కాంగ్రెస్ నాటి నుంచి నేటి దాకా తెలంగాణకు శత్రువే: సీఎం కేసీఆర్
బోధన్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు

బోధన్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. మూడోసారి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నాం. ఈ దేశంలో ఇంకా కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సిన పరిణితి రాలేదు. ఇంకా కూడా కులం, మతం పేరిట కొట్లాటలు, పంచాయితీలు, ఝూటా వాగ్దానాలు, ఆరోపణలు, అభాండాలు.. ఒక పిచ్చిపిచ్చిగా గడబిడి జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సిన పరిణితి రాకపోవడం. ఏయే దేశాల్లో ప్రజాస్వామ్య ప్రక్రియ పరిణితి చెందిందో ఆ దేశాలు అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నాయి. మనం కూడా అలా బాగుపడాల్సిన అవసరం ఉంది.
ప్రతి ఎన్నికలో ప్రతి పార్టీకో మనిషి నిలబడుతారు. బీఆర్ఎస్ తరపున షకీల్ బాయ్ నిలబడ్డాడు. కాంగ్రెస్ తరపున ఒకాయన నిలబడ్డాడు. బీజేపీకి కూడా ఒకరు ఉంటారు. ఇండిపెండెంట్ ఒకరిద్దరు ఉండొచ్చు. ఈ అభ్యర్థుల గురించి ఆలోచన చేయాలి. మంచి చెడ్డవారు ఎవరు అని ఆలోచన చేయాలి. అభ్యర్థుల వెనుక ఉండే పార్టీల గురించి ఆలోచన చేయాలి. ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిస్తే అక్కడ ఆ గవర్నమెంట్ ఏర్పడతుంది. మంచి గవర్నమెంట్ రాకపోతే ఐదేండ్లు ఏం చేయలేం. లేనిపోని ఇబ్బందులు వస్తాయి. ఏ పార్టీకి అధికారం ఇస్తే ప్రజల గురించి ఆలోచించారని ఆలోచించి ఓటేయాలి. ప్రజలు గెలవనంత వరకు దేశం అనుకున్నంత ముందుకు పోదు.
బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కులు, నీళ్లు, నిధుల కోసం. కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు అధికారంలో ఉంది. మరి పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో, 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో ఆలోచించాలి. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందేవరు..? తెలంగాణ మనది మనకు ఉండే. మంచి పంటలతోని, నిజాం రాజులు, కాకతీయ రాజులు కట్టించిన ప్రాజెక్టులు, చెరువులతో చాలా బాగుండే. తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఏపీలో కలిపితే ఆ చిన్న తప్పుకు 58 ఏండ్లు కొట్లాడాల్సి వచ్చింది. 1969లో 400 మందిని కాల్చేశారు. నేను ఉద్యమం మొదలుపెడితే మీరంతా కలిసివచ్చారు. బోధన్‌లో నెలల తరబడి నిరాహార దీక్షలు జరిగాయి.
దుర్మార్గమైన కాంగ్రెస్ నాటి నుంచి నేటి దాకా తెలంగాణకు శత్రువే. 2004లో పొత్తు పెట్టుకుంటామని వచ్చారు. తెలంగాణ ఇస్తారని నమ్మి పొత్తు పెట్టుకున్నాం. 2004లో గెలిస్తే 2005, 2006లో తెలంగాణ ఇవ్వలేదు. 15 ఏండ్లు ఏడిపించారు. మోసం చేసే ప్రతయ్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీని చీల్చి ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారు. ఉద్యమాన్ని మొత్తం ఆగం పట్టించి మరోసారి ద్రోహం చేసే పరిస్థితి చేశారు. 15 ఏండ్డు ఏడిపించి, వందల మందిని పొట్టను పెట్టుకుని తెలంగాణ ఇచ్చారు. పదేండ్ల నుంచి బీఆర్ఎస్ ఏం చేస్తుందో మీరు చూస్తున్నారు. నిజాం సాగర్ నిజాం రాజు కట్టిన ప్రాజెక్టు ఇది.
1934లో మొదలు పెట్టి కట్టారు. బాన్సువాడ, బోధన్, ఆర్మూర్ వరకు నీళ్లు పారి డిచ్‌పల్లి వరకు సస్యశ్యామలంగా ఉండే. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్ జిల్లా ఏందంటే లక్ష్మీ ఉండే జిల్లా నిజామాబాద్ అని పేరుండే. నిజంగానే లక్ష్మీ దేవి ఉండే. కానీ సమైక్య రాష్ట్రంలో మాయమైంది. నిజాంసాగర్‌ను ఎండబెట్టి.. మీద కట్టిన సింగూరు ప్రాజెక్టును హైదరాబాద్‌కు గంపగుత్తగా మంచి నీళ్ల కోసం ఇచ్చి పంటలు ఎండబెట్టారు. రైతులు బాధపడ్డారు. మీరు ప్రత్యక్షంగా అనుభవించారు. సింగూరు నుంచి నీళ్లు రావాలని నిజామాబాద్ కలెక్టరేట్‌లో ధర్నాలు చేసిన పరిస్థితి చూశాం.
కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నిజాంసాగర్‌కు పూర్వ వైభవం వచ్చింది. పాత నిజాంసాగర్ ఎట్టుండనే ఇప్పుడు సాగర్ అలా తయారైంది. నిజాం సాగర్ 365 రోజులు నిండే ఉంటది. మీ పంటలకు ఎటువండి డోఖా ఉండదు. దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుకు లింక్ చేసుకున్నాం. సింగూరు నీళ్లను హైదరాబాద్‌కు బంద్ చేసినం. హైదరాబాద్‌కు గోదావరి నుంచి నీళ్లు తెచ్చాం. కాళేశ్వరం జలాలు మల్లన్న సాగర్ జలాలు మీకు వస్తాయి. పాత నిజామాబాద్ ఎలా కళకళలాడిందో మళ్లా అట్లనే ఉంటుంది. 58 ఏండ్ల తర్వాత బీఆర్ఎస్ సాధించిన విజయం ఇది.
ఇవాళ బోధన్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి ఉన్నారు. గతంలో ఆయన ఇరిగేషన్ మినిస్టర్‌గా ఉండే. నిజామాబాద్, బాన్సువాడ, బోధన్‌లో మొత్తం డిస్ట్రిబ్యూటరీ కాల్వలు పోయాయని అంటే పట్టించుకోలేదు. ఇరిగేషన్ మినిస్టర్‌గా ఉండి సుదర్శన్ రెడ్డి ఒక్క పైసా తేలేదు. కానీ షకీల్ ఎమ్మెల్యే అయిన తర్వాత పట్టుబట్టి రూ. 72 కోట్లు మంజూరు చేసి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ బాగు చేయించాడు. ఆ పనులన్నీ మీ ముందర ఉన్నాయి. మీ కండ్ల ముందరనే జరిగాయి. ఇలా అనేక పనులు తెలంగాణ వ్యాప్తంగా జరిగాయి. కోసి వాగు మీద ఆరేడు చెక్ డ్యాంలు కట్టారు షకీల్. భూగర్భ జలాలు పెరిగాయి. చెరువులన్నీ బాగు చేసి, నదులు, వాగుల మీద చెక్ డ్యాంలు కట్టి బాగు చేసుకున్నాం.
బీడీ కార్మికులు ఇండియాలో 16 రాష్ట్రాల్లో ఉన్నారు. వారికి పెన్షన్ ఇవ్వాలని ఏ ప్రధాని, ముఖ్యమంత్రి ఆలోచన చేయలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నాం. పెన్షన్లను 5 వేలకు పెంచబోతున్నాం. బీడీ కార్మికులకు కూడా ఆటోమేటిక్‌గా 5 వేల పెన్షన్ వస్తది. నిజామాబాద్ – బోధన్ రోడ్డు అధ్వాన్నంగా ఉండే. ఇప్పుడు ఫోర్ లేన్ రోడ్డు వేయించారు షకీల్. మన కోసం కష్టపడ్డవారు, నీళ్లు తీసుకొచ్చినవారు, సంక్షేమం గురించి ఆలోచించిన వారు గెలిస్తే మరింత అభివృద్ధి జరుగుతది. హిందూ, ముస్లింలు, క్రైస్తవులు అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం. కలిసి పండుగలు జరుపుకుంటున్నాం. ఇదే పద్ధతిలో ముందుకు పోదాం.
వ్యవసాయ స్థీరికరణ చేయాలని బీఆర్ఎస్ ఐదారు పనులు చేసింది. నీటి తిరువా రద్దు చేశాం. నీళ్లకు ట్యాక్స్ లేదు ఇప్పుడు. 24 గంటల కరెంట్ ఫ్రీగా ఇస్తున్నాం. రైతుబంధు పథకం పెట్టుబడి సాయం చేస్తున్నాం. రైతు చనిపోతే వారంలోపే రూ. 5 లక్షలు వచ్చేలా బీమా సదుపాయం కల్పించాం. మీ గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం.. మీ ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నాం. ఇలాంటి పథకాలు మహారాష్ట్రలో ఉన్నాయా..? బిలోలి, ధర్మాబాద్ మీ పక్కకే ఉన్నాయి కాదా..? మహారాష్ట్రకు వచ్చి పార్టీ అన్న పెట్టు.. లేదంటే మా ధర్మాబాద్ తాలుకా తెలంగాణలో కలపుమని అక్కడి నాయకులు అడుగుతున్నారు. మనం ఎంతో కొంత మంచిగా ఉన్నాం కాబట్టే వాళ్లు కలుస్తామని అంటున్నారు. బాగా లేకపోతే ఎందుకు వస్తారు. కర్ణాటకలో లేవు.. ఈ పథకాలు ఇండియాలో కూడా ఎక్కడా లేవు. 50 ఏండ్ల కాంగ్రెస్ రాజ్యంలో రైతులు అంజుమాన్ అప్పులు కట్టకపోతే తలుపులు ఊడపీక్కపోయారు.. కానీ రైతుబంధు గురించి ఆలోచించలేదు.
ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తామని రాహుల్ గాంధీ అంటున్నారు. రైతుబంధు, రైతుబీమా డబ్బులు నేరుగా మీ ఖాతాల్లో పడుతున్నాయి. మరి ధరణి తీసేస్తే.. ఈ డబ్బులు ఎలా వస్తాయనేది ఆలోచించాలి. ధరణి ఎత్తేస్తే మళ్లీ దళారుల రాజ్యం, లంచాల రాజ్యం వస్తది. ధరణి తీసేస్తే రైతాంగానికి పెద్ద దెబ్బ.. ప్రమాదం. కాంగ్రెస్ రాజ్యం వస్తే మళ్లా అదే బ్రోకర్ల రాజ్యం.. ఊరికి నలుగురు పైరవీకారులు, మండలంలో నలుగురు పైరవీకారులు వస్తరు. పాత రిజిస్టరేషన్ సిస్టం వస్తది. షకీల్ గెలిస్తే ధరణి ఉంటది. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ధరణి బంగాళాఖాతానికి రైతులు అరేబియా సముద్రానికి అంతే కదా.. ఈ ఒక్క మాట చాలు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి తెలంగాణ రైతులు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు. గంపగుత్తగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి. కేసీఆర్ చెప్పిన మాటలను నలుగురు రైతులను పోగేసి చర్చ పెట్టండి. అప్పుడు నిజనిజాలు తేల్చండి. గుడ్డిగా ఓట్లు వేయొద్దు.
కరెంట్ 24 గంటలు ఉండాలంటే షకీల్ బాయ్ గెలవాలి.. సుదర్శన్ రెడ్డి గెలిస్తే 3 గంటల కరెంట్ వస్తది. కాంగ్రెస్ గెలిస్తే కరెంట్ కాట కలుస్తది. రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీం.. అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేడు. కేసీఆర్ ఎన్నేండ్లు కొట్లాడాలి. 24 ఏండ్ల నుంచి కొట్లాడుతున్నా. ఇక జిందగీలా నేనే కొట్లాడాలా..? ఇప్పుడు మీరు కొట్లాడాలి. రైతులు అందరూ ఆలోచించి దుర్మార్గపు కాంగ్రెస్‌ను మట్టి కరిపించాలి. 50 ఏండ్లు మనల్ని ఏడిపించిన కాంగ్రెస్ పార్టీని మళ్లీ గెలిపించుకుని మన వేలితో మనం పొడుచుకుందామా.? బీఆర్ఎస్‌ను గెలిపించి అభివృద్ధిని కొనసాగించాలా అనేది ఆలోచించాలి.