విధాత : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మరోసారి(66వ సారి) ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. రేవంత్ రెడ్డి తన పర్యటనలో భాగంగా సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, పథకాల అమలు పురోగతి, పార్టీ సంస్థాగత అంశాలను రేవంత్ వివరించనున్నారు. ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.
అలాగే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా ? లేదా పునర్ వ్యవస్థీకరణపైన, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశంపై కూడా అధిష్టానంతో చర్చించవచ్చని సమాచారం. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో రాష్ట్ర కాంగ్రెస్ నుంచి ప్రచార కార్యక్రమాల్లో హాజరయ్యే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. అటు రాష్ట్రానికి సంబంధించి అభివృద్ది పనుల విషయమై కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ కలుస్తారని తెలుస్తుంది.
