త్వరలో భూముల విలువలు పెంపు…రిజిస్ట్రేషన్ ఛార్జీల మోత తప్పదా
తెలంగాణలో త్వరలో భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. హైదరాబాద్‌లో ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యవసాయ భూముల ధరలు ప్రభావితం కానున్నాయి.
హైదరాబాద్ : తెలంగాణ లో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. వాస్తవ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ రికార్డు ధరలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్నితగ్గించాలని నిర్ణయించిందని సమాచారం. దీని ద్వారా రాబడి పెంచుకోవాలనే ఆలోచనలో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల విభాగం ఉందని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా భూముల విలువలు పెంచలేదు. ప్రభుత్వ రికార్డులో ఒక ప్రాంతంలో చదరపు గజానికి రూ.10వేల వరకు ఉండగా, బహిరంగ మార్కెట్ లో రూ.1 లక్ష వరకు పలుకుతున్నది. మరికొన్ని ప్రాంతాలలో చదరపు గజానికి రూ.20వేలు ఉండగా బహిరంగ మార్కెట్ లో రూ.1 లక్ష వరకు ఉంది. ఇలాంటి వ్యత్యాసాల మూలంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోతున్నది.
ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహదారు అరవింద్ సుబ్రమణియన్ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంటున్నారని సమాచారం. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించారు. ఆర్థిక వనరులను ఎలా పెంచుకోవాలనేదానిపై ఆయన కొన్ని సూచనలు చేశారంటున్నారు. ఆ సూచనలు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగంలో అమలు చేయనున్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్ర పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణా రావు, పన్నుల కమిషనర్ రఘునందన్ రావు పాల్గొన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో నమూనా మూల్యాంకనం, జీఎస్టీలో పన్నుల అంచనాతో పాటు ఇతర అంశాలు చర్చకు వచ్చాయి. ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చుకునేందుకు పలు చర్యలను సూచించారు. అంతకు ముందు డిసెంబర్ నెలలో కూడా సుబ్రమణియన్ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. రెండు దఫాలు జరిగిన భేటీ తరువాత సుబ్రమణియన్ సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత శాఖలను ఆదేశించారని సమాచారం.
రాష్ట్రంలో ప్రధానంగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, రవాణా, ఎక్సైజ్, స్టేట్, వాణిజ్య పన్నుల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతున్నది. గతేడాది వాణిజ్య పన్నుల శాఖ కు జూనియర్ ఐఏఎస్ అధికారి హరిత అధిపతిగా ఉండగా ఆమెను తప్పించి సీనియర్ ఐఏఎస్ ఎం.రఘునందన్ రావును నియమించారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగం ద్వారా ప్రతి నెలా ప్రభుత్వానికి సగటున రూ.1,500 కోట్ల వరకు ఆదాయం వస్తున్నది. సాలీనా రూ.18వేల కోట్ల వరకు వసూలు అవుతుండగా, భూముల విలువల సవరణ తరువాత రూ.3,600 కోట్ల వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. అనగా ప్రతి నెలా రూ.300 కోట్లు అదనంగా వసూలు అవుతుందన్న మాట. హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా జరుగుతున్నది. ఆదాయం కూడా ఇక్కడి నుంచే ఎక్కువగా ప్రభుత్వానికి సమకూరుతున్నది. అయితే అనేక లోపాలు ఉన్నట్లు అంతర్గత విచారణలో వెల్లడైంది. లే అవుట్ లోని ఇళ్ల స్థలాలు, అపార్ట్ మెంట్ ఫ్లాట్ విలువలు భారీగా పెరగనున్నది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రీజినల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీని డెవలప్ మెంటు చేస్తున్నారు. 2028 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే ఫ్యూచర్ సిటీలో కార్యకలాపాలు ఊపందుకునేలా చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని, ఫలితంగా భూములకు డిమాండ్ ఏర్పడుతుందనే ఆశతో విలువలు పెంచాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2021 సంవత్సరంలో చివరగా రిజిస్ట్రేషన్ ధరలు పెంచారు. అయితే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్ రామ్ గూడ, గచ్చిబౌలి, కోకాపేట వంటి కమర్షియల్ ఏరియాల్లో ధరల వ్యత్యాసం ఊహించని విధంగా ఉంది. ప్రభుత్వ రికార్డు ధరకు, బహిరంగ మార్కెట్ ధరకు మధ్య వ్యత్యాసం 80 శాతం వరకు ఉంది. ఈ వ్యత్యాసం మూలంగా ప్రభుత్వానికి ఆదాయం తగ్గడంతో పాటు, అవినీతికి కల్పతరువుగా మారింది. దీన్ని నియంత్రించేందుకు వ్యత్యాసాలను సరిచేయాలని నిర్ణయించారని సమాచారం.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కలిపి 7.5 శాతం వసూలు చేస్తున్నారు. ఇతర దేశాలలో భూముల విలువలు పెంచినప్పుడు డ్యూటీలను తగ్గించడం చేస్తున్నారు. అదే తరహా విధానాన్ని తెలంగాణలో అనుసరించనున్నారు. స్టాంపు డ్యూటీ 1 శాతం తగ్గించి, ఆ నష్టాన్ని భూముల విలువల పెంపు ద్వారా నష్టాన్ని పూడ్చుకోనున్నారు. మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తే స్టాంప్ డ్యూటీ 1 శాతం తగ్గించాలనే ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని తెలుస్తున్నది. రెసిడెన్షియల్, రహదారుల పక్కన ఉన్న కమర్షియల్ స్థలాలు, అపార్ట్ మెంట్ ఫ్లాట్ల విలువలు సవరణ దాదాపు పూర్తయిందని చెబుతున్నారు. ఖాళీ స్థలాలు, అపార్టమెంట్లకు సంబంధించి రికార్డు విలువపై 30 నుంచి 50 శాతం వరకు పెంచనున్నారని సమాచారం.
2021లో ఇదీ పెంపుదల
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2021 జూలై నెలలో భూముల విలువలు, రిజిష్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. అప్పటి వరకు ఆరు శాతంగా ఉన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలను 7.5 శాతానికి పెంచింది. వ్యవసాయ భూముల కనిష్ట మార్కెట్ విలువ ఎకరాకు రూ.75వేలు గా ఖరారు చేశారు. లేఅవుట్ ప్లాట్ల చదరపు గజం కనీసం ధర రూ.100 నుంచి రూ.200లకు పెంచారు. ఇదే విధంగా అపార్ట్ మెంట్లలో చదరపు అడుగుకు కనీస విలువ రూ.800 నుంచి రూ.1,000కు పెంచారు. స్లాబుల వారీగా 20 శాతం నుంచి 50 శాతం వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. భూముల, ఇళ్లు, అపార్ట్ మెంట్ ప్లాట్లు, లే అవుట్ ఫ్లాట్ల క్రయ విక్రయాలపై స్టాంపు డ్యూటీ 4 శాతంగా డగా ట్రాన్స్ ఫర్ డ్యూటీ 1.5 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 0.5 శాతంగా ఉంది. మొత్తంగా 6 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలను చెల్లిస్తున్నారు. దీన్ని 7.5 శాతం వరకు పెంచారు. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో 2013లో భూముల విలువలు సవరించారు.
ఇవి కూడా చదవండి :
రిజిస్ట్రేషన్లకు కొత్త రూల్.. సర్వే మ్యాపు ఉంటేనే ఇకపై రిజిస్ట్రేషన్.. భూ సమస్యలకు చెక్
పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే.. అవి వచ్చాకే నిర్వహణ..
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram