KTR | మోసాల కాంగ్రెస్‌కు గ్రాడ్యుయేట్లు బుద్ధి చెప్పాలి: కేటీఆర్
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థిని గెలిపించాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు

విద్యావంతుడిని ఎమ్మెల్సీగా ఎన్నుకోండి
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
విధాత: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థిని గెలిపించాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. శుక్రవారం వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో బీఆరెస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని నకిరేకల్‌లో పట్టభద్రుల సమావేశంలో కేటీఆర్ ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోసపోతే గోస పడుతాం అని చెప్పామని, ఇవ్వాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. రైతు రుణమాఫీ అని చెప్పి సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి మోసం చేసిండని, ధాన్యం బోనస్ విషయంలో కూడా మాట తప్పిండని, సన్న వడ్లకు మాత్రమే బోనస్ అంటూ అన్ని బోగస్ మాటలు మాట్లాడుతున్నాడని కేటీఆర్ విమర్శించారు. ఆరు గ్యారంటీలతో అభూతకల్పనలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇన్ని అబద్ధాలు ఆడుతున్న కాంగ్రెస్ పార్టీకి గ్రాడ్యుయేట్లు సరైన బుద్ధి చెప్పాలన్నారు.
కాంగ్రెస్ పాలనలో విద్యుత్తు కూడా సరిగా ఇవ్వడం లేదని, మన ప్రాజెక్టులు కేంద్రంకు అప్పగించి మన నది జలాల హక్కులను అన్యాక్రాంతం చేశారని విమర్శించారు. రైతులకు పంటల సాగుకు పెట్టుబడులు అవసరమైన సమయంలో కాకుండా ఓట్లు ఉంటేనే సీఎం రేవంత్‌రెడ్డి రైతుబంధు వేస్తున్నాడని ఆరోపించారు. మహిళలకు 2,500 ఇస్తా అని మోసం చేసిండని, హామీల అమలులో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా నిర్లజ్జగా అబద్ధాలు ఆడుతున్నారని, దేవుళ్ళ మీద ఓట్లు వేస్తూ రేవంత్ రెడ్డి పూటకో అబద్ధం అడుతున్నాడని ఎద్దేవా చేశారు.
నోటిఫికేషన్లు ఇవ్వకుండా, జాబ్ లు ఇచ్చినమని సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు అడుతున్నాడని, 30వేల ఉద్యోగాలు కేసీఆర్ హయాంలో రిక్రూట్మెంట్ చేస్తే వాటికి కాగితాలు పంచుతూ అబద్ధాలు అడుతున్నాడని దుయ్యబట్టారు. జీవో 46ను రద్దు చేసేందుకు మా ప్రభుత్వంలో అన్ని సిద్ధం చేశామని, దురదృష్టవశాత్తు అప్పటికే ఎన్నికల కోడ్ వచ్చిందని, ఇప్పుడు ఆ జీవోని రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తామని కేటీఆర్ తెలిపారు.
గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విద్యావంతులు విచక్షణతో ఓటయ్యాలని, బీఆరెస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి గొప్ప విద్యావంతుడని, అతనికి ఓటేస్తే ప్రభుత్వంపై కొట్లాడుతాడని, ఈ ఎన్నికల్లో బీఆరెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇక కాంగ్రెస్ అభ్యర్ధి పచ్చి బ్లాక్ మెయిలర్ అని కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. అతను అబద్ధాలు ఆడే వ్యక్తి..56 క్రిమినల్ కేసులు అతనిపై ఉన్నాయని, అమ్మాయిలు పెట్టిన కేసులే పది దాకా ఉన్నాయని, అతనివి చేసేవి అన్ని లంగా పనులేనని, అతన్నిచట్టసభల్లోకి రానివ్వొద్దని, గ్రాడ్యుయేట్లు అటువంటి వారికి బుద్ధి చెప్పాలని కేటీఆర్ కోరారు.