టు దేవాలయాలు బీజేపీ పుట్టక ముందు నుండే ఉండేవన్నారు. సిరిసిల్లలో అనేక అభివృద్ధి పనులు చేశాన‌ని, బీజేపీ ఒక్క పని చేసిందాఝ ఒక్క‌ శిలాఫలకం అన్న వేసిందా అని అడిగారు. ఏప‌ని చేయ‌ని వారికి ఎందుకు ఓటు వేయాలన్నారు. ముడి చమురు ధరలు తగ్గినా మోదీ పెట్రోలు, డీజిల్ రెట్లపై పన్నులు వేసి వసూలు చేశార‌న్నారు. మనకు ప్రధానమంత్రి కాదు పిరమైన ప్రధానమంత్రి అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అక్కరకురాని చుట్టాలకు ఓటు ఎందుకు వేయాల‌న్నారు. నాకు జోడిదారు దొరికితే రాష్ట్రం, కేంద్రంపై పోరాడే శక్తి వస్తుందని, అందుకే 13 తేదీన కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాల‌ని కోరారు.