రాజ్యాంగ మార్పు.. రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ యత్నాలు.. ఇవిగో ఆధారాలు
రాజ్యాంగ మార్పు.. రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ యత్నాలు.. ఇవిగో ఆధారాలు వాజ్‌పేయి హయాంలోనే కమిషన్, 2024లో అమలు చేయడం మోదీ లక్ష్యం రాజ్యాంగ మార్పు ఆరెస్సెస్ మూల సిద్ధాంతం, దానిని అమలు చేయడమే బీజేపీ అజెండా

- వాజ్‌పేయి హయాంలోనే కమిషన్
- 2024లో అమలు చేయడం మోదీ లక్ష్యం
- రాజ్యాంగ మార్పు ఆరెస్సెస్ మూల సిద్ధాంతం
- దానిని అమలు చేయడమే బీజేపీ అజెండా
- ఈసారి బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు, రాజ్యాంగం మార్పునకే
- కూటమి గెలిస్తే 50% మించి రిజర్వేషన్లు
- ఎటు ఉండాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తేల్చుకోవాలి
- అసలు మోదీ బీసీనే కన్వర్టెడ్ బీసీ కాదు..
- అబద్దాల వర్శిటీకి మోదీ వీసీ, అమిత్ షా రిజిస్ట్రార్
- ఢిల్లీ సుల్తాన్‌లకు బెదిరేది లేదు
- మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
విధాత: ఆరెస్సెస్ ఎజెండా మేరకు రాజ్యాంగాన్ని మార్చేందుకు, రిజర్వేషన్లను రద్దు చేసేందుకే బీజేపీ 400 ఎంపీ సీట్ల నినాదాన్ని ఎత్తుకుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ మేరకు కొన్ని ఆధారాలను వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఇప్పుడు సంక్షేమం, అభివృద్ధి ప్రచారాంశాలు కాదని అన్నారు. రాజ్యాంగం మార్చాలా? మార్చకూడదా? రిజర్వేషన్లు ఉండాలా? వద్దా? అన్నదేనని చెప్పారు. రాజ్యాంగానికి.. రిజర్వేషన్లకు అనుకూల, వ్యతిరేకవర్గాల మధ్య పోరుగా ఈ ఎన్నికలను రేవంత్ అభివర్ణించారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ మార్పు.. రిజర్వేషన్ల రద్దు ఆలోచనలు, ప్రయత్నాలకు సంబంధించి బీజేపీ, ఆరెస్సెస్ వివిధ సందర్భాల్లో తీసుకున్న చర్యలు, చెప్పిన మాటలను రేవంత్‌రెడ్డి వెల్లడించారు. సమయం సందర్భం వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలని, కులాల ప్రాతిపదికన ఏర్పాటైన రిజర్వేషన్లు రద్దు చేయాలన్నదే ఆరెస్సెస్ మూల సిద్ధాంతామని చెప్పారు. దానిని అమలు చేయడమే బీజేపీ ఎజెండా అని అన్నారు. ఆ పనిని 2024లో పూర్తి చేయాలని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై దేశస్థాయిలో చర్చ సాగడంతోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తనపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసి అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. సీఎంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు అండగా ఉండటం, మాట్లాడటం తప్పా? అని ప్రశ్నించారు.
వాజ్‌పేయి హయాంలోనే కమిషన్
ప్రధానిగా వాజ్‌పేయి ఉన్న కాలంలో రాజ్యాంగం మార్పు అంశంపై పరిశీలనకు 2000 సంవత్సరం ఫిబ్రవరి 22న జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్‌ను నియమించగా, 2004లో కమిషన్ నివేదిక సమర్పించిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. 2004లో భారత్ వెలిగిపోతుందంటూ ఎన్‌డీఏ నినాదాన్ని ప్రజలు తిరస్కరించి, యూపీఏ-1 ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడంతో అప్పుడు రాజ్యాంగ మార్పు ప్రమాదం తప్పిందని చెప్పారు. ఆ కమిషన్ నివేదికను దాచిపెట్టుకుని 2024లో 2/3 మెజార్టీ వస్తే రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ప్రణాళికలు వేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సీఎంగా తాను చేసిన ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వకుండా ఎన్నికల్లో నెగ్గడానికి ఈడీ, ఐటీ, సీబీఐలను వినియోగించినట్లుగా తనపై ఢిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నదని విమర్శించారు.
ఆరెస్సెస్ సిద్ధాంతకర్త గోల్వాల్కర్, ఎన్‌జీ వైద్య దళితులకు సమానత్వం.. హక్కులు లేని హిందూ రాష్ట్రమే మేలన్నారని, దురదృష్టవశాత్తూ రాజ్యాంగం అందరికీ సమాన హక్కులను కల్పించిందని రాశారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన దళితులకు, మిగతావారికి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని తన పుస్తకంలో వ్యతిరేకించారని తెలిపారు.
మండల్ అంటే కమండల్ అన్నారు
1990లో బీపీ మండల్ కమిషన్ నివేదిక మేరకు 50శాతం జనాభా ఉన్నబీసీలకు 25శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామనగా, అద్వానీ కమండల్ పేరు మీద రథయాత్ర చేపట్టిన సంగతిని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం రిజర్వేషన్లు న్యాయసమ్మతమేనని, బీసీ జనాభా గణించి 50 శాతం మించకుండా రిజర్వేషన్ అమలు చేయాలని ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పిందని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ జోడో యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు రిజర్వేషన్ల పెంపు కోసం వినతి పత్రాలు అందించగా, ఆ మేరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నచోట బీసీ జనాభాను లెక్కించి రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారన్నారు. అందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణనకు చర్యలు చేపట్టిందని తెలిపారు. 1925లో ఏర్పాటైన ఆరెస్సెస్.. హిందూ దేశం, కులాల ఆధారిత రిజర్వేషన్ల రద్దు, యూనిఫామ్ సివిల్ కోడ్, 370 ఆర్టికల్ రద్దు వంటి ఎజెండా అంశాలను బీజేపీ ఇప్పటికే పూర్తి చేసిందని చెప్పారు. మిగిలిన రాజ్యాంగ మార్పు.. రిజర్వేషన్ల రద్దు కోసమే 400 సీట్ల నినాదం ఎత్తుకున్నారని వివరించారు. అందుకోసం అన్ని రకాల అడ్డదారులు కూడా తొక్కుతున్నారని, ఎంపీ ఎన్నికను సైతం బెదిరించి ఏకగ్రీవం చేసుకునే దుర్మార్గానికి తెగబడ్డారని ఆరోపించారు.
మోదీ ప్రభుత్వంలో స్పీకర్‌గా ఉన్న సుమిత్రా మహాజన్ సామాజిక సమానత్వం కోసం అంబేద్కర్ రిజర్వేషన్లు పదేళ్ల కాలానికి ప్రతిపాదించారని, వాటిని పొడిగించుకుంటూ వెళ్లడం దేశ ప్రగతికి దోహదం చేస్తుందా? అని ప్రశ్నించారని రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే 2017లో రాజ్యాంగంపై తనకు గౌరవం ఉందని, అయితే రానున్న రోజుల్లో ఆది మారనుందని, తామున్నది అందుకేనని చెప్పారని రేవంత్ గుర్తు చేశారు. మరో మంత్రి మన్‌మోహన్ వైద్య కూడా ఇదే చెప్పారన్నారు. తాను మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు, రిజర్వేషన్లను రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నదని ఆరోపిస్తే ప్రధాని మోదీ, అమిత్ షా వివరణ ఇవ్వకుండా తనపై కేసులు పెట్టారని విమర్శించారు. తాను చేసిన వ్యాఖ్యలు తప్పైతే వాజపేయ్ ప్రభుత్వం జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ను నియమించడాన్ని, కమిషన్ ఇచ్చిన నివేదికను, కేంద్రమంత్రులు మంత్రులు, స్పీకర్ మాట్లాడిన మాటలను మీరు తప్పుబడుతున్నారో లేదో ముందు మోదీ, అమిత్ షా ప్రజలకు చెప్పాలని రేవంత్‌రెడ్డి సవాల్ చేశారు. ఇప్పటిదాకా బీజేపీ ప్రభుత్వాలకు భారీ మెజార్టీ లేక కూటమి కుంపట్లతో వాళ్లు అనుకున్న రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు పనులు సాధ్యం కాలేదన్నారు.
రాజ్యాంగం మార్పు కోసమే ప్రతిపక్షాల ప్రభుత్వాల కూలదోత
రాజ్యాంగాన్ని మార్చాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ కావాలని, అందుకే 400 సీట్లను బీజేపీ అడుగుతున్నదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. అలాగే సగం రాష్ట్రాల ఆమోదం అవసరం ఉన్నందున ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొడుగున్నదని ఆరోపించారు. ఇందులో ప్రతిపక్ష పార్టీలను చీల్చి, ప్రతిపక్ష పార్టీలను పడగొట్టి తమ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటున్నదని విమర్శించారు. ఈసారి బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు, రాజ్యాంగం మార్పునకు దారితీస్తాయన్నారు. ఇండియా కూటమికి మెజార్టీ వస్తే 50 శాతం పరిమితిని తొలగించి, రిజర్వేషన్లు పెంచుతుందని వెల్లడించారు. ఈ పార్లమెంటు ఎన్నికలలో సంక్షేమం, అభివృద్ధి పక్కకుపోయి, రాజ్యాంగాన్ని మార్చాలా? రిజర్వేషన్లు ఉండాలా? వద్దా? అన్నదానిపైనే చర్చలు సాగుతున్నాయని పేర్కొన్నారు. ఎటువైపు ఉండాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు రాజ్యాంగానికి.. రిజర్వేషన్లకు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య పోరుగా ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలని రేవంత్ అభివర్ణించారు. తాను పెడుతున్న ఈ చర్చ తన కోసమో, కాంగ్రెస్ పార్టీ కోసమో కాదన్నారు.
ఢిల్లీ సుల్తానుల కేసులకు భయపడను
తాను ఢిల్లీ సుల్తానులకు భయపడేవాడిని కాదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఇచ్చిన సీఎం పదవిని బీజేపీ కుట్రలను తిప్పికొట్టేందుకు రాజ్యాంగం రక్షణకు, రిజర్వేషన్ల పరిరక్షణకు ఉపయోగిస్తానని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా దళిత, గిరిజన, బలహీనవర్గాలకు అండగా నిలబడకుండా లొంగిపోతానని ఢిల్లీ సుల్తానులు ఎందుకు అనుకుంటున్నారో తనకు అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. పోలీసు కేసులకు, జైళ్లకు తాను భయపడుతానో లేదో మీతో చీకట్లో రోజూ మాట్లాడే కేసీఆర్‌ను అడిగితే చెబుతారని బీజేపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఢిల్లీ పోలీసుల నోటీసులకు తమ మహిళా న్యాయవాదితో సమాధానం పంపిస్తే ఆమె పట్ల దురుసగా ప్రవర్తించారని రేవంత్ ఆరోపించారు. తనపై ఫిర్యాదుదారుగా బీజేపీ నేతలులేరని, కేంద్ర హోంశాఖ ఓ రాష్ట్ర సీఎంపై నాన్ బెయిల్‌బుల్ కేసులు పెట్టడం ద్వారా భయపెట్టే ప్రయత్నం చేసిందన్నారు. ఏదో దేశ భద్రతకు ముప్పువచ్చినట్లుగా హడావుడి చేశారని ఆరోపించారు. తనపై జరిగిన ఈ కేసుల దాడి తెలంగాణ ప్రజలపై దాడిగా రేవంత్ అభివర్ణించారు. హోంశాఖ మంత్రి కింద ఉండే ఢిల్లీ పోలీసులను ప్రయోగించి, తనపై ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం చేయకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సీఎం ఎవరైనా ఫేక్ వీడియోలు తయారు చేయరని, తనకు ఫేక్ వీడియోలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎవరో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకు తనను బాధ్యుడిని చేస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ చెప్పేదానికి చేసే దానికి పొంతన ఉండదు
ఈ దేశంలో మతపరమైన రిజర్వేషన్ లేదని, ముస్లింలకు రిజర్వేషన్ బీసీ ఇ గ్రూపు కింద ఇచ్చారని రేవంత్ చెప్పారు. గోవధకు వ్యతిరేకమనే వారు లూలూ బ్రదర్స్‌కు అనుమతి ఇచ్చారని చెప్పారు. అదాని, ప్రధాని ఈస్టిండియా కంపెనీల మాదిరిగా సూరత్ నుంచి వచ్చి కార్పొరేట్ల కోసం రిజర్వేషన్లు రద్దు చేసి, దేశాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని సూచిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర సంస్థలను మోదీ కార్పొరేట్లకు అప్పనంగా అమ్మేశారని, నవరత్నాల భారీ పరిశ్రమలను అమ్మడం ద్వారా రిజర్వేషన్లు నీరుగార్చారని విమర్శించారు. కిషన్‌రెడ్డికి నిజాయితీ ఉంటే కేంద్రంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.
అసలు మోదీ బీసీనే కాదు..
తాను ఓబీసీ నేత అని మోదీ చెప్పుకుంటారు కానీ ఆయన బీసీ కాదని, కన్వర్టెడ్ బీసీ అని సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ సీఎం కాకముందు మోదీ కులం ఓసీనే అని చెప్పారు. సీఎం అయ్యాక మోదీ తన కులాన్ని బీసీ జాబితాలో కలిపారని వెల్లడించారు. మోదీ కన్వర్టెడ్ బీసీ కాబట్టే.. బీసీలపై ఆయనకు ప్రేమ లేదని అన్నారు. అబద్దాల యూనివర్శిటీకి ప్రధాని మోదీ వీసీ, అమిత్ షా రిజిస్ట్రార్ అని ఎద్దేవా చేశారు. గతంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై తనను చంపేందుకు సుపారి ఇచ్చినట్లు మోదీ చేసిన ఆరోపణలే ఇందుకు నిదర్శనమని రేవంత్ ఎద్దేవా చేశారు.