Revanth Reddy : బీఆరెస్, కేసీఆర్ చరిత్ర ఇక ఖతమే… కొడంగల్ సాక్షిగా ఇదే నా శపథం
"వచ్చే ఎన్నికల్లో 87 సీట్లతో కాంగ్రెస్‌ను గెలిపిస్తా.. కేసీఆర్ చరిత్ర ఖతమే" అని కొడంగల్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి శపథం చేశారు. సర్పంచుల కోసం ప్రత్యేక నిధులు ప్రకటిస్తూ బీఆర్ఎస్‌కు సవాల్ విసిరారు.
విధాత: కొడంగల్ వేదికగా చెపుతున్నా…2029 ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 87 సీట్లతో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తా…150 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 100 కు పైగా స్థానాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తా ..ఇదే నా సవాల్.. చేతనైతే కాస్కో బిడ్డా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. బుధవారం కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొస్గిలో జరిగిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం.. రాబోయే ఎన్నికల్లో కెసీఆర్ కు అధికారం ఇక కల్లనే అని అన్నారు. బీఆరెస్, కేసీఆర్ చరిత్ర ఇక ఖతమే… కొడంగల్ సాక్షిగా ఇదే నా శపథం అని అన్నారు. పది మందిని వెనకేసుకుని పొంకనాలు కొట్టుడు కాదు.. అసెంబ్లీలో చర్చిద్దాం రమ్మన్నారు.ఏ అంశంపై అయినా అసెంబ్లీలో చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నామని, సభకు రండి.. అర్థవంతమైన చర్చ చేద్దామన్నారు. కాళేశ్వరంపై , కృష్ణా గోదావరి జలాలపై , టెలిఫోను ట్యాపింగ్ పై చర్చిద్దాం రమ్మని కేసీఆర్ అన్నారు.
గాండ్రింపులక భయపడం..
సొంత చెల్లిలి భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారని వాళ్ళింటి ఆడబిడ్డనే చెబుతోందని సీఎం రేవంత్ అన్నారు. సొంత చెల్లెలికి సమాధానం చెప్పలేని కేటీఆర్ నాకు సవాల్ విసురుతున్నాడని ఎద్దేవా చేశారు. మీ గ్రాండ్రింపులకు, బెదిరింపులకు భయపడేది లేదన్నారు. తోలు తీసుడు కాదు.. మీ తోలు సంగతి చూసుకోండని రేవంత్ అన్నారు. కేసీఆర్ చాలా రోజుల తరువాత బయటకు వచ్చి… తోలు తీస్తానని కెసీఆర్ మాట్లాడుతున్నాడని, మా సర్పంచులు చీరి చింతకు కట్టి చింతమడకకు పంపిస్తారు జగ్రత్త అని హెచ్చరించారు.
వాళ్ల పాపాన వాళ్లుపోతాని…
సోయి లేని మాటలు.. స్థాయి లేని విమర్శలు చేస్తున్నారని కేసీఆర్, కేటీఆర్ లపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కటైనా ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడలేదన్నారు. కేసీఆర్ పదేండ్లు పాలమూరుపై పగబట్టి.. పాలమూరు అభివృద్ధిని అడ్డుకున్నాడన్నారు. మటన్ కొట్టు మస్తాన్ కు చెప్తా… అక్కడకు వెళ్లి తోలు తీయమన్నారు. నలభై ఏండ్ల అనుభవంతో మాట్లాడే మాటలు ఇవేనా అని ఎద్దేవా చేశారు. మాకు మాటలు రాక కాదు… మర్యాద ఉండదని మాట్లాడటం లేదన్నారు. తొడుక్కోవడానికి చెప్పులు, వేసుకోవడానికి బట్టలు లేని వాళ్లకు వేల కోట్ల ఆస్తులు వచ్చాయి తప్ప పాలమూరుకు నీళ్లు రాలేదని రేవంత్ అన్నారు. పడావు పెట్టిన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పనులు మొదలయ్యేలా చర్యలు చేపట్టామని రేవంత్ తెలిపారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు… పదేళ్లలో వాళ్లు చేసిన అప్పులు మన ముందు ఉన్నాయన్నారు. నా కోపాన్ని దృష్టిలో పెట్టుకుని పగ సాధించాలనుకుంటే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ఊరుకున్నానన్నారు. ఫామ్ హౌస్ లో బందీగా మారిన ఆయన.. వాళ్ల పాపాన వారు పోతారని ఊరుకున్నానని తెలిపారు.
దుబాయ్ పాస్ పోర్ట్ బ్రోకర్ దందా కాదు..
రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా అంటున్నాడు.. ఇదేం దుబాయ్ పాస్ పోర్ట్ బ్రోకర్ దందా కాదని రేవంత్ అన్నారు. నేనేం పాస్ పోర్టు బ్రోకర్ దందా చేయలేదని, అయ్య పేరు చెప్పుకుని మంత్రి పదవి తీసుకోలేదన్నారు. మేం కక్షా రాజకీయాలు చేయడం లేదని.. ఎవరి పాపాన వాళ్లే పోతారని మా పని మేం చేసుకుంటున్నామన్నారు.అయినా మా జోలికి వస్తే మా కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు.
పెద్దపంచాయతీలకు రూ.10 , చిన్న పంచాయతీలకు రూ. 5 లక్షల స్పెషల్ ఫండ్
నిండు మనసుతో మీరు ఆశీర్వదించి గుండెల్లో పెట్టుకోవడం వల్లే ముఖ్యమంత్రి హోదాలో మీ ముందు నిలబడ్డా అని కొడంగల్ నియోజకవర్గ సర్పంచ్‌లనుద్దేశించి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని మాట ఇస్తున్నానని చెప్నారు. అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోదామని చెప్పారు. మన నియోజకవర్గంలో ఎవరిపై వివక్ష చూపొద్దని, చిన్న చిన్న సమస్యలు ఉంటే పక్కన పెట్టాలన్నారు. గ్రామ కక్షలకు తావు లేకుండా నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధిచేసుకుందామన్నారు. కొడంగల్ వేదికగా 12706 మంది సర్పంచులకు సూచన చేస్తున్నా చిన్న గ్రామాలకు రూ. 5 లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీలకు రూ. 10 లక్షలు స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ అందిస్తా నని సీఎం రేవంత్ ప్రకటించారు. ముఖ్యమంత్రి నిధుల నుంచి నేరుగా సర్పంచులకే ఫండ్ అందిచే బాధ్యత నాదన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులకు ఇది అదనంగా ఉంటుందని చెప్పారు. సర్పంచుల గౌరవం పెంచాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సంక్షేమ పథకాలు ఎవరికి అందకపోయినా సర్పంచులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. విద్యార్థులకు వచ్చే అకడమిక్ నుంచి చదువుతో పాటు అల్పాహారం, భోజనం అందిచే బాధ్యత నాదని సీఎం రేవంత్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి :
Hyderabad Unhealthy Air Quality | కాలుష్యంలో హైదరాబాద్.. మరో ఢిల్లీ అవుతుందా? సిటీ అంతటా ‘అనారోగ్యకర’ గాలి!
Hyderabad Unhealthy Air Quality | కాలుష్యంలో హైదరాబాద్.. మరో ఢిల్లీ అవుతుందా? సిటీ అంతటా ‘అనారోగ్యకర’ గాలి!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram