Komati Reddy Venkat Reddy | నేను అమెరికా వెళుతున్నా.. తిరిగి వచ్చేలోగా బీఆర్ఎస్ ఆఫీస్ ను నేలమట్టం చేయాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాలు
నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేతపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. నేను అమెరికాకు వెళ్తున్నానని, ఆగస్టు 11న తిరిగి వస్తానని, వచ్చేలోపు అనుమతి లేకుండా

విధాత, హైదరాబాద్ : నల్లగొండ పార్టీ కార్యాలయం కూల్చివేతపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. నేను అమెరికాకు వెళ్తున్నానని, ఆగస్టు 11న తిరిగి వస్తానని, వచ్చేలోపు అనుమతి లేకుండా నిర్మించబడిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నేలమట్టం కావాలని, లేకపోతే అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్థానిక మంత్రి వెంకటరెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు. శనివారం నల్లగొండ పట్టణంలో మున్సిపల్ అదనపు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి విచ్చేసిన సందర్భంగా మంత్రి అధికారులకు ఈ ఆదేశాలిచ్చారు. మంత్రి ఆదేశాల మేరకు వారం రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేయనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే మంత్రి వెంకట్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తర్వాతా కూడా అనుమతులు లేని, ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించబడిన బీఆరెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేస్తామని పలుమార్లు ప్రకటించారు. అక్రమ నిర్మాణాన్ని తొలగించాల్సిన బాధ్యత అధికారులదేనని ఇప్పటికే పలుమార్లు అధికారులకు వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. పట్టణం మధ్యలో ఉన్న ప్రభుత్వ శాఖ భవనాన్ని కూల్చి, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి, సరైన అనుమతులు లేకుండా బీఆర్ఎస్ భవనం నిర్మించారని మొదటి నుంచి కూడా ఆరోపణలున్నాయి. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆనాటి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, జిల్లా మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డిల నిర్ణయాలను అధికారులు ప్రశ్నించలేకపోయారు. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని తప్పుబడుతున్న వెంకట్‌రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పార్టీ కార్యాలయ భవనాన్ని కూల్చివేస్తామని చెప్పినట్లుగానే అందుకు ఆదేశాలివ్వడం విశేషం. కాగా మంత్రి ఆదేశాలతో బీఆర్ఎస్ భవనం కూల్చివేతకు అధికారులు సిద్ధిపడిన పక్షంలో బీఆర్ఎస్ శ్రేణులు దీనిని అడ్డుకునేందుకు సిద్ధపడనుండగా, ఈ వ్యవహారం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.