నోరు అదుపులో పెట్టుకోవాలి.. బీఆర్ఎస్ అభ్య‌ర్తుల‌ను హెచ్చ‌రించిన సీఎం కేసీఆర్

  • Publish Date - October 15, 2023 / 07:25 AM IST

విధాత‌: బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ హెచ్చ‌రించారు. ఓ ఐదు నిమిషాల పాటు క్లాస్ పీకారు. ప్ర‌తి అభ్య‌ర్థి నోరు అదుపులో పెట్టుకోవాలి.. సంస్కారంతో మాట్లాడాలి.. కోపానికి దూరంగా ఉండాల‌ని అభ్య‌ర్థుల‌కు కేసీఆర్ సూచించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు బీ-ఫారాలు అంద‌జేసిన సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడారు.


అభ్య‌ర్థులకు సంస్కారం ఉండాలి. ప్ర‌జ‌ల‌కు దండం పెట్టి ఓటు కావాల‌ని అడుగుతాం. రాజ‌కీయాలు అన్న‌త‌ర్వాత మంచి, చెడు ఉంటాయి. అల‌క‌లు ఉంటాయి. అంద‌రి కంటే ఎక్కువ‌గా అబ్య‌ర్థులు ప్ర‌జ‌ల్లో ఉండాలి. కోపాలు తీసేసుకోవాలి. చిన్న కార్య‌క‌ర్త‌తో మాట్లాడే ప్ర‌య‌త్నం చేయాలి. ఇది త‌ప్ప‌క పాటించాలి. గ‌త ఎన్నిక‌ల్లో ఒక‌రిద్ద‌రికి చెప్పాను. వ్య‌క్తిత్వం మార్చుకోవాల‌ని చెప్పాను. మాట్లాడ‌లేదు. ఒక‌రు ఓడిపోయారు.


జూప‌ల్లి కృష్ణారావు ఒకాయ‌న ఉండే.. మంత్రిగా ప‌ని చేశారు. ఆయ‌న అహంకారంతో ఇత‌ర నాయ‌కుల‌తో మాట్లాడ‌లేదు. ఓడిపోయారు. అలా ఉంట‌ది. ఒక మ‌నిషితో మాట్లాడేందుకు అహంకారం ఎందుకు..? నాయ‌కుడికి కొన్ని ల‌క్ష‌ణాలు ఉండాలి. నాయ‌కుల‌ చిలిపి ప‌నులు, చిల్ల‌ర ప‌నుల వ‌ల్ల ఎన్నో కోల్పోతారు. సంస్కార‌వంతంగా ఉండాలి. మంచిగా మాట్లాడం, ప్ర‌వ‌ర్తించ‌డం నేర్చుకోవాలి. ప్ర‌తి ఒక్క‌రూ వ్య‌క్తిగ‌తంగా మ‌న‌వి చేస్తున్నా.. ఇది ఇంపార్టెంట్ ఘ‌ట్టం. మంచిగా మాట్లాడ‌టం నేర్చుకోవాలి. కార్య‌క‌ర్త‌ల‌కు మ‌న‌ల్ని అడిగే అధికారం ఉంటుంది. ప్ర‌తి ఒక్క‌రూ చాలా జాగ్ర‌త్త‌గా ముందుకు పోవాలి అని కేసీఆర్ సూచించారు.


మీ అంద‌రికీ చాలా సంద‌ర్భాల్లో, చాలా స‌మావేశాల్లో పదే ప‌దే ఒక మాట చెప్పాను. మ‌ళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కే టికెట్లు వ‌స్తాయి, విజ‌యం సాధిస్తార‌ని ఆత్మ‌విశ్వాసం ప్ర‌క‌టించాను. మీ అంద‌రికీ అవ‌కాశం రావ‌డం సంతోషంగా ఉంది. ఎవ‌రికైతే అవ‌కాశం రాలేదో.. వారు తొంద‌ర‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఎమ్మెల్యేగా సెలెక్ట్ అవ్వ‌డ‌మే ఫైన‌ల్ కాలేదు. ఎన్నో అవ‌కాశాలు ఉంటాయ‌ని చెప్పాం. మార్చుకున్న చోట విచిత్ర‌మైన సంద‌ర్భాలు ఉన్నాయి. వేముల‌వాడ‌లో మార్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు. న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు ఉన్నాయి కాబ‌ట్టే అక్క‌డ అభ్య‌ర్థిని మార్చుకోవాల్సి వ‌చ్చింది అని కేసీఆర్ తెలిపారు.