Revanth Reddy | కేసీఆర్ సభ వేళ బీఆర్ఎస్ నేతల ఢిల్లీ టూర్.. సీఎం రేవంత్ ప్రకటనతో ప్రకంపనలు!

Revanth Reddy | జగిత్యాల జైత్రయాత్రగా అభివర్ణిస్తూ జనగర్జన పేరుతో బీఆర్ఎస్ సోమవారం నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభ జరుగుతున్న వేళ ఆ పార్టీకి చెందిన ముగ్గురు ముఖ్యనేతలు ఆఘమేఘాల మీద ఢిల్లీకి వెళ్ళడం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

కాళేశ్వరం పై సీబీఐ విచారణ అడ్డుకునే యత్నం
ఆఘమేఘాల పై ముగ్గురు బీఆర్ఎస్ నేతల టూర్
బీజేపీ నేతల కాళ్ళు పట్టుకునేందుకే ఈ పర్యటన
ముఖ్య ఆరెస్సెస్ నేత సహకారంతో తీవ్ర ప్రయత్నం
హరీష్ రావు అంగీకరిస్తే ఢిల్లీ పర్యటన పై విచారణ
దోషులను వదిలేదిలేదు..కాళేశ్వరాన్ని గాలికొదిలేయం
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సీఎం ప్రకటన ప్రకంపనలు

విధాత, ప్రత్యేక ప్రతినిధి:  జగిత్యాల జైత్రయాత్రగా అభివర్ణిస్తూ జనగర్జన పేరుతో బీఆర్ఎస్ సోమవారం నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభ జరుగుతున్న వేళ ఆ పార్టీకి చెందిన ముగ్గురు ముఖ్యనేతలు ఆఘమేఘాల మీద ఢిల్లీకి వెళ్ళడం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భాన్ని గేమ్ చేంజర్ గా మార్చేందుకు జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న వేళ ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు తన్నీరు హరీష్ రావు, బోయినపల్లి వినోద్ కుమార్, ఎంపీ ఒద్దిరాజు రవిచంద్రలు హడావుడిగా, ఎవరికీ చెప్పకుండా ఢిల్లికి తరలివెళ్ళడం వెనుక పెద్ద మతలబు ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి బాంబు పేల్చడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

దాదాపు ఏడాది తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ జగిత్యాలకు వస్తున్న సందర్భంలో ఆ సభకు హరీష్ రావు లేకపోవడం, వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ లు రాకపోవడం ఇప్పుటు హాట్ టాపిక్గా మారింది. సింహం వస్తుంటే గుంటనక్కలు కుట్రలు చేస్తున్నాయంటూ ప్రకటించిన నేతలు సభా జరిగే సమయానికి లేక పోవడంతో చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక పెద్ద కారణముందంటూ ఉదయం నుంచి ప్రచారం కాగా, కాళేశ్వరం పై హైకోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు న్యాయనిపుణులతో చర్చించేందుకు వెళ్ళారని ఆ పార్టీ వర్గాలు చెబుతుండగా, ఇందులో నిజం లేదంటూ సీబీఐ విచారణను అడ్డుకునేందుకు ఢిల్లీకి వెళ్ళారని సీఎం చేసిన ఆరోపణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హరీష్ రావుకు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ చేరడం ఇష్టం లేక బీజేపీలో చేరేందుకు యత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు. దీనిలో భాగంగానే ఆయన ఢిల్లీ బీజేపీ నేతలను కలిసేందుకు వెళ్ళారని కాంగ్రెస్ నాయకులు చెబుతూ వచ్చారు. సాయంత్రానికి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ పర్యటనలో బీజేపీ నేతల కాళ్ళుపట్టుకుని సీబీఐ విచారణ ఆపేందుకు యత్నిస్తున్నారని ఆరోపించి తీవ్ర సంచలనం సృష్టించారు. సీఎం రేవంత్ స్పందన ఇలా ఉంది.

సీబీఐ విచారణను అడ్డుకునేందుకే ఢిల్లీ పర్యటన : సీఎం రేవంత్

లక్ష కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పై కేంద్రం స్పందించి సీబీఐ విచారణకు ఆదేశిస్తుందేమోనని బెంబేలెత్తి హడావుడిగా హరీష్ రావు, వినోద్ రావు, వద్ది రాజు రవిచంద్ర ఢిల్లీకి పరిగెత్తారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. విచారణ జరుపకుండా బీజేపీ నాయకుల కాళ్లు పట్టుకునేందుకు వీరు సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాళేళ్వరం ప్రాజెక్టును గాలికొదిలేసే పరిస్థితి లేదని, వదిలితే ఒక భారం, పునర్నిర్మిస్తే మరో భారమనే ఈ స్థితిలో తెలంగాణ ప్రజలకు నీళ్ళిచ్చేందుకు నిపుణుల కమిటీ వేశామని చెప్పారు. దీంతో భాగంగానే సాంకేతిక నిపుణులందరితో సోమవారం కలువాలని నిర్ణయించామని, నిపుణుల నివేదికతో తమ బండారం బయటపడుతుందని, లోపాలు గుర్తిస్తారని బీఆర్ఎస్ నాయకులు జగిత్యాలలో అతితెలివితో రాజకీయ మీటింగ్ పెట్టుకున్నారని విమర్శించారు. పైగా మా మీద ఎదురుదాడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖతో కేంద్రంలో కదలిక వచ్చిందన్నారు. త్వరలో సీబీఐ విచారణ జరుపకుంటే తొందరలోనే కాళేశ్వరం నుంచి ఆందోళన కార్యక్రమం చేపడుతామని సమాచారమిచ్చామన్నారు.

ఒక పక్కన బ్రహ్మండం బద్దలైతోంది…. మాకు జీవన్ రెడ్డి దొరికిండు… జీవన్ టోన్ దోరుకుతుందని ప్రగల్భాలు పలుకుతున్న బీఆర్ఎస్ నాయకులు ఎందుకు ఢిల్లీకి ఎందుకు పరుగెత్తాల్సి వచ్చిందన్నారు. పొద్దన్నే లేచి ఎవరికీ చెప్పకుండా, ముగ్గురు నాయకులు రహస్యంగా ఢిల్లికి పరుగుపెట్టారన్నారు. దీన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తే బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులను కలిసేందుకు ఢిల్లీకి వెళ్ళారని బయటపెట్టే వరకు ఎందుకు స్పందించలేదన్నారు. బీజేపీని ప్రసన్నం చేసుకుని కాళేశ్వరం పై ఎంతకాలం సీబీఐ విచారణ జరుపకుండా అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఈ రకంగా తప్పించుకునేందుకు బీజేపీని అడ్డంపెట్టుకుని అవినీతిని కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాన్ని చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ధిష్టమైన కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. ఒక పక్క ప్రాజెక్టు మరమ్మత్తు చేసి ఉపయోగపడే విధంగా చర్యలు చేపడుతాం. తుమ్మడి హెట్టి దగ్గర ప్రాజెక్టు చేపడుతామన్నారు. సీబీఐ విచారణ చేపట్టేందుకు కేంద్రం ఎందుకు స్పందించడంలేదని సీఎం ప్రశ్నించారు.

కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ఏటిఎంగా మారిందని బీజేపీ నాయకులే అన్నారుగదా? విచారణ సంస్థల అధిపతులుగా ప్రధాని, హోం మంత్రి ఉంటూ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో సమాధానం చెప్పాలన్నారు. హరీష్ రావు ఢిల్లీ పర్యటనకు సంబంధించి వివరాలు అన్నింటిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ రహస్య పర్యటన వెనుక ఉన్న ఉద్దేశ్యాలను తెలంగాణ ప్రజలకు తెలువాలన్నారు. లేక పోతే హరీష్ రావు ఎక్కడెక్కడికి వెళ్ళాడో? ఎవరెవరిని కలిశారో ఆయన ఒప్పుకుంటే విచారణకు ఆదేశిస్తానని సీఎం ప్రకటించారు.

ఈ రహస్య పర్యటనలో ఏ ఆరెస్సెస్ ప్రముఖులను పట్టుకుని కేంద్రం, బీజేపీ పై ఒత్తిడి తీసుకొచ్చి, తమ అవినీతిని కాపాడుకునేందుకు ప్రయత్నించారో తేలుతుందన్నారు. పీసీ ఘోష్ కమిషన్ కేసంటున్నారు..వాస్తవానికి ఈ కేసు పై ఇప్పటికే వాదనలు ముగిశాయి.. తీర్పు రిజర్వు చేశారు.. ఈ నెల 22న తీర్పు ప్రకటిస్తామన్నారు. ఈ పరిస్థితుల్లో న్యాయనిపుణులు వచ్చి వాదించేదేముంటుందంటూ సీఎం ప్రశ్నించారు. ఈ విషయంలో ఎవరిని మభ్యపెడుతున్నారు? ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నారు? ఎవరిని మేనేజ్ చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఏం జరుగుతోందంటూ, ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా? ఇందులో దోషులను వదిలేది లేదు…ప్రాజెక్టును గాలికొదిలేసి ఊరుకునేది లేదంటూ స్పష్టం చేశారు. ప్రాజెక్టు రిపేర్లు చేసి రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతాం… ఇందులో దోషులందరికీ శిక్షపడే విధంగా అవసరమైన కార్యాచరణతో ముందుకు సాగుతామంటూ సీఎం రేవంత్ తేల్చిచెప్పారు.

Read More:

త్వరలో భూముల విలువలు పెంపు…రిజిస్ట్రేషన్ ఛార్జీల మోత తప్పదా

పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే.. అవి వచ్చాకే నిర్వహణ..

Latest News