Foxconn Chairman Young Liu | ఇండస్ట్రీ, సర్వీస్ రంగాల్లో విస్తరించే సత్తా గల నగరం హైదరాబాద్
ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లతో పాటు అన్ని రంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్ నగరానికి ఉందని అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ అన్నారు.
ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజన్ అద్భుతం
త్వరలోనే హైదరాబాద్‌ను సందర్శిస్తా
సీఎం రేవంత్ రెడ్డితో ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియూ
హైదరాబాద్‌లో పెట్టుబడులకు సానుకూలత
Foxconn Chairman Young Liu | ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లతో పాటు అన్ని రంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్ నగరానికి ఉందని అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ అన్నారు. త్వరలోనే తన బృందంతో కలిసి హైదరాబాద్ నగరాన్ని సందర్శిస్తానని ఆయన తెలిపారు. ఫాక్స్ కాన్ చైర్మన్ యాంగ్ లియూ నేతృత్వంలోని ఫాక్స్ కాన్ ప్రతినిధి బృందం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో ఆయన అధికారిక నివాసంలో శుక్రవారం ఉదయం సమావేశమైంది. హైదరాబాద్ నగరానికి ఉన్న చరిత్ర.. పారిశ్రామిక సంస్థల విస్తరణకు ఉన్న అనుకూలత, అద్భుతమైన వాతావరణ పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డి ఫాక్స్ కాన్ (Foxconn) బృందానికి వివరించారు. 430 ఏళ్ల కింద పునాది రాయి పడిన హైదరాబాద్ కాలక్రమంలో మూడు నగరాలుగా అభివృద్ధి చెందిన తీరును ముఖ్యమంత్రి తెలియజేశారు.
ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక అభివృద్ధిలో వైరుధ్యాలు లేకపోవడంతోనే హైదరాబాద్ వేగంగా పురోగతి చెందుతోందన్నారు. ఆ అభివృద్ధిని మరింతగా పరుగులు పెట్టించేందుకే తాము ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్లు ఫ్యూచర్ సిటీ పేరుతో నాలుగో నగరానికి (ఫోర్త్ సిటీ) (Fourth City) రూపకల్పన చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఫోర్త్ సిటీలో విద్యా, వైద్యం, క్రీడా, ఎలక్ట్రానిక్స్-ఎలక్ట్రికల్, స్కిల్ డెవలప్‌మెంట్ ఇలా బహుముఖంగా అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. ప్రస్తుత ప్రపంచానికి అవసరమైన స్కిల్స్‌ను యువతకు అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నామన్నారు.
నవ తరం పరిశ్రమల అవసరాలు, వాటికి అవసరమైన నైపుణ్యాలు, భవిష్యత్తులో ఆయా పరిశ్రమల అవసరాలు తీర్చే మానవ వనరులను అందించేందుకు అవసరమైన సిలబస్ రూపకల్పనలో ప్రముఖ పారిశ్రామికవేత్తలను భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీకి ఆనంద్ మహేంద్ర (Anand Mahindra)ను చైర్మన్‌గా, మరో పారిశ్రామిక వేత్త శ్రీనివాస రాజు (Srinivasa Raju) ను వైస్ చైర్మన్‌గా నియమించామని తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్), రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్)తో పాటు హైదరాబాద్‌కు ఉన్న అన్ని అనుకూలతలను సీఎం రేవంత్ రెడ్డి వారికి వివరించారు.
ఫోర్త్ సిటీలో ఫాక్స్ కాన్ (Foxconn) సంస్థ పరిశ్రమలు పెట్టేందుకు అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వడంతో పాటు అవసరమైన మద్దతు అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఫాక్స్ కాన్ చైర్మన్ యాంగ్ లియూ (Young Liu )కి హామీ ఇచ్చారు. ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. పారిశ్రామిక అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న ప్రోత్సాహాకాలు, ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తమ బృందం అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించి దిగ్గజ పారిశ్రామిక సంస్థలతో జరిపిన చర్చలు, చేసుకున్న ఒప్పందాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చైర్మన్ యాంగ్ లియూకి వివరించారు.
సీఎం విజన్ ఆకట్టుకుంది
ఫోర్త్ సిటీ రూపకల్పనలో సీఎం రేవంత్‌రెడ్డి దార్శనికత, పారిశ్రామిక అనుకూల విధానాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఫాక్స్ కాన్ చైర్మన్ యాంగ్ లియూ అన్నారు. ఫోర్త్ సిటీతో పాటు పారిశ్రామిక అనుకూల విధానాల్లో మీ విజన్ అద్భుతంగా ఉందంటూ యాంగ్ లియూ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. తాను సాధ్యమైనంత త్వరలోనే హైదరాబాద్ ను సందర్శిస్తానని తెలిపారు. అంతకుముందే తమ చీఫ్ క్యాంపస్ ఆపరేషన్స్ ఆఫీసర్ క్యాథీ యాంగ్ , సంస్థ భారత దేశ ప్రతినిధి వీలీ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ వస్తుందని ఆయన చెప్పారు.
భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్) జయేష్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి (ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ ఎక్సటర్నల్ ఎంగేజ్‌మెంట్), ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ డాక్టర్ ఎస్కే శర్మ, ఫాక్స్ కాన్ నుంచి సంస్థ ఎస్బీజీ ప్రెసిడెంట్ బాబ్ చెన్, సీబీజీ జీఎం జొ వూ, చీఫ్ క్యాంపస్ ఆపరేషన్స్ ఆఫీసర్ క్యాథీ యాంగ్, సీఎస్‌బీజీ డిప్యూటీ జీఎం సూ, షొ కూ , సీ-గ్రూప్ మేనేజర్ సైమన్ సంగ్, సంస్థ భారత దేశ ప్రతినిధి వీలీ తదితరులు పాల్గొన్నారు.
X


Google News
Facebook
Instagram
Youtube
Telegram