ORR Tenders । హరీశ్ డిమాండ్‌తో ఇరకాటంలో కేటీఆర్.. హరీశ్ కోరిక మేరకు ఓఆర్‌ఆర్ టెండర్లపై దర్యాప్తు : రేవంత్‌రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హరీశ్‌రావు కోరిన మేరకు ఓఆర్‌ఆర్ టెండర్ల కేటాయింపుపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తామని ప్రకటించారు. హరీశ్‌రావు కోరిక మేరకు అంటూ పదే పదే ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయడం గమనార్హం.

ORR Tenders । ప్రతిపక్ష బీఆరెస్‌కు అధికార కాంగ్రెస్ గురువారం మరో ఝలక్ ఇచ్చింది. హరీశ్‌రావు యథాలాపంగా చేసిన ఒక సవాలు.. కేటీఆర్‌ను ఇరకాటంలో పడేసింది. గత ప్రభుత్వంలో ఔటర్ రింగురోడ్డు టెండర్ల కేటాయింపు ప్రక్రియ తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు జరిగిన ఈ తతంగంపై అప్పటి ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ తీవ్ర విమర్శలే గుప్పించింది. గురువారం అసెంబ్లీలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. అప్పులపై చర్చ సందర్భంగా బీఆరెస్ నేత హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందిస్తూ గత ప్రభుత్వం చేసిన లక్షా 20 వేల కోట్ల అప్పులను తాము తీర్చామని, అంతేకానీ ఓఆర్‌ఆర్ టెండర్లను అమ్ముకోలేదని విమర్శించారు. దీనిపై హరీశ్‌రావు మాట్లాడుతూ దమ్ముంటే టెండర్లు రద్దు చేసి, విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఈ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హరీశ్‌రావు కోరిన మేరకు ఓఆర్‌ఆర్ టెండర్ల కేటాయింపుపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తామని ప్రకటించారు. హరీశ్‌రావు కోరిక మేరకు అంటూ పదే పదే ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయడం గమనార్హం. విచారణ విధివిధానాలను మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయిస్తామని తెలిపారు. ఎన్నికలకు ముందు హడావుడిగా టెండర్లు తీసుకొచ్చి, అయాచిత లబ్ధి కలిగిస్తూ కట్టబెట్టారని ఆరోపించారు. ఈ నగరం అంతర్జాతీయ నగరంగా మారటానికి కృష్ణా జలాలు, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైల్, ఫార్మా కంపెనీలు, ఐటీ కంపెనీలు తీసుకొచ్చి హైదరాబాద్‌ను ప్రపంచ చిత్రపటంలో పెట్టామని తెలిపారు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగడంలో ఇవన్నీ కీలకంగా మారాయని చెప్పారు.