KTR | మాటల్లో సబ్‌కా సాత్ సబ్ కా వికాస్ నినాదం.. చేతల్లో తెలంగాణకు మోదీ మొండిచేయి: కేటీఆర్
సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అంటూనే అందులో తెలంగాణను మాత్రం ప్రధాని మోదీ దూరం పెడుతున్నారన్నారని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు

బీజేపీకి 8 సీట్లు ఇచ్చింది రాష్ట్రంపై వివక్షత చూపేందుకేనా
మెట్రో ప్రాజెక్టులకు కేటాయింపుల్లో అన్యాయంపై కేటీఆర్ నిలదీత
విధాత, హైదరాబాద్: సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అంటూనే అందులో తెలంగాణను మాత్రం ప్రధాని మోదీ దూరం పెడుతున్నారన్నారని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ట్విటర్ వేదికగా తెలంగాణకు మెట్రో రైల్ ప్రాజెక్టులో కేంద్రం వివక్షతను ఎండగట్టారు. తెలంగాణపై ప్రధాని మోదీ మొదటి నుంచే మనసులో ద్వేషం నింపుకున్నారని తెలంగాణకు నిధులు మంజూరు చేయాలని ఎన్నిసార్లు అడిగినప్పటికీ ఆయన పట్టించుకోలేదని చెప్పారు. ఇతర రాష్ట్రాలపై మాత్రం ఎనలేని ప్రేమ చూపుతున్నారని దుయ్యబట్టారు. మొన్నటి కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు చేసిన అన్యాయం అంత ఇంత కాదని విమర్శించారు. హైదరాబాద్ మెట్రో కోసం నిధులు మంజూరు చేయాలని ఎన్నిసార్లు కోరినప్పటికీ పెడచెవిన పెట్టారని మండిపడ్డారు.
తాజాగా ప్రకటించిన బడ్జెట్‌లోనూ మళ్లీ హైదరాబాద్ మెట్రోకు మొండి చెయ్యే చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ మోదీ తన తెలంగాణ వ్యతిరేకత ఎన్నోసార్లు బయటపెట్టుకున్నారని చెప్పారు. అదే ద్వేషాన్ని మన రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇచ్చే విషయంలోనూ చూపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశంతో గెలిచే పార్టీ ఎంపీలు ఉంటే మన రాష్ట్రం అభివృద్ధి అవుతుందని భావించిన తెలంగాణ ప్రజలు ఈ సారి బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చారని గుర్తుచేశారు. కానీ ఏం ప్రయోజనం అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Telangana has been blessing the BJP with MP seats, but at what cost?
Despite giving 8 MPs to the BJP from Telangana during its tough times, the BJP-led NDA government hasn’t sanctioned a penny for the Hyderabad Metro Rail expansion even in the latest budget
We had made several… pic.twitter.com/U2SezqmBvT
— KTR (@KTRBRS) July 27, 2024
గతంలో కన్నా కూడా మనకు నిధుల్లో కోతలు పెట్టారన్నారు. మరి తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీకి 8 సీట్లు ఇచ్చింది రాష్ట్రంపై ఇలా వివక్షను మరింత చూపేందుకేనా అని ప్రశ్నించారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ మెట్రోకు ఎన్నోసార్లు నిధులు కావాలని అడిగితే పట్టించుకోలేదని గుర్తుచేశారు.గత పదేండ్లలో దేశంలోని 20 మెట్రో ప్రాజెక్టుల కోసం మోదీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు భారీగానే నిధులు కేటాయించింది. కానీ తెలంగాణకు మాత్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ మెట్రో విషయంలో జరిగిన అన్యాయాన్ని మోదీకి వివరించి రాష్ట్ర బీజేపీ ఎంపీలు నిధులు తేవాలని డిమాండ్ చేశారు.
ఇదే కేంద్రం హైదరాబాద్ మెట్రోను విస్మరిస్తూ మిగతా రాష్ట్రాల్లో మెట్రో ప్రాజెక్టులకు మాత్రం భారీగా నిధులు కేటాయిస్తుందని లెక్కలతో సహా కేటీఆర్ వివరించారు. ఉత్తర ప్రదేశ్ (4 ప్రాజెక్టులు)- రూ.5,134.99 కోట్లు,మహారాష్ట్ర (3 ప్రాజెక్టులు)- రూ.4,109 కోట్లు, గుజరాత్ (3 ప్రాజెక్టులు)- రూ.3,777.85 కోట్లు, ఢిల్లీ (2 ప్రాజెక్టులు) -రూ.3,520.52 కోట్లు, కర్ణాటక-రూ.1880.14 కోట్లు, మధ్యప్రదేశ్ (2 ప్రాజెక్టులు)- రూ.1,638.02 కోట్లు, బీహార్- రూ.1,400.75 కోట్లు, తమిళనాడు- రూ.713 కోట్లు, కేరళ (2 ప్రాజెక్టులు)- రూ.146.74 కోట్లు, ఢిల్లీ-ఘజియాబాద్ రాపిడ్ రైల్ ప్రాజెక్టుకు- రూ.1,106.65 కోట్లు ఇచ్చిందని వెల్లడించారు.