BRS | తప్పు మీదో మాదో.. తేల్చాల్సిందే: కేటీఆర్‌

సుంకిశాల తాగునీటి సరఫరా పథకం రిటైనింగ్ వాల్ కూలిన ఘటనలో తప్పు మీదో మాదో తేల్చేందుకు ప్రాజెక్టు పరిశీలనకు వెలుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అక్కడే జ్యుడిషియల్ విచారణ కమిటీ ప్రకటించాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు

BRS | తప్పు మీదో మాదో.. తేల్చాల్సిందే: కేటీఆర్‌

సుంకిశాల పై జ్యుడిషియల్‌ కమిటీ వేయండి
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌
ప్రమాద ఘటనను ప్రభుత్వం ఎందుకు తొక్కిపెట్టిందన్న ప్రశ్న
పాలన చేతగాక మాపై నిందలంటూ ఫైర్‌
సుంకిశాల ప్రమాదం కాంగ్రెస్, సీఎం రేవంత్‌రెడ్డి వైఫల్యమే
కాళేశ్వరం కుంగితే వచ్చిన ఎన్డీఎస్‌ఏ ఇప్పుడెక్కడ ?
ఇది కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయమే
మేమూ సుంకిశాలకు వెళ్లి ప్రజలకు వాస్తవాలు వివరిస్తాం

విధాత, హైదరాబాద్ : సుంకిశాల తాగునీటి సరఫరా పథకం రిటైనింగ్ వాల్ కూలిన ఘటనలో తప్పు మీదో మాదో తేల్చేందుకు ప్రాజెక్టు పరిశీలనకు వెలుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అక్కడే జ్యుడిషియల్ విచారణ కమిటీ ప్రకటించాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సుంకిశాల ప్రమాదానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించకుండా వారి వైఫల్యాన్ని గత బీఆరెస్ ప్రభుత్వంపై నెట్టి నిందలు మోపే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సుంకిశాల ప్రమాదానికి పూర్తి బాధ్యత పురపాలక శాఖ నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం తప్పు లేకుంటే ఎందుకు వారం రోజులపాటు దాచి ఉంచిందని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలు జరగుతున్న సమయంలో ఆగస్ట్ 2 న ఈ ప్రమాదం జరిగిందని, ఈ విషయాన్ని ప్రభుత్వం సమావేశాల్లో స్టేట్ మెంట్ చేయలేదని, అంటే ప్రభుత్వానికి ఈ ప్రమాదం జరిగిన విషయం తెలియాదా? తెలిసి పట్టించుకోలేదా అని ప్రశ్నించారు. ఒక వేళ ప్రభుత్వానికి ఈ విషయమే తెలియదంటే మాత్రం ఇది సిగ్గుచేటన్నారు. పక్కా ఈ ప్రమాద సమాచారం సీఎం రేవంత్‌రెడ్డికి తెలుసన్నారు.

ఒక వేళ ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలియకపోతే ముఖ్యమంత్రిగా పరిపాలన మీద ఆయనకు ఎంత పట్టు ఉన్నట్లని ఎద్దేవా చేశారు. మీరు ఆగమాగం పనులు ప్రారంభించటంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులే చెబుతున్నారని కేటీఆర్ పేర్కోన్నారు. అధికారులు చెప్పినా కూడా వినకుండా గేట్లు అమర్చటంతో ఈ ప్రమాదం జరిగిందని, అదృష్టవశాత్తు కూలీలు షిఫ్ట్ మారినప్పుడు ప్రమాదం జరిగిందని, లేకుంటే చాలా ప్రాణనష్టం జరిగేదన్నారు. మంచి జరిగితే మాది… చెడు జరిగితే బీఆరెస్‌ మీద తప్పుడు ప్రచారం చేసే చిల్లర ప్రయత్నాలు వద్దని హితవు పలికారు. సుంకిశాల ప్రమాదం కాంగ్రెస్ వైఫల్యం, రేవంత్ రెడ్డి గారి వైఫల్యమేనని, అందుకే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పరిపాలన రాక ప్రతి దానికి కేసీఆర్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని, హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, వాళ్ల బాకా ఊదే పత్రికలే లా అండ్ ఆర్డర్ మీద కథనాలు రాస్తున్నాయని, పేర్లు మార్చటమేనా మార్పు అంటే అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం భట్టి తన ఆలోచన విధానాన్ని మార్చాలన్నారు. మేము కూడా సుంకిశాలకు వెళ్లి మొత్తం వివరాలను అక్కడ నుంచి ప్రజలకు వివరిస్తామని కేటీఆర్ ప్రకటించారు.

కాళేశ్వరంపై వచ్చిన ఎన్డీఎస్‌ఏ ఇప్పుడెందుకు రాదు

కాళేశ్వరంలో చిన్న కుంగుబాటు జరిగితే జ్యుడిషియల్ విచారణ చేపట్టారని, ఢిల్లీ నుంచి ఎన్డీఎస్ఏ వచ్చి ఆగమేఘాల మీద రిపోర్ట్ ఇచ్చారని, మరి సుంకిశాల కూలిపోతే ఎందుకు కేంద్ర సంస్థ ఎన్డీఎస్‌ఐ వస్తలేదని, ఇది కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అని అనుకోవాలని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకిశాల ప్రాజెక్టులో ఇంజనీరింగ్ లోపం లేదని, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానంలోనే లోపం ఉన్నదన్నరు. కాంగ్రెస్‌ పార్టీ దివాలా కోరు విధానం తప్ప ఇప్పటిదాకా తీసుకొచ్చిన విధానాలు ఏంటిదో చెప్పాలన్నారు. మేడిగడ్డలో జరిగిన సంఘటనను మేము దాచిపెట్టలేదని, ఎన్నికల కోడ్ ఉన్న సరే ప్రమాదం జరిగిన విషయాన్ని చెప్పామని, ఘటన జరిగిన గంటల్లోనే మేము లోపాలు సర్దుతామని ఎల్‌ఆండ్‌టీ చెప్పిందని, మాకు సీక్రెసీ మెయింటెన్ చేయాల్సిన అవసరం లేదన్నారు.

కానీ సుంకిశాల ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు విషయాన్ని దాచారని, ఈ ప్రమాదం జరిగినప్పుడు హైదరాబాద్ లోనే సీఎం ఉన్నారని, ఆ మరునాడే దాని మీద పర్యవేక్షణ లేకుండా అమెరికా వెళ్లారన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సుంకిశాల నిర్మాణ కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్ పెట్టి…బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సుంకిశాల ప్రమాదానికి కారణమైన కాంగ్రెస్ వైఖరితోనే రాష్ట్ర సొమ్ము వృధా అయ్యిందని, దీనిపై నెపాన్ని బీఆరెస్‌పై నెట్టి డిప్యూటీ సీఎం భట్టి తప్పుడు ప్రచారాలు చేయవద్దన్నారు.

జంటనగరాల తాగునీటి అవసరాలకే సుంకిశాల అవసరం

మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలోనే సుంకిశాల కోసం ప్రతిపాదన చేశారని, అప్పట్లో మాకు అన్యాయం చేయవద్దంటూ రైతులు అడ్డుకోవటంతో కాల్పుల్లో అక్కడ ఒక సబ్ ఇన్ స్పెక్టర్ కూడా చనిపోయారని కేటీఆర్ తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో రెండు, మూడు దశలు అంటూ ప్రభుత్వం ప్రతిపాదన తెచ్చారని, కానీ రైతులు మళ్లీ అడ్డుకోవటంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలిపారు. ఆ తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఏక బిగిన సాగునీటి ప్రాజెక్ట్ లు చేపట్టారని, రైతుల్లో విశ్వాసం నింపటంతో సుంకిశాలను రైతులు అడ్డుకోలేదన్నారు. ఏఎమ్మార్పీ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు ఎత్తిపోయాలంటే సాగర్‌లో 510 అడుగుల నీళ్లు ఉంటేనే నీళ్లు తీసుకోవటం సాధ్యమవుతుందని, సుంకిశాలలో మాత్రం 462 అడుగులు ఉన్నా సరే నీళ్లు తీసుకోవచ్చన్నారు.

రాబోయే 50 ఏళ్లలో హైదరాబాద్ నీటి అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ ను కేసీఆర్ చేపట్టారని గుర్తు చేశారు. నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రజా ప్రతినిధులంతా కలిసి మేము అప్పుడు దీన్ని శంకుస్థాపన చేశామని, శరవేగంగా ప్రాజెక్ట్ కు ముందుకు తీసుకెళ్లామని, మూడు పైప్ లైన్ల ద్వారా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందని, కృష్ణానదికి మూడు, నాలుగేళ్లు వరద రాకపోయిన డెడ్ స్టోరేజ్ నుంచి సుంకిశాల ద్వారా నీళ్లు తీసుకోవచ్చని తెలిపారు. ఓఆర్ఆర్ చుట్టు ఒక వాటర్ రింగ్ మెయిన్ చేయాలనే ఉద్దేశంతో గోదావరి, కృష్ణా నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం కేసీఆర్ చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ విషయాలు ఏమీ తెలియవని, ఢిల్లీ, బెంగళూరు లాంటి చాలా నగరాల్లో భారీగా కొరత ఉందని, దేశ రాజధాని ఢిల్లీలో నీటి కోసం యుద్దాలు జరుగుతున్నాయని, హైదరాబాద్ లో మాత్రం ఆ పరిస్థితి లేదని గుర్తు చేశారు.

హైదరాబాద్ కు తాగు నీటి కరువు ఉండకుండా చేసేందుకే ఈ ప్రాజెక్ట్ చేపట్టామని, సుంకిశాలను చాలా వేగంగా పనులు పూర్తి చేశామని, ఒక్క మోటార్ ఫిట్టింగ్ పనులు మాత్రమే మిగిలాయని, 2024 సమ్మర్ నాటికి పూర్తి చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మొత్తం పనులను పెండింగ్ పెట్టారని కేటీఆర్ ఆరోపించారు. పురపాలక శాఖలో మొత్తం పనులను పడకేశాయని, సుంకిశాల పనులను పక్కన పెట్టారని, మొన్నటి ఎండకాలంలో హైదరాబాద్‌కు ట్యాంకర్లు రావటంతో ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు వచ్చాయని, సీఎంపై కూడా విమర్శలు రావటంతో రెండు, మూడు నెలల కిత్రం దున్నపోతు నిద్ర వీడారని, ఆ తర్వాత అధికారులను ఒత్తిడి పెట్టి ఆగమాగం పనులు చేపట్టారని ఆరోపించారు. ఈ ప్రమాదం ఎందుకు జరిగిందని జలమండలి అధికారితో వివరంగా మాట్లాడి సమాచారం తెలుసుకున్నానని కేటీఆర్ వెల్లడించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను కూడా స్పీడ్ గానే చేశామని, సాగునీరు, తాగునీరు రెండింటికి ప్రాధాన్యం ఇచ్చాం కనుకే రైతులు ఆందోళన చేయలేదన్నారు.

ఎన్నికల్లో ప్రయోజనం కోసమే కాళేశ్వరంపై దుష్ప్రచారం

ఎన్నికల్లో ప్రయోజనం కోసం కాళేశ్వరంపైన కాంగ్రెస్ పార్టీ ఆనాడు తప్పుడు ప్రచారం చేసిందని, మేడిగడ్డ మీద విచారణ చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. తాజాగా 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన ప్రాజెక్టు చెక్కుచెదరకుండా ఉన్నదని, ఇన్నాళ్లు కాళేశ్వరంపై చిల్లర, దివాళాకోరు ప్రచారాలు చేస్తే ప్రకృతే వీళ్ల తప్పుడు ప్రచారాలకు సమాధానం చెప్పిందని కేటీఆర్ అన్నారు. వీళ్లకు ఇరిగేషన్ ప్రాజెక్టులపై సరుకు లేదు, సబ్జెక్ట్ లేదని, వీళ్లకు బ్యారేజ్ గేట్లు ఎప్పుడు దించుతారో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోయటానికి ఎలాంటి ఇబ్బంది లేదని, ఇంత మంచి ప్రాజెక్ట్ ను తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇంజనీర్లే ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.

కాళేశ్వరం ఫెయిల్ అయితే అన్ని రిజర్వాయర్లకు నీళ్లు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. నీళ్ల విషయంలో కేసీఆర్ కు పేరు వస్తదనే కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం విఫలమైతే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా రిజర్వాయర్లను పంపించేసి నీళ్లు నింపుతుందని, నీళ్ల విషయంలో కేసీఆర్ విజయాలను అంగీకరించలేని కురచ మనస్తత్వంతోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదన్నారు. సీతారామా ప్రాజెక్ట్ గురించి డిప్యూటీ సీఎం భటిట్ బిల్డప్ ఇచ్చారని, కానీ ఆ ప్రాజెక్ట్ ను చేపట్టింది, పూర్తి చేసింది కూడా కేసీఆర్ అన్న విషయం మరువరాదన్నారు.