KTR | ఇటు విద్యావంతుడు.. అటు బ్లాక్ మెయిలర్‌: కేటీఆర్‌

వ‌రంగ‌ల్-నల్లగొండ-ఖమ్మం ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ల్లో ఇటు విద్యావంతుడు.. అటు బ్లాక్ మెయిలర్‌ పోటీ చేస్తున్నాడని, పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని బీఆరెస్‌ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు

KTR | ఇటు విద్యావంతుడు.. అటు బ్లాక్ మెయిలర్‌: కేటీఆర్‌

ఆలోచించి ఓటు వేయండి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారంలో కేటీఆర్‌
హామీలపై కాంగ్రెస్ కప్పదాట్లు
నాట్లప్పుడు వేయాల్సిన రైతుబంధు కోతలప్పుడు వేస్తున్నారు
సోషల్ మీడియా దుష్ప్రచారంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి

విధాత: వ‌రంగ‌ల్-నల్లగొండ-ఖమ్మం ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ల్లో బీఆరెస్‌ త‌ర‌పున ఓ విద్యావంతుడు పోటీ చేస్తున్నాడని, కాంగ్రెస్ త‌ర‌పున ఓ బ్లాక్ మెయిల‌ర్ పోటీ చేస్తున్నాడని, పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని బీఆరెస్‌ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. సోమవారం ఖమ్మం జిల్లా పరిధిలో బీఆరెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎనుగుల రాకేశ్‌రెడ్డి తరుపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీఆరెస్‌ అభ్య‌ర్థి రాకేశ్ రెడ్డి సామ‌న్య రైతు కుటంబంలో జ‌న్మించి బిట్స్ పిలానీలో సీటు సాధించి ఇంజినీరింగ్‌తో పాటు ఎంఎస్ చేసి గోల్డ్ మెడ‌ల్ సాధించాడని, ఆ త‌ర్వాత అమెరికాలో ఏడేండ్ల పాటు ఐటీ ఉద్యోగం చేశాడని, ల‌క్ష‌ల కోట్లు సంపాదించిన సంతృప్తి చెందకుండా ప్ర‌జా జీవితంలోకి వ‌చ్చిన విద్యావంతుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే లక్ష్యంతో ముందుకెలుతున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఓ బ్లాక్ మెయిల‌ర్‌ను నిల‌బెట్టిందన్నారు. ఆయ‌న‌పై 56 కేసులు ఉన్నాయని, అవి కూడా స్వాతంత్ర్య ఉద్య‌మంలో, తెలంగాణ ఉద్య‌మంలో న‌మోదైన కేసులు కావని, జ‌నాల‌ను తిట్టి, బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి, మ‌హిళ‌ల‌ల గౌర‌వానికి భంగం క‌లిగించినందుకు 56 కేసులు న‌మోదు అయ్యాయని, అందుకే ఓటేసే ముందు అభ్య‌ర్థుల గుణ‌గ‌ణాల‌ను ప‌రిశీలించి ఓటేయాల‌ని కోరుతున్నాని కేటీఆర్ తెలిపారు.మొద‌టి ఏడాదిలోపే 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తాన‌ని రేవంత్ హామీ ఇచ్చిండని, ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క నోటిఫికేష‌న్ కూడా కొత్త‌గా ఇవ్వ‌కపోగా, బీఆరెస్ నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించి మేం 30 వేల ఉద్యోగాలు ఇచ్చామంటున్నాడని ఎద్దేవా చేశారు. ఈ సీఎంకు బ‌ద్ది చెప్పాలంటే, 2 ల‌క్ష‌ల ఉద్యోగాల హామీ నెర‌వేరాలంటే, ఆ ఒత్తిడి ఉండాలంటే ద‌మ్మున్న‌ రాకేశ్ రెడ్డిని గెలిపిస్తే శాస‌న‌మండ‌లిలో ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తాడ‌ని కేటీఆర్ తెలిపారు.

సోషల్ మీడియా దుష్ప్రచారంతోనే ఓటమి

బీఆరెస్‌ పాల‌న‌లో ప్ర‌భుత్వ రంగంలో 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చామని, ప్ర‌యివేటు రంగంలో 24 ల‌క్ష‌ల మందికి ఉపాధి క‌ల్పించామని, అయిన‌ప్ప‌టికీ నిరుద్యోగుల‌కు, యువ‌త‌కు దూరం అయ్యామ‌ని, ఇందుకు సోషల్ మీడియా సాగించిన దుష్ప్రచారమే కారణమన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్‌కు 39 సీట్లు వ‌చ్చాయని, 1.8 శాతం ఓట్ల‌ తేడాతో ఓడిపోయామని, 15 సీట్ల‌లో ఐదారు వేల ఓట్ల తేడాతో ఓడిపోయామని, ఈ ప‌దిహేనులో 7 నుంచి 10 గెలిచినా ప్ర‌భుత్వం వ‌చ్చేదని కేటీఆర్ తెలిపారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఫీజుల్లేకుండా ప్ర‌భుత్వ ఉద్యోగాల ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తామ‌ని చెప్పారని, కేసీఆర్ హ‌యాంలో టెట్‌కు ద‌ర‌ఖాస్తు ఫీజు రూ. 400 పెడితే.. ఇదే రేవంత్ నానా యాగీ చేసిండని, ఇవాళ టెట్ ప‌రీక్ష‌కు వెయ్యి పెట్టిండన్నారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలంటే బీఆరెస్‌ను గెలిపించాలన్నారు. సింగ‌రేణిలో 24 వేల వార‌స‌త్వ ఉద్యోగాలు మేం ఇచ్చామని, సింగ‌రేణిని అదానీకి అమ్మేందుకు రేవంత్ సిద్ధంగా ఉన్నాడని, ఇదే విష‌యంపై మోదీతో రేవంత్ కూడ‌బ‌లుక్కున్నాడని ఆరోపించారు. చివ‌ర‌కు సింగ‌రేణిని కూడా ప్ర‌యివేటుప‌రం చేస్తారని కేటీఆర్ పేర్కొన్నారు.

హామీలపై కాంగ్రెస్ కప్పదాట్లు

మొద‌టి కేబినెట్ స‌మావేశంలో మెగా డీఎస్సీ వేస్తామ‌న్న హామీ కూడా నెర‌వేర‌లేదని కేటీఆర్ విమర్శించారు. నాకు ఒక్క అవ‌కాశం ఇస్తే డిసెంబ‌ర్ 9న 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేస్తాన‌ని రేవంత్ అన్నాడని, జూన్ 9 వ‌స్తుంది.. ఆరు నెల‌లు గ‌డిచిపోయిందని కానీ రుణ‌మాఫీ కాలేదని దుయ్యబట్టారు. బీఆరెస్‌ ప్ర‌భుత్వంలో నాట్ల‌ప్పుడు కేసీఆర్ రైతుబంధు వేస్తే.. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఓట్ల‌ప్పుడు రేవంత్ రెడ్డి రైతుబంధు వేశార‌ని, నాట్ల‌ప్పుడు రైతుబంధు వేస్తే లాభం.. కోత‌ల‌ప్పుడు వేస్తే ఏం లాభం అని రేవంత్ స‌ర్కార్‌ను కేటీఆర్ నిల‌దీశారు . ఐదారు నెల‌ల కింద‌ట కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల‌ని ఊద‌ర‌గొట్టిందని, మొత్తానికి అర‌చేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వ‌చ్చిందని, అధికారం కోల్పోయినందుకు మాకు బాధ‌లేదని, అధికారం శాశ్వ‌తం కాదని, మార్పు అని ఓటేసిన పాపానికి జనం గోస పడుతున్నారన్నారు.

కేసీఆర్ నాయ‌క‌త్వంలో 33 మెడిక‌ల్, న‌ర్సింగ్ కాలేజీలు

మ‌హ‌బూబాబాద్ జిల్లాను చేయ‌డ‌మే కాకుండా మెడిక‌ల్ కాలేజీ, న‌ర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. కొత్త‌గూడెంలో కూడా మెడిక‌ల్, న‌ర్సింగ్ కాలేజీ, ఖ‌మ్మంలో మెడిక‌ల్ కాలేజీ ఏర్పాటు చేసిన ఘ‌న‌త కేసీఆర్‌దేనన్నారు. 65 ఏండ్ల‌లో తెలంగాణ‌లో ఏర్పాటైంది 3 మెడిక‌ల్ కాలేజీలు మాత్ర‌మేనని, తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత కేసీఆర్ నాయ‌క‌త్వంలో 33 మెడిక‌ల్, న‌ర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.